Nov 30,2020 21:24

మద్యం అమ్మకం

   ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలను క్రమంగా తగ్గిస్తామని ప్రకటించింది. అందుకే మద్యం ధరలను పెంచినట్టు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కోవిడ్‌ లాక్‌డౌన్‌ అమలు జరుగుతున్న మే నెలలో ధరలను అమాంతం పెంచింది. అయితే సెప్టంబరులో వీటిని తగ్గిస్తూ మరోమారు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు జారీ చేశాక మద్యం ధరలు చాలా వరకు తగ్గాయి. ధరలు తగ్గాక మద్యం అమ్మకాల జోరు పెరిగింది. ఈ మూడు మాసాల్లో దాదాపు రెట్టింపుగా మద్యం అమ్మకాలు పెరగడం గమనార్హం.
మే నెలలో మద్యం ధరలు ఒక్కసారి పెరగడంతో అమ్మకాలు చాలా వరకు తగ్గిపోయాయి. జులై, ఆగస్టు నెలల్లో చూసినప్పుడు నెలకు సగటున 50 వేల కేసుల వరకు మాత్రమే లిక్కరు అమ్మకాలు జరుగుతూ ఉండేవి. బీర్లు 12 వేల నుంచి 13 వేల కేసుల్లోపు అమ్మకాలు సాగాయి. అయితే సెప్టంబరు నెలలో మద్యం ధరలు తగ్గిన తరువాత చూస్తే అమ్మకాలు రెట్టింపు అయ్యాయి. సెప్టంబరు, అక్టోబరు, నవంబరు మూడు మాసాల్లోనూ ఈ పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది.
రూ.599 కోట్ల మద్యం అమ్మకాలు
      కోవిడ్‌ తరువాత మే నెల నుంచి మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే జిల్లాలో మద్యం అమ్మకాలు రూ.599.78 కోట్లు జరిగాయి. 5.24 లక్షల కేసుల లిక్కరు, 1.78 లక్షల కేసుల బీర్లు అమ్మకాలు సాగాయి. ఇక నెలల వారీగా చూసినప్పుడు మే నెలలో రూ.85 కోట్లు అమ్మకాలు జరిగాయి. జూన్‌ నెలలో రూ.83 కోట్లు, జులైలో రూ.68 కోట్లు, ఆగస్టులో రూ.65 కోట్లు అమ్మకాలు జరిగాయి. ధరలు తగ్గిన తరువాత సెప్టంబరులో రూ.94 కోట్లు అమ్మకాలు జరిగాయి. ఇది 2019 సెప్టంబరు నెలలో జరిగిన అమ్మకాల కంటే అధికంగా ఉండడం గమనార్హం. అంతకు మునుపు ఏడాది సెప్టంబరు నెలలో రూ.84 కోట్లు మాత్రమే అమ్మకాలు జరిగాయి. అక్టోబరులో రూ.96 కోట్లు, నవంబరులో రూ.97 కోట్లు మద్యం విక్రయాలు జరిగాయి. మొత్తంగా చూసినప్పుడు మద్యం ధరలను తగ్గించిన తరువాత విక్రయాలు ఊపందుకున్నాయి.
కర్నాటక టెట్రా ప్యాకెట్లకు డిమాండ్‌
       సెప్టంబరులో మద్యం ధరలు తగ్గించక మునుపు వరకు కర్నాటక నుంచి మద్యం అక్రమంగా అధికంగా తరలి వస్తూ ఉండేది. అయితే ఇవి తగ్గిన తరువాత కొంత అక్రమ మద్యం తగ్గినట్టు సెబ్‌ అధికారులు చెబుతున్నారు. అయితే టెట్రా ప్యాకెట్లు మాత్రం జిల్లాలో అధికంగా వస్తున్నాయి. 90ఎంఎల్‌ ఉండే ఈ ప్యాకెట్టు కర్నాటకలో రూ.50లోపే ఉంటోంది. జిల్లాలో దీనిని రూ.70 నుంచి రూ.80 వరకు విక్రయించి కొంతమంది సొమ్ము చేసుకుంటున్నారు. రోజు వారీగా కూలి పనికెళ్లే వారు ఎక్కువగా ఈ ప్యాకెట్లు తాగేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు ఏడు లక్షల టెట్రా ప్యాకెట్లను పట్టుకున్నట్టు సెబ్‌ అధికారి రామమోహన్‌ రావు తెలిపారు. ఈ స్థాయిలో ఆప్యాకెట్లను సెబ్‌ అధికారులు పట్టుకున్నారంటే జిల్లాలోకి అవి ఏ మేర వస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.