Oct 27,2021 18:43

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మేయర్‌ సుంకర పావని

మాజీ మేయర్‌ సుంకర పావని
ప్రజాశక్తి - కాకినాడ
అవినీతికి కేరాఫ్‌గా ఉన్న కాకినాడ సిటీ ఎంఎల్‌ఎ ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి తనపై అవినీతి ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని మాజీ మేయర్‌, టిడిపి కాకినాడ పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని అన్నారు. బుధవారం స్థానిక కల్పనా సెంటర్‌లో మాజీ మేయర్‌ సుంకర పావని ఇంటి వద్ద విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఎంఎల్‌ఎ ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి అవినీతికి చిరునామా అన్నారు. అటువంటి నాయకునితో కలిసి పనిచేయడం కంటే మేయర్‌గా గద్దె దిగడం ఉత్తమంగా భావిస్తున్నానని పావని పెర్కొన్నారు. నగర పాలక సంస్థలో సమాంతర పాలన కోసం ఎక్స్‌ అఫీషియో రూం ఏర్పాటు చేసుకుని పెత్తనం చెలాయించారన్నారు. ఇది నిజం కాదని ఎంఎల్‌ఎ ద్వారంపూడి చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. మేయర్‌ ఎన్నిక నేరుగా జరగలేదని, కార్పోరేటర్‌గా గెలిచానని హేళన చేస్తున్న ద్వారంపూడికి రాజ్యాంగం తెలియదన్నారు. ముఖ్యమంత్రి కూడా ఎంఎల్‌ఎగా గెలుపొందిన వారేనని గుర్తించాలన్నారు. మడ అడవుల్లో మట్టి ఫిల్లింగ్‌ కోసం వెచ్చించిన నిధుల్లో అవినీతి జరిగిందని, అందులో ఎంఎల్‌ఎ హస్తం ఉందని ఆరోపించారు. అన్ని వివరాలు త్వరలో బయట పెడతానని సుంకర పావని పేర్కొన్నారు.