Feb 23,2021 20:51

న్యూఢిల్లీ బ్యూరో: ఈశాన్య ఢిల్లీ అల్లర్లు జరిగి ఏడాది అవుతోందని, ఈ దాడుల్లో బాధితులుగా ఉన్న వారికి ఇప్పటికీ న్యాయం జరగకపోవడం ఏంటని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ ప్రశ్నించారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం బిజెపి పోలీసులను ఉపయోగించుకొని నిజాన్ని హైజాక్‌ చేసి, ఉద్దేశపూర్వకంగా న్యాయాన్ని అణచివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లర్లపై నిష్పక్షపాత, స్వతంత్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. మంగళవారం నాడిక్కడ సిపిఎం ఢిల్లీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి కెఎం తివారి నేతఅత్వంలో ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఢిల్లీ అల్లర్లలో కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధితులు కొంతమంది కూడా తమ గోడును వినిపించారు. తమకి ప్రభుత్వం నుంచి ఎటువంటి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
బృందాకరత్‌ మాట్లాడుతూ అల్లర్ల నిందితులను పోలీసులు పట్టుకోలేకపోయారని విమర్శించారు. ఈ ఘటనలకు సంబంధించి బిజెపి నేత కపిల్‌ మిశ్రాని ఒక్కసారి విచారించకపోవడాన్ని ఆమె ఆక్షేపించారు. 'అవసరమైతే మళ్ళీ తాను ఏది చేశానో అది మళ్లీ చేస్తాను' అని మిశ్రా చేసిన హెచ్చరికలను ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. దీని ద్వారా విద్వేషకారులకు బిజెపి ఏ విధంగా మద్దతునిస్తోందో తెలుస్తుందని అన్నారు. సిఎఎ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గనవారిపై అక్రమంగా దేశద్రోహం, ఢిల్లీ అల్లర్ల సంబంధిత కేసులు బనాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్న కపిల్‌ మిశ్రాని తక్షణమే అరెస్టు చేయాలని బృందాకరత్‌ డిమాండ్‌ చేశారు. టెలిగ్రామ్‌ ద్వారా ఆయన పంపుతున్న సందేశాలను ఇటీవల న్యూస్‌లాండ్రీ అనే ఆంగ్ల పోర్టల్‌ చేసిన పరిశోధనాత్మక కథనంలో వెల్లడించిందని పేర్కొన్నారు. మైనార్టీలకి వ్యతిరేకంగా ఆయన విస్తృతంగా విద్వేష కథనాలు రాయిస్తున్నారని మండిపడ్డారు. సిఎఎ వ్యతిరేక అల్లర్లు, రైతు చట్టాలపై ఉధృతంగా ఆందోళన చేస్తున్న వారిని దేశ ద్రోహులని ముద్ర వేస్తున్నారని అన్నారు. రైతు ఉద్యమానికి మద్దతు ఇచ్చిన గ్రేటా థన్‌బర్గ్‌, దిశా రవిలపై కేసులు బనాయించడం ప్రజాస్వామ్య ఉద్యమకారులను అణచివేతలో భాగమే అన్నారు. ఉద్యమకారుల మీద కాకుండా ఇటువంటి విద్వేషకారులపై తక్షణమే చర్యలు తీసుకోని, ఆయన్ని అరెస్టు చేయాలని బృందాకరత్‌ డిమాండ్‌ చేశారు. ఢిల్లీ అల్లర్ల బాధితులకి న్యాయం జరిగేదాకా సిపిఎం అండగా ఉండి పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో ఐద్వా నేత ఆశా శర్మ, ఎస్‌ఎఫ్‌ఐ నేత ఐషీ ఘోష్‌, బాధితుల కుటుంబీకులు పాల్గన్నారు.
                                         నా భర్తని చావకొట్టారు : మల్లికా, ఢిల్లీ అల్లర్ల మృతుడి భార్య
అల్లర్ల జరుగుతున్న సమయంలో బిజెపి నేత కపిల్‌ మిశ్రా మద్దతుదారులు భజన్‌పురాలోని తమ ఇంటిలోకి చొరబడి నా భర్తపై విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారని మల్లికా అనే బాధితురాలు కన్నీటిపర్యంతం అయ్యారు. జై శ్రీరామ్‌ అంటూ ఉచ్చరించాలని కొట్టారని, ఆ దెబ్బలను తాళలేక తన భర్త జై శ్రీరామ్‌ అని ఉచ్చరించినప్పటికి చితక్కొట్టారని తెలిపారు. దీంతో ఆయన అపస్మారస్థితిలోకి వెళ్లడంతో ఆసుపత్రికి తీసుకెళితే చనిపోయారని చెప్పారని తెలిపారు. ఇప్పటికీ కూడా తమకి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పోస్టుమార్టం నివేదిక ఇవ్వడం లేదని, పోలీసు స్టేషన్‌కి వెళితే ఏ అధికారి కూడ స్పందించడం లేదని, కనీసం నష్టపరిహారం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.