Jan 23,2021 23:41

తొండంగి మండలం కొత్తపాలకు గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు

ప్రజాశక్తి - కాకినాడ ప్రతినిధి 'ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా చేపడుతున్న దివీస్‌ ఫార్మా కంపెనీని నిలిపేసేవరకూ ఉద్యమం ఆగదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు స్పష్టం చేశారు.' 38 రోజులుగా తుని, కాకినాడ, రాజమహేంద్రవరం జైళ్లలో ఉన్న 34 మంది దివీస్‌ ఉద్యమ కారులు శనివారం జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా తొండంగి మండలం కొత్తపాకలుకు వారు చేరకున్నారు. వారికి స్థానికులు పూలమాలలు, బాణసంచాల కాల్పులతో ఘన స్వాగతం పలికారు. కొత్తపాకలులో అంబేద్కర్‌ విగ్రహానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంనతరం సిపిఎం కాకినాడ జిల్లా కార్యదర్శి కెఎస్‌.శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన సభలో మధు మాట్లాడారు. పోలీసులతో దివీస్‌ ఉద్యమాన్ని బలహీన పర్చాలని ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తుందన్నారు. 172 మందిని అక్రమంగా అరెస్టు చేసినా ప్రజలు పోరాడటంలో వెనక్కి తగ్గలేదన్నారు. నాడు టిడిపి ప్రభుత్వం బలవంతంగా భూములను లాక్కుని పరిశ్రమను నెలకొల్పాలని ప్రయత్నం చేయగా తీవ్రంగా వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గిందన్నారు. ప్రస్తుతం వైసిపి ప్రభుత్వం దివీస్‌ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించడడం దుర్మార్గమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దివీస్‌ ఉద్యమానికి మద్దతు తెలిపి బంగాళాఖాతంలో కలిపేస్తామని మాట ఇచ్చిన జగన్‌ నేడు మాట తప్పారన్నారు. బిజెపి నేతల ఆదేశాలతోనే ఇక్కడ దివీస్‌ను ఏర్పాటు చేస్తున్నారన్నారు. దివీస్‌ విషయంలో వెనక్కి తగ్గకపోతే ఊరూరా తిరిగి బైకు ర్యాలీ నిర్వహించి వైసిపికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామన్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించకుండా అడ్డుకుంటామన్నారు. ఆదివారం నుంచే పాదయాత్రలు, బైకు ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. 'చలో కాకినాడ'తో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. తొలుత దివీస్‌ను ఏర్పాటు చేసి భవిష్యత్తులో జిల్లా అంతటా ఫార్మా పార్కుగా మార్చేందుకు మోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతుందన్నారు. వీటి నుంచి వచ్చే కాలుష్యం వల్ల ప్రజల ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. బిజెపి కుట్రకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. అమాయకులపై పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారన్నారు. స్థానిక ఎస్‌ఐ విద్యాసాగర్‌ దుర్మార్గంగా వ్యవహరించిన తీరు సహించరానిదన్నారు. ఆయనపై ఎస్‌పికి, పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. 13 ఏళ్లుగా సెజ్‌లో ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు. సెజ్‌ రైతులకు రూ.20 నుంచి రూ.80 లక్షల వరకూ పరిహారం ఇవ్వాలన్నారు.
ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నాడు స్వాతంత్య్రం కోసం వేలాది మంది అనేక కష్టాలు పడ్డారన్నారు. అదే స్ఫూర్తితో దివీస్‌కు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. దివీస్‌ విషయంలో ఎందుకు మాట తప్పారో జగన్‌ సమాధానం చెప్పాలన్నారు. దివీస్‌పై పిడిఎఫ్‌ ఎంఎల్‌సిలంతా శాసన మండలిలో ప్రశ్నించామన్నారు. నిర్బంధాలను ఎదిరించి దివీస్‌కు వ్యతిరేకంగా నిలబడిన వారికి అభినందనలు తెలిపారు. విజయం సాధించేవరకూ పోరాడాలన్నారు. ఉద్యమానికి పిడిఎఫ్‌ ఎంఎల్‌సిలు అండగా ఉంటామన్నారు.
రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నరసింహారావు మాట్లాడుతూ దివీస్‌ కంపెనీ ఏర్పాటుకు కమిటీలు వేసి కపట మాటలు చెప్పే నాయకులను నమ్మొద్దన్నారు. దివీస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న నాయకులపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దువ్వా శేష బాబ్జి మాట్లాడుతూ వేయి మందిపై కేసులు పెట్టినా దివీస్‌ విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరన్నారు. పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్నారు. అరెస్టు చేసిన నాయకులను లారీలపై తరలించారన్నారు. దీనిపై మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అనంతరం కెఎస్‌.శ్రీనివాస్‌ మాట్లాడారు. దివీస్‌కు వ్యతిరేకంగా 2016 నుంచి ఉద్యమం సాగుతుందన్నారు. ఆదినుంచి సిపిఎం ప్రజలకు అండగా నిలిచిందన్నారు. 38 రోజుల పాటు జైలులో గడిపామన్నారు. ఉద్యమంలో పాల్గొని అరెస్టయిన నాగమణి ఒంటిరిగా జైలు జీవితాన్ని గడిపిందన్నారు. ఆమెను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఊరును కాపాడుకోవడం కోసం జరుగుతున్న పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఉమామహేశ్వరరావు, రాష్ట్ర నాయకులు ఎవి.నాగేశ్వరరావు, ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.నరసింహారావు, సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులు జి.బేబిరాణి, ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షలు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, కూరాకుల సింహాచలం, మట్ల ముసలయ్య, తదితరులు పాల్గొన్నారు.