Jan 21,2021 18:43

దరఖాస్తు చేసుకొన్న 90 రోజుల్లో మళ్లీ ఇళ్లు ఇస్తాం
మంత్రి పేర్ని నాని
కలెక్టరేట్‌ : అర్హత ఉంటే మళ్లీ ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, 90 రోజుల్లో మళ్లీ ఇస్తామని ఇళ్ల స్థలాల పంపిణీ ఒక నిరంతర పక్రియగా కొనసాగుతుందని రాష్ట్ర రవాణా, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. గురువారం ఆయన తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలిసి వారి ఇబ్బందులను గూర్చి అడిగి తెలుసుకొన్నారు. కొన్నింటికి మంత్రి పేర్ని నాని అక్కడికక్కడే తక్షణ పరిష్కారం సూచించారు. తొలుత బందరు మండలం సుల్తాన్‌ నగరానికి చెందిన పామర్తి చిట్టెమ్మ, వీరంకి శివరాణి , పోతేపల్లి పంచాయితీ పరిధిలోని ఉల్లిపాలెం గ్రామానికి చెందిన అనిశెట్టి కావ్య మంత్రి పేర్ని నానిని కలిసి తమకు ఇళ్ల స్థలం రాలేదని వాపోయారు. ఈ విషయమై స్పందించిన మంత్రి మాట్లాడుతూ ఎందుకు స్థలం రాలేదో కారణం చెప్పకుండా లబ్ధిదారుల పేర్లు ఎట్టి పరిస్థితుల్లో తొలగించబోరన్నారు. స్థానికంగా కాపురం లేకపోయినా, స్వంత స్థలం ఉన్నా ప్రభుత్వం ఇంటి స్థలం మంజూరు చేయబోదన్నారు. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఆసరా, చేయూత, పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా అవినీతి లేకుండా మహిళలకు నేరుగా అకౌంట్లలో జమ చేశామని గుర్తు చేశారు. ఇళ్ల స్థలాలు, నిర్మాణం మహిళల పేరుతో వారికే నేరుగా ఇస్తున్నామన్నారు. కులం, మతం, పార్టీలు చూడలేదని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇచ్చామన్నారు. ఓ బాధ్యతగా ఇల్లు లేని వారికి నిర్మాణం చేసి ఇస్తున్నామని మంత్రి పేర్ని నాని అన్నారు.