Dec 03,2021 21:06

మనీలా : కరోనా డెల్టా వేరియంట్‌ను ఎదుర్కొవడానికి తీసుకున్న చర్యలనే, ఒమిక్రాన్‌ను ఎదుర్కొవడానికీ తీసుకోవాలని ప్రపంచ దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది. సరిహద్దులను మూసివేసే చర్యలు కూడా ఫలితాలు ఇస్తాయని చెప్పింది. డబ్ల్యూహెచ్‌ఓ పశ్చిమ ఫసిఫిక్‌ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ప్రాంతంలో కొన్ని దేశాలు కరోనా విజృంభణను ఎదుర్కొంటున్న నేపధ్యంలో శుక్రవారం జరిగిన విలేకరులతో వర్చువల్‌ సమావేశంలో సంస్థ పశ్చిమ ఫసిఫిక్‌ ప్రాంతీయ డైరెక్టర్‌ డాక్టర్‌ తకేషి కాసై మాట్లాడారు.
'సరిహద్దులను మూసివేయడం వైరస్‌ నియంత్రణను ఆలస్యం చేస్తుంది. మనకు సమయాన్ని ఇస్తుంది. అయితే ప్రతీ దేశం కేసులు విజృంభణకు సిద్ధంగా ఉండాలి' అని చెప్పారు. 'ఒమిక్రాన్‌ విషయంలో సానుకూల అంశం ఏమిటంటే మనం దీన్ని ఎదుర్కొవడానికి మన మార్గాలను మార్చుకోనవసరం లేదు' అని చెప్పారు. డెల్టా వేరియంట్‌కు వ్యతిరేకంగా తీసుకున్న చర్యలనే దీనికి అవలంభించవచ్చునని తెలిపారు.
ఇప్పటి వరకూ లభించిన సమాచారం మేరకు ఒమిక్రాన్‌ను ఆందోళన కలిగించే వేరియంట్‌గా గుర్తించారని, ఇతర వేరియంట్ల కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందని చెప్పారు.
అలాగే ఇప్పటి వరకూ పశ్చిమ పసిఫిక్‌ ప్రాంతంలో ఆస్ట్రేలియా, హాంకాంగ్‌, జపాన్‌, దక్షిణ కొరియాల్లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించినట్లు సంస్థ ప్రాంతీయ అత్యవసర డైరెక్టర్‌ డాక్టర్‌ బాబా తుండే ఒలోవోకురే తెలిపారు. ఈ కేసులు మరిన్ని పెరిగే అవకాశముందని చెప్పారు. డెల్టాను ఎదుర్కొన అనుభవం ఒమిక్రాన్‌ను ఎదుర్కొవడంలో ఉపయోగపడుతుందని తెలిపారు