Jan 14,2021 06:51

కోవిడ్‌-19ని నిరోధించే వ్యాక్సిన్‌లను అత్యవసరంగా వినియోగించేందుకు అనుమతులిచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఔషధ నియంత్రణ అధికారులు వ్యవహరించిన తీరు అత్యంత ఆందోళనకరంగా ఉంది. ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా-సీరం ఇన్‌స్టిట్యూట్‌ తయారు చేసిన కోవిడ్‌షీల్డ్‌ వ్యాక్సిన్‌ కు అత్యవసర వినియోగానికి అనుమతి తొలుత లభించింది. వెంటనే బిజెపి కి చెందిన సోషల్‌ మీడియా అంతా గగ్గోలు పెట్టింది. మన దేశంలో నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ-ఐసిఎంఆర్‌-భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కోవ్యాక్సిన్‌ కు కూడా అనుమతి ఇవ్వలేదెందుకని అంటూ విపరీతంగా ట్రోలింగ్‌ జరిగింది. ఆంగ్లేయ వ్యాక్సిన్‌ కి అనుమతించి స్వదేశీ వ్యాక్సిన్‌ కు అనుమతించలేదంటూ యాగీ జరిగింది. ఇది అత్యంత హేయమైన వ్యాక్సిన్‌ జాతీయవాదం. వ్యాక్సిన్‌ సామర్ధ్యానికి సంబంధించిన శాస్త్రీయమైన, ఆధారాల ప్రాతిపదికన దాని వాడకాన్ని గురించి చర్చించడానికి బదులు...ఆ వ్యాక్సిన్‌ ఏ దేశానికి చెందినదనే దానిని ముందుకు తేవడం సైన్సుకే విరుద్ధం. వీరి డిమాండ్‌ను విమర్శించిన వారందరినీ ఇంగ్లీషు వాళ్ళ ఏజంట్లని, విదేశీ తొత్తులని ఎగతాళి చేశారు (వీళ్ళ నేత స్వదేశీ హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ను నిలువునా ముంచి విదేశీ రాఫెల్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేసిన సంగతి మరిచిపోయినట్టున్నారు).


బిజెపి కి చెందిన సోషల్‌ మీడియా ఒత్తిళ్ళకు లొంగిపోయిన సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్స్‌ ఆర్గనైజేషన్‌ (సిడిఎస్‌ఒ) కోవ్యాక్సిన్‌ కి కూడా అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చేసింది. ఆ సందర్భంగా కొన్ని అదనపు షరతులను పెట్టింది. అయితే కోవ్యాక్సిన్‌ సార్ధకత ఏ మోతాదులో ఉంది అన్న సంగతిని నిర్ధారించే మూడో దశ ప్రయోగాల వివరాలను కోవ్యాక్సిన్‌ ఇంతవరకూ సిడిఎస్‌ఒ కు సమర్పించలేదు. అయినా సిడిఎస్‌ఒ ఆమోదం ఇవ్వడం ఆ సంస్థ ఇంతవరకూ అనుసరించిన విధానానికి విరుద్ధంగా ఉంది. దీనినే ప్రజా సైన్సు ఉద్యమం, శాస్త్రవేత్తలు విమర్శిస్తున్నారు.


