Feb 04,2021 19:58

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : డిప్లొమా అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌ విద్యార్ధులకు డిగ్రీ చేరేందుకు అవకాశం కల్పించి ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి మధు గురువారం లేఖ రాశారు. రాష్ట్రంలో డిప్లొమా అగ్రికల్చర్‌ హార్టికల్చర్‌ కోర్సు అధ్యయనానికి 109 కళశాలల్లో 6వేల మంది విద్యార్ధులు ప్రతి విద్యా సంవత్సరం విద్యను పూర్తి చేసి పై తరగతులకు వెళ్తున్నారని వివరించారు. గత విద్యాసంవత్సరం వరకు డిగ్రీలో బిఎస్‌ (బిజెడ్‌సి), బికాం గ్రూపులోకి చేరేందుకు అనుమతి ఉండేదని తెలిపారు. ఈ విద్యాసంవత్సరం సాధారణ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లను ఇవ్వబోమని ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. డిప్లొమా అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌ విద్యార్ధులు ఇంటర్‌ పరిధిలోకి రావాలంటే ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, వైఎస్‌ఆర్‌ ఉద్యానవన విశ్వవిద్యాలయం కౌన్సిల్‌ ఆఫ్‌ బోర్డ్స్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ (కాబ్సీ) సంస్థలో సమన్వయానికి సభ్యులుగా ఉండాలని తెలిపారు. ఈ సంస్థలకు ఇప్పటి వరకు ఇందులో సభ్యత్వం లేకపోవడం వల్ల విద్యార్ధులు ఇంటర్‌ పరిధిలోకి రారని బోర్డు పేర్కొంటోందని వివరించారు. డిగ్రీలో చేరేందుకు అవకాశం ఇవ్వబోమని ఉన్నత విద్యామండలి విద్యార్ధులను అడ్డుకొంటుందని,ఇది చాలా అన్యాయమని తెలిపారు. ఈ వివాదానికి విద్యార్థులు కారణం కాదని, ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ఇంటర్‌ బోర్డు, ఉన్నత విద్యామండలి ఈ సమస్యలను ఉమ్మడిగా చర్చించి పరిష్కరించాలని కోరారు. పాత పద్ధతిలోనే విద్యార్ధులకు సాధారణ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు ఇవ్వాలని కోరారు. అనుమతి లేకపోవడం వల్ల ఈ కోర్సు ఆధారంగా వస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్‌లో కూడా అర్హత కోల్పోతున్నారని వివరించారు. ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల విద్యార్ధులకు తీవ్ర నష్టం కల్గిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని పరిష్కరించే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని కోరారు.