Apr 14,2021 21:12

న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్‌ పేసర్‌ అన్రిచ్‌ నోర్ట్జే కరోనాబారిన పడ్డాడు. నోర్ట్జే కరోనా బారినపడిన విషయాన్ని ఆ ఫ్రాంచైజీ ధృవీకరించనప్పటికీ నోర్ట్జే రెండోసారి క్వారంటైన్‌లో ఉన్నట్లు సమాచారం. తొలిసారి పరీక్షల్లో నెగెటివ్‌ రిపోర్టురాగా.. మరోసారి జరిపిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ రావడంతో క్వారంటైన్‌లోకి వెళ్ళాడు. ఐపిఎల్‌ ఆడేందుకు దక్షిణాఫ్రికానుంచి ముంబయికు వచ్చిన నోర్ట్జే నిబంధనల ప్రకారం వారం రోజులు క్వారంటైన్‌లో ఉన్నాడు. ఢిల్లీ ప్రారంభ మ్యాచ్‌ ఆడే ముందురోజు జరిపిన పరీక్షల్లో అక్షర్‌ పటేల్‌ కరోనాబారిన పడగా.. తాజాగా నోర్ట్జే ఆ జాబితాలో చేరాడు. ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ గాయంతో జట్టుకు దూరం కాగా.. కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న పంత్‌.. చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్‌ను 7 వికెట్ల తేడాతో గెలిపించిన సంగతి తెలిసిందే.