భారతీయ శాస్త్రవేత్తలు రెండు విషయాల పట్ల ఆందోళన వెలిబుచ్చుతున్నారు. పారదర్శకత ఏమాత్రమూ లేకపోవడం మొదటిది. కోవిడ్‌షీల్డ్‌ విషయంలో సైతం సిడిఎస్‌ఒ ఎటువంటి సమాచారాన్నీ బహిరంగపరచలేదు. ఏ ప్రాతిపదికన కోవ్యాక్సిన్‌ కు అనుమతులు ఇచ్చారన్నది రెండవది. 'క్లినికల్‌ పరీక్షల తీరులో' ప్రజా సమూహాలకు వ్యాక్సినేషన్‌ చేపట్టడానికి అనుమతించడం అంటే ఏమిటో సిడిఎస్‌ఒ వివరణ ఇవ్వలేదు. తన ప్రకటనలో ''మొదటి, రెండో దశల ఫలితాల ఆధారంగాను, మూడవ దశలో సురక్షితమైనదా కాదా అన్న అంశంపై వెల్లడైన డేటా ఆధారంగాను'' ఈ అనుమతి ఇచ్చినట్టు సిడిఎస్‌ఒ పేర్కొంది. వ్యాక్సిన్‌ సురక్షితమా కాదా అన్న అంశం మొదటి, రెండు దశలకు సంబంధించి నిర్ధారించేది. మూడో దశలో తేలవలసిన అంశం వ్యాక్సిన్‌ సార్ధకత (బాగా పని చేస్తుందా లేదా అన్న అంశం) ఇందుకు సంబంధించి కోవ్యాక్సిన్‌ ఇంకా తన మూడో దశ సమాచారాన్ని సమర్పించనేలేదు. మరి అనుమతి ఎలా ఇచ్చారు?


మన దేశంలో కోవిడ్‌-19 కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కాని అప్పుడే ముప్పు తప్పిపోయిందని చెప్పలేం. కొత్త కేసులు అధికంగా వస్తున్న మొదటి పది దేశాలలో మనం కూడా ఉన్నాం. బ్రిటన్‌ లో, దక్షిణాఫ్రికాలో కొత్త లక్షణాలతో కోవిడ్‌-19 మళ్ళీ విజృంభిస్తోంది. అంటే రెండో విడత కరోనా వ్యాప్తి ప్రమాదం ఇంకా ఉన్నట్టే. అందువలన మన దేశంలో ప్రజానీకానికి అందరికీ వ్యాక్సినేషన్‌ అవసరం. డాక్టర్లు, ఇతర హెల్త్‌ వర్కర్లతో మొదలుబెట్టి, ఆ తర్వాత అత్యవసర సర్వీసులలో ఉండేవారికి, వృద్ధులకు, ఆ తర్వాత ప్రజలందరికీ వ్యాక్సినేషన్‌ చేపట్టాలి. ఇది ఒక పెద్ద సవాలు. అమెరికాలో, ఇతర దేశాలలో కూడా ఈ కార్యక్రమం కొన్ని చోట్ల వికటించిన వార్తలు కూడా వస్తున్నాయి. మరోవైపు అసలు ఏ వ్యాక్సినూ అవసరం లేదనే గోమూత్ర భక్తులూ ఉన్నారు. ఇటువంటి కీలక సమయాల్లో ఆ తరహా మూఢత్వం గాని, శాస్త్ర పరిశోధనలతో నిమిత్తం లేకుండా కేవలం ప్రచారార్భాటంతో రెచ్చగొట్టే బూటకపు దేశభక్తి నినాదాలు గాని అస్సలు పనికిరావు.


ఇక్కడ మనకు కొన్ని విషయాల్లో స్పష్టత ఉండాలి. భారత్‌ బయోటెక్‌ తయారుచేసే కోవ్యాక్సిన్‌ సురక్షితమేనా? అంటే మొదటి, రెండు దశల ప్రయోగాలను బట్టి ఔనని చెప్పవచ్చు. అదేవిధంగా శరీరంలో రోగనిరోధక శక్తిని ప్రేరేపిస్తుందని కూడా ఈ రెండు దశల ప్రయోగాలూ సూచిస్తున్నాయి. అయితే ఇప్పుడు తెలియాల్సింది ఈ వ్యాక్సిన్‌ ప్రేరేపించే రోగనిరోధక శక్తి కరోనా ఇన్‌ఫెక్షన్‌ సోకకుండా అడ్డుకునేంత శక్తివంతమైనదా కాదా అన్నదే. ఈ సంగతి తేల్చుకోడానికే మూడో దశ ప్రయోగాలు చేపట్టారు. ఇంతవరకూ మూడో దశ పూర్తి చేసుకున్న అయిదు రకాల వ్యాక్సిన్లు బయోఎన్‌టెక్‌-పిఫైజర్‌, మోడర్నా, గామాలేయా 90 శాతం సార్ధకతను ప్రదర్శించాయి. చైనా ఉత్పత్తి చేసిన సైనోఫార్మ్‌ 79 శాతం, కోవిషీట్డ్‌ 70 శాతం సార్ధకతను ప్రదర్శించాయి. కనీసం 50 శాతం సార్ధకత అయినా ఉండాలని నియంత్రణ సంస్థలు నిర్దేశిస్తున్నాయి. బహుశా కోవ్యాక్సిన్‌ కూడా ఆ 50 శాతం సార్థకతను ప్రదర్శించవచ్చు.


