Oct 28,2021 19:20

న్యూఢిల్లీ  :  యువతిని కిడ్నాప్‌ చేశారంటూ యువకుని తండ్రిని, సోదరుడిని యుపి పోలీసులు అదుపులోకీ తీసుకోవడంపై ఢిల్లీ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిద్దరూ పెళ్లి చేసుకున్నారని.. అక్రమంగా కేసులు బనాయించడాన్ని సహించబోమంటూ కోర్టు మండిపడింది. ఈవిధంగా కేసుల్లో ఇరికించడం యుపిలో అయితే కుదురుతుందేమో కాని ఢిల్లీలో సాధ్యం కాదంటూ యుపి పోలీసులకు చీవాట్లు పెట్టింది. పరస్పర అంగీకారంతో, ఇష్టంతో ఈ ఏడాది జులైలో తాము పెళ్లి చేసుకున్నారని ఆ దంపతుల తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే ఆ యువతి తల్లిదండ్రులు పెళ్లికి అభ్యంతరం చెప్పారని, యువకుడిని పలుమార్లు బెదిరించారని అన్నారు. యువతిని కిడ్నాప్‌ చేశారంటూ ఆగస్టు ఆరు, ఏడు తేదీల్లో యువకుని తండ్రి, సోదరుడిని యుపి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు.

ఢిల్లీలో ఇటువంటి చట్ట విరుద్ధమైన చర్యలకు తావులేదని జస్టిస్‌ ముక్తా గుప్తా యుపి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ప్రతి చర్యలోనూ చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ మండిపడింది. యువతి మేజరా, మైనరా తెలుసుకోకుండా ఎలా చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. కాగా, యువతి తల్లి ఫిర్యాదు మేరకు ఐపిసి సెక్షన్‌ 366 కింద ఆ ఇద్దరిని అరెస్ట్‌ చేశామని యుపి పోలీసులు తెలిపారు. షామ్లి జిల్లాలోని కుధానా బస్‌స్టాండ్‌ నుండి వారిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. అయితే ఢిల్లీకి చెందిన వారిద్దరూ షామ్లి ఎందుకు వచ్చారన్న అంశంపై యుపి పోలీసులు సమాధానమివ్వలేకపోయారు. మరోవైపు నివాసం నుండి వారిని అదుపులోకి తీసుకున్నారని యువకుని కుటుంబసభ్యులు తెలిపారు. ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా యువకుని తండ్రి, సోదరుని యుపి పోలీసులు అరెస్ట్‌ చేయడం సాధ్యం కాదని న్యాయస్థానం పేర్కొంది. మేజరైన యువతి తన ఇష్టపూర్వకంగా ఆ యువకుడిని వివాహం చేసుకున్నప్పుడు ఐపిసి సెక్షన్‌ 366 కింద ఎలా నేరంగా పరిగణించారని.. అసలు యువతి నుండి వాంగ్మూలాన్ని రికార్డు చేయకుండా అరెస్ట్‌లు ఎలా జరిగాయంటూ కోర్టు నిలదీసింది.