Oct 28,2021 14:51

ప్రజాశక్తి -నందికొట్కూరు
పెంచిన పెట్రోల్‌ ,డీజిల్‌ ,వంటగ్యాస్‌, విద్యుత్‌ ఛార్జీల ధరలు తగ్గేవరకు పోరాటం కొనసాగిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు, జిల్లా నాయకులు కె భాస్కర్‌ రెడ్డి హెచ్చరించారు . నందికొట్కూరు మండలంలో సిపిఎం నాయకులు పి పకీర్‌ సాహెబ్‌ ఆధ్వర్యంలో గురువారం నరేంద్ర మోడీ శవ యాత్ర ను నిర్వహించారు. స్థానిక సిపిఎం కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ యాత్ర కొత్త బస్టాండ్‌ కేజీ రోడ్డు మీదుగా పాత బస్టాండ్‌ నుండి స్థానిక పటేల్‌ సెంటర్‌ వరకు సంప్రదాయం ప్రకారం కుండ చేతపట్టుకొని పూలు, బరుగులు చల్లుకుంటూ ర్యాలీ నిర్వహించారు. నరేంద్ర మోడీ శవయాత్రను దగ్ధం చేయకుండా స్థానిక ఎస్‌ఐ , పోలీస్‌ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో సిపిఎం నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో నరేంద్ర మోడీ దిష్టిబమ్మను దగ్ధం చేయకుండా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ రోజు రోజుకు పెట్రోల్‌ ,డీజిల్‌ ,గ్యాస్‌, విద్యుత్‌ ఛార్జీలు పెంచడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలపై భారాలు వేసి పెట్టుబడిదారులకు కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్నాడని విమర్శించారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.70లు ఉన్న పెట్రోల్‌ ధరలు వందకు పైగా పెంచారు. గ్యాస్‌ ధర రూ.450 నుండి రూ.1000వరకూ పెంచారు. నిత్యవసర ధరలు కందిపప్పు , పామాయిల్‌ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. విద్యుత్‌ ఛార్జీలు పెనుభారంగా తయారయ్యాయని వారు ఆరోపించారు. తక్షణమే పెంచిన పెట్రోల్‌ ,డీజిల్‌ ,గ్యాస్‌, విద్యుత్‌ ఛార్జీలు తగ్గించకపోతే సిపిఎం ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు, ఆటో కార్మికులు, డప్పు కళాకారులు, శ్రీనివాసులు, రామకఅష్ణ, మద్దిలేటి తిరుపాలు, జయ , రాణ,ి రజిత, మధులత, ఈశ్వరమ్మ ,త్యాగరాజు ,తిరుపాలు, భూషణం, సుంకన్న వెంకటేశ్వర్లు , నాగేశ్వరరావు, అప్సర్‌ ,రవి తదితరులు పాల్గొన్నారు.