రోగనిరోధకశక్తిని ప్రేరేపించే రసాయన పదార్ధాన్ని నిద్రాణస్థితిలో ఉంచిన కరోనా వైరస్‌ కి కలిపి కోవ్యాక్సిన్‌ ను తయారు చేశారు. ఆ రసాయన పదార్ధం ఒక అమెరికన్‌ కంపెనీ నుంచి దిగుమతి చేసుకున్నారు. కనుక కోవ్యాక్సిన్‌ స్వదేశీ వ్యాక్సిన్‌ అని జరుగుతున్న ప్రచారంలో పస లేదు.
కోవ్యాక్సిన్‌ బాగానే పని చేసే అవకాశం ఉన్నప్పుడు శాస్త్రవేత్తలు ఎందుకు అభ్యంతరాలు లేవనెత్తుతున్నారు? నిర్దేశించిన విధానాలను, నిబంధనలను కేవలం ఒక వ్యాక్సిన్‌ స్వదేశీ అన్న సాకుతో నియంత్రణ సంస్థే పక్కనపెట్టడం శాస్త్ర పరిశోధనా విధానానికే విఘాతం కలిగిస్తుంది. ఇంతకు ముందే గామాలేయా, పిఫైజర్‌ వ్యాక్సిన్‌లు తమ మూడు ప్రయోగ దశలనూ పూర్తి చేసుకుని, వివరాలు సమర్పించి సిడిఎస్‌ఒ అనుమతికి దరఖాస్తులు చేసుకుని ఉన్నాయి. వాటికి ఇంకా అనుమతులు లభించలేదు. కోవ్యాక్సిన్‌కు సంబంధించి సమాచారం ఏదీ బహిరంగపరచలేదు. అయినా అనుమతించారు. ఇది కూడా శాస్త్రవేత్తలకు ఆందోళన కలిగించే విషయం.


వ్యాక్సిన్‌ సార్ధకతను నిర్ధారించే మూడో దశ ప్రయోగాలలో రెండు సార్లు వ్యాక్సిన్‌ను ఒక వ్యక్తికి ఇస్తారు. రెండు డోసులకు నడుమ 12 వారాల వ్యవధి ఉండాలి. కాని ఆ వ్యవధిని తగ్గించివేశారు. ఈ విషయంలో బ్రిటన్‌ నమూనాను అనుసరిస్తున్నట్టు చెప్తున్నారు. బ్రిటన్‌లో పరిస్థితి తీవ్రంగా ఉంది గనుక అక్కడ ఆ విధంగా వాళ్ళు నిర్ణయించి వుండొచ్చు. కాని అమెరికాలో కూడా పరిస్థితి ఏమీ అదుపులోకి రాలేదు కదా. అక్కడి నియంత్రణ అధికారులు మాత్రం తాము 12 వారాల వ్యవధి రెండు డోసుల నడుమ ఉండేలా...మూడో దశ ప్రయోగాలు జరిపిన తర్వాతే వ్యాక్సిన్‌ సార్ధకతను నిర్ధారిస్తామంటున్నారు. మరి మన దేశంలో ఎందుకీ తొందర?


