
ప్రజాశక్తి-కురుపాం : పంచాయతీ ఎన్నికల్లో ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీ వాణి ఇలాకాలో వైసిపికి ఎదురుదెబ్బ తగిలింది. ఆమె సొంత నియోజకవర్గం కురుపాం మేజర్ పంచాయతీలో టిడిపి అభ్యర్థిని తాడంగి గౌరమ్మకు పుష్పశ్రీవాణి మామ శత్రుచర్ల చంద్రశేఖర్‌రాజు మద్దతు తెలిపారు. పుష్పశ్రీ వాణి నిలబెట్టిన వైసిపి మద్దతుదారుకు వ్యతిరేకంగా కురుపాం కోటలో టిడిపి నేతలు వైరిచర్ల కిశోర్‌చంద్రదేవ్, ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజుతో కలిసి కార్యకర్తల సమావేశంలో శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి తాడంగి గౌరమ్మను గెలిపించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. సొంత నియోజకవర్గంలోనే పుష్పశ్రీ వాణికి వ్యతిరేకంగా తన మామ చంద్రశేఖర్ రాజు వ్యవహరించడం పట్ల వైసిపి కార్యకర్తల్లో నిరుత్సాహం నెలకొంది. వైసిపి, టిడిపిలోని ముగ్గురు నాయకులు ఒక్కటి కావడంతో ఇరు పార్టీల్లోనూ చర్చనీయాంశమైంది.