శుక్రవారం, 09 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కాకినాడలో కదం తొక్కిన నిరుద్యోగులు..

07 సెప్టెంబర్, 2026

Massive protest rally by police job candidates
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 08, 2026, 12:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- పోలీసు శాఖలో ఖాళీలన్నీ భర్తీ చేయాలని భారీ ర్యాలీ

- కలెక్టరేట్ ముట్టడి

ప్రజాశక్తి - కాకినాడ : పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులనూ భర్తీ చేయాలని కోరుతూ కాకినాడలో నిరుద్యోగ యువత సోమవారం కదంతొక్కింది. కొండయ్యపాలెం బ్రిడ్జి జెండా సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించింది. మధ్యలో భానుగుడి సెంటర్‌లోనూ, వివేకానంద పార్క్ సెంటర్‌లోనూ నిరుద్యోగులు రోడ్డుపై బై‌ఠాయించి నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌‌ను ముట్టడించారు. పోలీసు శాఖలో 20 వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని నినదించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు వంతల రాంబాబు మాట్లాడుతూ పోలీసు శాఖలో 19,999 ఖాళీలు ఉన్నాయని అసెంబ్లీలో హోం మంత్రి అనిత గతంలో ప్రకటించారని గుర్తు చేశారు. 11,639 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతిని బోర్డు కోరిందని, కానీ ప్రస్తుతం ప్రకటించిన జాబ్ కేలండర్‌‌లో ఆ మేరకు జాబులు లేవని తెలిపారు. ఖాళీలతో, నిరుద్యోగులతో సంబంధం లేకుండా కేవలం 1,600 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధపడటం సిగ్గుచేటన్నారు. గత ఏడేళ్లుగా నోటిఫికేషన్ లేనందున అర్హత వయస్సు 35 సంవత్సరాలకు పెంచాలని కోరారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.గంగా సూరిబాబు మాట్లాడుతూ పీజీలు చేసిన వారికి ఒక్క ఉద్యోగం కూడా ఉండట్లేదన్నారు. కానీ, ఇంటర్ ఫెయిలైన వారు కూడా మూడు, నాలుగు శాఖలకు మంత్రులుగా ఉన్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని వివరించారు. డివైఎఫ్ఐ జిల్లా నాయకులు టి.రాజా మాట్లాడుతూ నిరుద్యోగంపై ఇప్పటికే అనేక జిల్లాలో ఉద్యమం ప్రారంభమైందని, రాష్ట్ర ప్రభుత్వం పోస్టులు పెంచకుంటే ‘చలో విజయవాడ’కు పిలుపునిస్తామన్నారు. అనంతరం కాకినాడ జిల్లా కలెక్టర్ ఎం.హరేంధిర ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్