కోవ్యాక్సిన్‌ విషయంలో రెండు డోసులకూ నడుమ ఎంత వ్యవధి పాటిస్తున్నారో బహిరంగ పరచడం లేదు. వ్యాక్సిన్‌ సరఫరా ప్రణాళిక ఏమిటో తెలియదు. ఏయే తరగతుల వారికి ముందు ఇవ్వబోతున్నారో తెలియదు. ప్రాధాన్యతలేమిటో తెలియదు. రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతేమిటో, అవి నిర్వహించవలసిన పనులేమిటో తెలియదు. ఇదంతా ఏదో అధికారులు చూసుకనే విషయమే కాని ప్రజానీకానికేమీ చెప్పనవసరం లేదు అన్నట్టుగా ఉంది ప్రభుత్వ వైఖరి. ఏ నోటీసూ లేకుండా లాక్‌డౌన్‌ విధించినప్పుడు ఏవిధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిందో ఇప్పుడూ అదే వైఖరిని అనుసరిస్తోంది.


ఈ కరోనా ఫ్లూ వంటి ఇంకొక జబ్బేనని, జనానికి సామూహిక రోగనిరోధక శక్తి వచ్చేస్తుందని, అందుకోసం మనం ఈ వ్యాధి విస్తరణను అరికట్టడానికి తాపత్రయ పడనవసరం లేదని వారించిన వారున్నారు. ఆ వాదనలెంత తప్పో అనుభవం తెలియజేస్తోంది. ఈ తరహా వాదనను ముందుకు తెచ్చి అమలు చేసిన దేశం స్వీడన్‌. అందుకు ఆ దేశం భారీ మూల్యమే చెల్లించింది. ముందే మేల్కొని, పటిష్ట చర్యలతో కరోనాను అరికట్టిన చైనా, కొరియా, వియత్నాం వంటి దేశాలు అతి తక్కువగా ఆర్థిక నష్టాలను చవిచూశాయి. స్వీడన్‌ మాదిరిగా కరోనాను నియంత్రించకుండా ఆర్థిక కార్యకలాపాలను జోరు తగ్గకుండా కొనసాగిద్దామనుకున్న దేశాలన్నీ ఆర్థికంగా మునిగిపోయాయి. అక్కడ ప్రజలే స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌లు అమలు చేశారు. మనం త్వరగా మామూలు స్థితికి రావాలంటే వ్యాక్సిన్‌లు తప్పనిసరి. అందుచేత వ్యాక్సిన్‌ కు సంబంధించి అన్ని నిర్ణయాలూ - సార్ధకత, పంపిణీ ప్రాధాన్యతలు వగైనా- సవ్యంగా జరగాలి.


కాగడాలు వెలిగించడం, పళ్ళేలను మోగించడం, కరోనా పోవాలని గట్టిగా అరవడం, ఏవిధంగానూ మనకి ఉపయోగపడలేదు. ఇవి చాలవన్నట్టు ఇప్పుడు గనుక ఈ వ్యాక్సిన్‌ విషయంలో కూడా అడ్డగోలుగా వ్యవహరిస్తే? ఈ అవకతవక వ్యవహారాన్ని ఇంకెంతమాత్రమూ మనం భరించలేం.
అయితే మన పాలకుల దృష్టి అంతా మధ్య యుగాల వైపుగా శతాబ్దాలు వెనక్కి పోవడం మీద, ఆహారపుటలవాట్ల మీద, నచ్చిన వాడిని వివాహం చేసుకునే హక్కు మీద, గోవుల శాస్త్రం మీద ఉంది. వాస్తవ సైన్సు వీరికి అక్కరలేదు. ఇటువంటి వాళ్ళకి సిడిఎస్‌ఒ లొంగిపోయి వ్యవహరించడం మనకు మంచిది కాదు. ప్రస్తుతం ప్రజారోగ్య వ్యవస్థ కరోనా నుండి ఎదుర్కుంటున్న పెను సవాలు విషయంలో దాపరికంతో వ్యవహరిస్తున్న మోడీ ప్రభుత్వపు నియంతృత్వ వైఖరీ ఆమోదయోగ్యం కాదు.
                                                              * ప్రబీర్‌ పురకాయస్థ (స్వేచ్ఛానుసరణ)