Nov 05,2020 19:51

        ఒకప్పుడు గ్రామస్తులకు సమాచారం తెలిపేందుకు (చాటింపుకు) ఉపయోగించిన డప్పు...ఆ తర్వాత గొప్ప వాద్య పరికరంగా రూపుదిద్దుకొని...ఖండాంతర ఖ్యాతిని ఆర్జించింది. దీనిపై అనేక పరిశోధనలు చేసి..ఒక శాస్త్రీయమైన వాద్యంగా తీర్చిదిద్దిన ఖ్యాతి రాష్ట్రంలో దాసరి అమృతయ్య, జుజ్జువరపు ఏసుదాసులకే దక్కుతుంది. వారి తరువాత కూలి పని చేసుకుంటూనే రాష్ట్రంలో వేలాది మంది డప్పు కళాకారులను తీర్చిదిద్దిన ఘనత ఏసుదాసు తమ్ముడు బసవయ్యది. ఆయన దగ్గర శిష్యరికం చేసిన ఎందరో విద్యార్థులు నేడు డప్పు వాయిద్యాన్ని విశ్వవ్యాపితం చేస్తున్నారు. కూలి పనులు చేసిన చేతి తోనే తెలుగు విశ్వవిద్యాలయంలో డప్పు ఆచార్యుడుగా పనిచేస్తూ.. వృద్ధాప్యంలో ఉన్నా.. కాళ్లు, చేతులూ సహకరించకున్నా.. ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ఉత్తేజభరితంగా ప్రదర్శనలిచ్చేవారు జుజ్జువరపు బసవయ్య. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ మంగళవారం తన స్వగ్రామమైన కృష్ణాజిల్లా ఉంగుటూరులో ఆయన కన్నుమూశారు.
        ఓ నిరుపేద దళిత కుటుంబంలో జన్మించిన బసవయ్య.. కుటుంబాన్ని పోషించడానికి 14వ ఏటనే పొలాల్లో కూలి పనికి వెళ్లాల్సి వచ్చింది. ప్రజా కళాకారుడైన తన అన్న ఏసుదాసుపై ప్రభుత్వం నిర్బంధం విధించడంతో ఆయన మద్రాసులో రహస్య జీవితం గడుపుతూ సినీ రంగంలో పని చేయడానికి కుదిరారు. చెల్లి ఆలనా పాలనా చూడాల్సిన తల్లిదండ్రులు జబ్బున పడ్డారు. వీరందరినీ పోషించడానికి ఏడో తరగతి చదువుకు స్వస్తి చెప్పి కూలి పనులకు వెళ్లక తప్పింది కాదు బసవయ్యకు. సోదరుడి ప్రేరణతో ఆ కళను తానూ నేర్చుకోవాలనుకున్నాడు. కాని కూలికి వెళ్లకపోతే రోజు గడిచే పరిస్థితి లేదు. పైగా నేర్చుకోవడానికి డప్పు లేదు. దాంతో రాత్రుళ్లు ఇంట్లో పళ్లాల మీద సాధన చేసేవాడు. ఒక్కోసారి పని విరామ సమయాల్లో ఎవరూ చూడకుండా తన పొట్ట మీదే దరువు వేసేవాడు. ఇలా కొద్ది కాలానికి వాద్యంపై అలవోకగా చేతులు కదిలించగలిగే సామర్థ్యం సంపాదించాడు.

