Nov 29,2020 19:13

న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతుల ఆందోళనల్లో విషాదకర సంఘటన జరిగింది. కారులో మంటలు చెలరేగడంతో అందులో నిద్రిస్తున్న జనక్‌ రాజ్‌ అనే రైతు సజీవదహనమయ్యాడు. ఈ ఘటన శనివారం రాత్రి ఢిల్లీ హర్యానా సరిహద్దులోని బహదుర్‌ఘర్‌లో జరిగింది. బర్నాలాజిల్లాలోని ధనౌలా గ్రామానికి చెందిన జనక్‌ రాజ్‌ ట్రాక్టర్లను మరమ్మత్తు చేస్తుంటాడు. ఢిల్లీలో ఆందోళనలో పాల్గనేందుకు వచ్చిన రైతుల ట్రాక్టర్ల సమస్యలను పరిష్కరించేందుకు స్వచ్చంధంగా ఆయన కూడా ఢిల్లీకి వచ్చాడు. నిరసన అనంతరం శనివారం రాత్రి కారులో నిద్రిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో జనక్‌రాజ్‌ మంటల్లో సజీవదహనమయ్యాడు. కాగా, ఈ ఘటనపై శిరోమణి అకాలీదళ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రైతు కుటుంబసభ్యులకు సంఘీభావం ప్రకటించింది. రైతు ఉద్యమంలో అతని పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలిపింది. భారతీయ రైతు సంఘానికి (ఉగ్రహాన్‌) చెందిన రైతు జనక్‌రాజ్‌ మరణవార్త బాధ కలిగించిందని హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ ట్వీట్‌ చేశారు. కాగా, మోడీ సర్కార్‌ ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక నూతన వ్యవసాయచట్టాలను నిరసిస్తూ.. రైతులు ఢిల్లీలో నాలుగు రోజులుగా ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే.