Feb 03,2021 19:11

న్యూఢిల్లీ : మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో కనివినీ ఎరుగని రీతిలో ఆందోళన చేస్తున్న రైతాంగానికి సమీప రాష్ట్రాల ప్రజలు పంపించే ఆహారం, నీరు, ఇతర నిత్యావసరాలను అడ్డుకోవడానికి ఢిల్లీ పోలీసులు తీసుకున్న చర్యలను సిపిఎం పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకు ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీ జల్‌ బోర్డు వాటర్‌ ట్యాంకర్‌ల ద్వారా రైతులకు నీరు సరఫరా చేస్తోంది. ఇప్పుడు దాన్ని నిలుపుచేయడం దారుణమని పొలిట్‌బ్యూరో విమర్శించింది. ఢిల్లీ ప్రభుత్వం అధీనంలో వున్న కార్పొరేషన్‌ ఇది. పైగా, టాయిలెట్లు, ఇతర ఆరోగ్య పరిశుభ్రతకు సంబంధించిన చర్యలన్నింటిని ఇప్పటివరకు గురు తేజ్‌ బహదూర్‌ స్మారక్‌ వద్ద ఢిల్లీ ప్రభుత్వం అందిస్తూ వస్తోంది. కరోనా సమయంలో ఈచర్యలు చాలా కీలకమైనవి కూడా. కానీ ఢిల్లీ పోలీసులు వాటిని బలవంతంగా ఖాళీ చేయించారని పొలిట్‌బ్యూరో విమర్శించింది. తమ స్వంత ప్రభుత్వ ఆస్తులను ఉపయోగిస్తూ, తమ విధులను నిర్వర్తిస్తున్న ఢిల్లీలోని ఎన్నికైన ప్రభుత్వాన్ని ఇలా అడ్డుకోవడం చట్ట వ్యతిరేకమని పొలిట్‌బ్యూరో వ్యాఖ్యానించింది. రైతుల న్యాయబద్ధమైన డిమాండ్లను ఆమోదించడానికి తిరస్కరిస్తున్న కేంద్రం, తన పరిధిలోని ఢిల్లీ పోలీసులతో ఇటువంటి అమానవీయమైన చర్యలకు పాల్పడుతోందని పొలిట్‌బ్యూరో ప్రకటన పేర్కొంది. రైతులను ఆకలితో అల్లాడేలాచేసి ఆందోళనలను అడ్డుకోవాలన్నది కేంద్రం పన్నాగంగా వుందని విమర్శించింది. అయితే కేంద్రం తీసుకునే ఇటువంటి అమానుష చర్యల కారణంగా తమ ఆందోళనలను అడ్డుకోలేరని రైతు నేతలు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ పోరాటాన్ని మరింత బలోపేతం చేసేందుకు మరింత మంది రైతులు వచ్చి చేతులు కలుపుతుండడంతో వారి కృతనిశ్చయం, అకుంఠిత దీక్ష మరింత ధృడతరమయ్యాయి. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఇటువంటి అమానుష, నిరంకుశ చర్యలను విరమించుకోవాలని సిపిఎం పొలిట్‌బ్యూరో డిమాండ్‌ చేసింది. ఆహారం, నీరు, ఇతర నిత్యావసరాలు, పారిశుధ్య సౌకర్యాలు అందకుండా అడ్డుకోరాదని కోరింది. తక్షణమే ఈ చర్యలను విరమించి, అమానుషమైన ఆంక్షలను, నిర్బంధాలను ఉపసంహరించాలని ఢిల్లీ పోలీసులను వెంటనే ఆదేశించాల్సిందిగా పొలిట్‌బ్యూరో కేంద్రాన్ని కోరింది.