మట్టి పని నుంచి.. విశ్వవిద్యాలయ డప్పు ఆచార్యుడు వరకూ...
          ఆ తరువాత తన అన్న మిత్రుడైన బకినాల సుబ్బారావు దగ్గర డప్పు వాయిద్యంలో కొన్ని మెళకువలు నేర్చుకున్నాడు. అయితే శిక్షణ క్రమబద్ధంగా జరిగేది కాదు. ఏ వారానికో పది రోజులకో ఒక్కసారి మాత్రమే నేర్చుకోవడం జరిగేది. గురువు దగ్గర ఆ ఒక్క రోజు నేర్చుకున్నది ఆ పది రోజులూ సాధన చేసేవాడు. ఎలాగయితేనేం తన 15వ ఏటకల్లా జతులను.. త్రిశ్రజాతి, చతురస్రజాతి, మిశ్రజాతి, ఖండజాతి, సంకీర్ణజాతి వంటి వాద్య ప్రక్రియలను సశాస్త్రీయంగా నేర్చుకున్నానని ఒక సందర్భంలో బసవయ్య చెప్పాడు. తొలి ప్రదర్శన స్వగ్రామంలోనే ఇచ్చాడు. మరో ఐదేళ్లకు (20వ ఏట) పలువురికి శిక్షణ ఇచ్చే గురువుగా తయారయ్యాడు.
క్రమంగా గ్రామంలో ఓ 20 మందితో డప్పు వాయిద్య బృందాన్ని తయారు చేశాడు. గంటల తరబడి ప్రదర్శన ఇవ్వగల డప్పు లయ విన్యాసాన్ని నేర్పాడు. తానూ అనేక ప్రయోగాలు జరిపి మిమిక్రీ కూడా పలికించేవాడు. దేవరపెట్టె, జాతరపెట్టె, పల్లెసుద్దులు వంటి జానపద కళారూపాలు కూడా తయారు చేశాడు. ఒక బృందం తర్వాత మరో బృందాన్ని ఇలా వందలాది బృందాలను తయారు చేశాడు. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లా యల్లాయపాలెంలో తెలుగు విశ్వవిద్యాలయం నేతృత్వంలో ఏర్పాటు చేసిన డప్పు వాయిద్య శిక్షణా శిబిరానికి శిక్షకుడుగా నియమితులయ్యాడు. అక్కడాయన సామర్థ్యాన్ని గుర్తించిన ఆ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ తూమాటి దోణప్ప ఏకంగా విశ్వవిద్యాలయంలోనే డప్పు ఆచార్యుడుగా నియమించారు. ఈ బాధ్యతలను బసవయ్య మూడేళ్లపాటు సమర్థవంతంగా నిర్వహించాడు.
ఆ తర్వాత డప్పుపై నూతన ప్రయోగాలు చేస్తూ కొత్త కళారూపాలను తీర్చిదిద్దుతూ.. రాష్ట్రం లోనూ, పొరుగు రాష్ట్రాల్లోనూ విస్తృతంగా ప్రదర్శనలిచ్చాడు. ఈ విధంగా 10 వేల ప్రదర్శనలిచ్చానని, 100 దళాలను తయారు చేశానని, 2 వేల మంది చేయి తిరిగిన డప్పు కళాకారులను తయారు చేయగలిగానని బసవయ్య చెప్పేవాడు. తాను ప్రదర్శించే డప్పు లయ విన్యాసం, మిమిక్రీ, జానపద కళారూపాలు ప్రజలను విశేషంగా రంజింప చేయగలిగాయనీ వీటి ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేయగలుగుతున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాననీ చెప్పేవాడు.
          బసవయ్యకు ప్రజా నాట్యమండలి అన్నా..కమ్యూనిస్టు పార్టీ అన్నా పంచప్రాణాలు. ఎక్కడే పెద్ద సభ జరిగినా అక్కడ ఆయన ప్రదర్శన ఉండాల్సిందే. 1984లో కలకత్తా సాల్ట్‌ లేక్‌ స్టేడియంలో 10 లక్షల మంది ప్రజలు హాజరైన బ్రహ్మాండమైన బహిరంగ సభలో బసవయ్య ఇచ్చిన ప్రదర్శనను జీవితంలో ఎప్పటికీ మరువలేనని ఒక సందర్భంలో అన్నాడు. అప్పటి పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి జ్యోతిబసు, ఆయన మంత్రివర్గ సహచరులు అవే ప్రదర్శనలను మరుసటి రోజు (ఇప్టా ఆడిటోరియంలో) ప్రత్యేకంగా వేయించుకొని, తనను అభినందించారని గుర్తు చేసుకునేవాడు. డప్పుపై 'బట్టలు కుట్టే మిషన్‌ మీద వచ్చే కుట్టు శబ్దం మొదలు.. హౌరా బ్రిడ్జిపై రైలు పోతున్న శబ్దం' వరకూ బసవయ్య అలవోకగా పలికించేవాడు.
            రాష్ట్రంలో ఎక్కడ ఏ తరహా జానపద పోటీలు పెట్టినా రాష్ట్ర స్థాయి పురస్కారాలన్నీ బసవయ్య బృందానివే. నాటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్‌ శర్మ నుంచి కూడా పురస్కారం పొందాడు. రాష్ట్ర స్థాయి జానపద కళోత్సవాలు (1990), దక్షిణ ప్రాంత జానపద, సంగీత నృత్యోత్సవాలు (1991), కృష్ణా మహోత్సవ్‌ (2001, 2003, 2006), ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)-2000, తానా-2006, ఇంకా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ-దక్షిణ ప్రాంత సాంస్కృతిక కేంద్రం (తంజావూరు) సంయుక్త ఆధ్వర్యంలో ప్రదర్శనలిచ్చాడు. 2012లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లోనూ ప్రదర్శన ఇచ్చాడు. లెక్కకు మిక్కిలి పురస్కారాలు అందుకున్నాడు. 2005లో బసవయ్యకు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం లభించింది. రూ.20 వేల నగదు, ప్రశంసా పత్రాన్ని తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉప కులపతి సి.నారాయణరెడ్డి, ఆవుల మంజులత సమక్షంలో రాష్ట్ర మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు నుంచి స్వీకరించాడు.

మట్టి పని నుంచి.. విశ్వవిద్యాలయ డప్పు ఆచార్యుడు వరకూ...
             ఇన్ని వేల ప్రదర్శనలిచ్చిన బసవయ్య ఒక్క పైసా వెనకేసుకోలేదు. తన కళ ద్వారా ఎంత సంపాదించినా ఇల్లు గడవడానికి మినహా మిగిలిందంతా కళా బృందాలను తయారు చేయడానికే వెచ్చించారు. ప్రభుత్వ రుణంతో కట్టుకున్న ఇల్లు మినహా ఆయనకు సెంటు భూమి లేదు. బ్యాంకు బ్యాలన్సులూ లేవు. ఊపిరి ఉన్నంత వరకూ ఈ కళను ముందుకు తీసుకు వెళ్తానని చెప్పేవాడు. ఆ విధంగానే అనారోగ్యంతో గత ఏడెనిమిదేళ్లుగా ఇంటి పట్టునే ఉంటున్నా...డప్పు కళను ముందుకు తీసుకు వెళ్లేందుకు కృషి చేశాడు. ఆయన మరణం ప్రజా కళలకు తీరని లోటు.
                                                                                                                            -     ఉష్ణ