Nov 30,2020 17:13

అమరావతి: శీతాకాల అసెంబ్లీ సమావేశాలు సోమవారం వాడీవేడిగా సాగాయి. తొలిరోజు సభలో పంచాయతీ రాజ్‌ చట్ట సవరణ బిల్లును చర్చించకుండానే ఆమోదించినందుకుగానూ అసెంబ్లీ సమావేశాల నుండి వాకౌట్‌ చేసిన టిడిపి సభ్యుల తీరుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. సమావేశాలకు ఎందుకు వచ్చారని టిడిపి నాయకులను ముఖ్యమంత్రి జగన్‌ ప్రశ్నించారు. అనంతరం ఆయన మాట్లాడారు. నివర్‌ తుపానుకు సంబంధించిన నష్టంపై ఇంకా అంచనాలు జరుగుతున్నాయని, డిసెంబరు 15వ తేదీలోగా ఆ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించామని పేర్కొన్నారు. ఏ సీజన్‌లో జరిగిన నష్టానికి అదే సీజన్‌లో పరిహారం అందించే చారిత్రాత్మక నిర్ణయాన్ని తమ ప్రభుత్వం తీసుకుందన్నారు. ఈ మేరకు డిసెంబరు 31 కల్లా పరిహారం చెల్లిస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అలాగే వర్షాలు, వరదల వల్ల దెబ్బ తిన్న పంటలను కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. చంద్రబాబు హయాంలో ఏనాడూ ఇలాంటి ఆలోచన కూడా చేయలేదని తెలిపారు. కోవిడ్‌ కారణంగా పార్లమెంటు సమావేశాలు కూడా పూర్తి స్థాయిలో జరగడం లేదని, ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన బిల్లులను ఆమోదించుకోవాల్సి ఉందని, అందుకే కచ్చితంగా కొన్ని రోజుల పాటు అసెంబ్లీ జరపాల్సి ఉందని జగన్‌ పేర్కొన్నారు.
                                                     విపక్ష నేతపై జగన్‌ ఫైర్‌..
నివర్‌ నష్టంపై మాట్లాడమని విపక్ష సభ్యుడికి అవకాశమిచ్చినా ఆయన సక్రమంగా దానిని వినియోగించుకోకపోవడం ఏమిటని జగన్‌ ప్రశ్నించారు. చర్చ అనేది పద్ధతిగా జరగాలని.. లేదు.. నాకు ఎటువంటి పద్ధతులు ఉండవు.. అంటే వ్యవస్థ బతకదని జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీయిజం చేసేదీ ఆయనే.. ఫ్లోర్‌ మీద కూర్చునేది ఆయనేనని చంద్రబాబునుద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీకి ఎందుకు వచ్చామో గుర్తించాలని, కళ్లు పెద్దవి చేస్తే ఎవరూ భయపడరని అన్నారు.