Sep 18,2021 22:37

రేపలెల్లో నిరసన చేస్తున్న విద్యార్థులు, నాయకులు

ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన
ప్రజాశక్తి - రేపల్లె :
డిగ్రీలో తెలుగు మీడియం కొనసాగించాలని, తెలుగు మీడియం రద్దు నిర్ణయాన్ని సిఎం జగన్మోహన్‌రెడ్డి ఉపసంహరించుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ రేపల్లె డివిజన్‌ కార్యదర్శి కెవి లక్ష్మణరావు డిమాండ్‌ చేశారు. శనివారం స్థానిక డిగ్రీకళాశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి నాయకులు నిరసన తెలిపారు. లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్రంలో పాఠశాల విద్య నుంచి తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులు ఒక్కసారిగా ఇంగ్లీష్‌ మీడియం అంటే అనేక మంది ఇంటర్‌తోనే తమ చదువులు ముగిస్తారని తెలిపారు. విద్యార్థులు చదువులకు దూరం చేయొద్దని కోరారు. నాగార్జున యూనివర్సిటీ పరిధిలో సెమిస్టర్‌ విధానం ఉండగా నాలుగైదు నెలల్లో ఇంగ్లీష్‌ మీడియంలో పరీక్షలకు ఎలా సిద్ధమవుతారని ప్రశ్నించారు. ఇప్పటికే విద్యా విధానం మాతృభాషలో కొనసాగాలని పాఠశాలల విషయంలో హైకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. వెంటనే డిగ్రీ అడ్మిషన్లలో తెలుగు మీడియం అవకాశాన్ని కల్పించాలని కోరారు. కార్యక్రమంలో డివిజన్‌ సహాయ కార్యదర్శి కెయల్‌ భవాని, గర్ల్స్‌ కన్వీనర్‌ జి. హేమశ్రీ, ఉపాధ్యక్షులు బి.నాగరాజు, కో కన్వీనర్‌ డివి బాల జ్యోతి పాల్గొన్నారు.
ప్రజాశక్తి-గుంటూరు : డిగ్రీలో ఈ విద్యా సంవత్సరం నుంచి తెలుగు మీడియం రద్దు చేసి పూర్తిగా ఇంగ్లీష్‌ మీడియంలోనే విద్యా బోధన చేయాలని ప్రభుత్వం నిర్ణయించటం సరికాదని ఎస్‌.ఎఫ్‌.ఐ అధ్యక్ష కార్యదర్శులు ఎం.కిరణ్‌, పి.మనోజ్‌ కుమార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగు మీడియంలో చదువుకునే అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్మిషన్‌ విధానం రూపొందించిందని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో తెలుగు మీడియం విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల గ్రామీణ, పేద విద్యార్థులకు ఉన్నత విద్య దూరం అవుతు ందని తెలిపారు. ఒక పక్క రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ విద్యా ర్థులకు పాఠ్యాంశాలు అర్థం కావడానికి తెలుగు మీడియంలో విద్యాబోధన ఈ సంవత్సరం నుంచి ప్రారంభిస్తుంటే మరో పక్క డిగ్రీ విద్యలో తెలుగు మీడియం రద్దు చేయడం తెలుగు భాషపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థ మవుతుందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం విద్యార్థులు కోరుకుంటు న్నట్లు తెలుగు మీడియంలో అడ్మిషన్లు తీసుకోకుంటే ఆందోళన తప్పదని హెచ్చరించారు.