Nov 23,2020 07:12

2005 సెప్టెంబర్‌ 10, 12 తేదీల్లో అనుకుంటా. నేను ఉద్యోగరీత్యా ఖమ్మం నుంచి హైదరాబాద్‌ అల్వాల్‌ వెళ్లి ఇల్లు వెతుక్కుంటూ రాచకొండ టవర్స్‌లో 306 ఖాళీగా ఉందని తెలిసి నేను, ఉమా అత్తయ్య ఇల్లు చూడడానికి వెళ్ళాము. వెళ్లేటప్పుడు లిఫ్ట్‌లో వెళ్లాం. ఇల్లు చూసి కిందకు దిగేటప్పుడు మెట్లు విశాలంగా ఉండటం వల్ల మెట్ల మీదుగా దిగుదాం అనుకొని కిందకు పది మెట్లు దిగగానే- రెండో ఫ్లోర్లో 204 పక్కనే అమ్మచెట్టు అని కనబడింది. చాలా ఆశ్చర్యం వేసింది. అప్పటికి రెండు నెలల నుంచి అల్వాల్లో స్కూల్లో ఉంటున్నాను.
శివారెడ్డికి ఫోన్‌ చేసి అల్వాల్‌ షిఫ్ట్‌ అయ్యాం అని చెబితే.. 'ఆ దగ్గర్లోనే దేవిప్రియ ఉంటున్నాడయ్యా.. అడ్రస్‌ కనుక్కొని చెబుతాను' అన్నాడు. కానీ అడ్రస్‌ పంపలేదు. అటువంటిది ఎదురుగా అమ్మచెట్టు కనబడేసరికి ఆనందంతో, ఆశ్చర్యంతో వెళ్ళి తలుపు తట్టాను. రాజ్యలక్ష్మి గారు వచ్చి తలుపు తీశారు. మేం ముగ్గురం లోపలికి వెళ్లి మేం ఫలానా అని చెప్పి కూర్చున్నాం. కొద్దిసేపటికి దేవిప్రియ వచ్చాడు. వెంటనే లేచి ఆలింగనం చేసుకున్నాను. ఆ గాఢాలింగన స్పర్శ, శ్వాస ఇప్పటికీ తాజాగానే నా శరీరం చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. ఆ నెల చివరికి రాచకొండ టవర్స్‌ 306లోకి మారాము. అప్పటివరకూ ఆయన నాకూ కవిగా, జర్నలిస్టుగా మాత్రమే తెలుసు. అప్పటినుంచి ఆయనతో కలిసి నడవడం ప్రారంభించాను. అప్పటినుంచి ఇప్పటిదాకా ఆయనతో ఎన్నో జ్ఞాపకాలూ ఎన్నో అనుభవాలూ...
సాధారణంగా ఆయన లోపలికి ముడుచుకుపోయే తత్వంతో ఉండేవాడు. ఎవరితోనైనా వెంటనే కలవలేడు. కానీ ఒకసారి దగ్గర అయితే మాత్రం ఎప్పటికీ వదలడు. మొదట్లో ఎక్కువసేపు మౌనంగానే ఎదురెదురుగా కూర్చునే వాళ్ళం. ఏవో కొన్ని మాటలు మాత్రమే దొర్లేవి. తరువాతి కాలంలో ఆ మాటలు సెలయేళ్ళై ప్రవాహమై కొనసాగుతుండేవి. ఇప్పుడు వస్తున్న కవిత్వం, అందులోని అకవిత్వం, కవితా నిర్మాణ పద్ధతులు, భాష, తాత్వికత ... ఇలాంటి అంశాలపై ఆయన తన అభిప్రాయాలు పంచుకునేవారు. అవన్నీ నాకు కవిత్వ రచన పాఠాలుగా ఉండేవి. ఆయన బాల్యమంతా తాడికొండలో గడిచింది. డిగ్రీ గుంటూరు ఏసీ కాలేజీలో చదివారు. నాది తాడికొండకు 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతవరం. నేను తాడికొండలో ఇంటర్‌, గుంటూరు జెకెసిలో డిగ్రీ చదివాను. వయసులో ఆయనకూ నాకూ పదహారు, పదిహేడు సంవత్సరాల వ్యత్యాసం ఉన్నా ఇద్దరిదీ ఒకే ప్రాంతం, నేపథ్యం ఒకటే కావడం వల్ల సహజంగానే ఇద్దరి బాల్య స్మతులు ఒకేలా ఉండేవి. డిగ్రీలో ఆయనకు పాఠాలు చెప్పిన కడియాల రామమోహనరారు, గొల్లపూడి ప్రకాశరావు.. నాకూ పాఠాలు చెప్పారు. అలాంటప్పుడు కబుర్లకు కొదవేముంటుంది! కొరిటపాడు నుంచి మొదలై గుంటూరు తాలూకా సెంటర్‌లోని పోలీస్‌ క్వార్టర్స్‌ మీదుగా శంకర్‌ విలాస్‌, జిన్నా టవర్‌, పాత బస్టాండ్‌ సెంటర్‌ వరకూ మా కబుర్ల నడక సాగేది. ఈ క్రమంలోనే ఏసీ కాలేజీలో జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పాటలు వినడం, ఓల్గాతో (అప్పటికి ఆమె లలితకుమారి మాత్రమే) స్నేహం, జిన్నా టవర్‌ సెంటర్లో గడియారాలు షాప్‌ నడుపుతున్న సుగంబాబుతో కలిసి కవిత్వ పఠనాలు, కిరణ్‌ బాబు, కమల కాంత్‌, ఓల్గాలతో కలసి పైగంబర కవుల ప్రస్థానం మీదుగా 70ల నాటి కవిత్వ చర్చ జరిగేది. డిగ్రీ చదువుతుండగానే గుంటూరువాణి లాంటి పత్రికలకు ఆర్టికల్‌ రాయడం లాంటి విషయాలు ప్రస్తావనకు వచ్చేవి. అక్కడి నుంచి మద్రాస్‌ అనిశెట్టి సుబ్బారావు దగ్గరకు వెళ్లి అసిస్టెంట్‌గా కుదురుకోవడం, ఆయన చేసే అనువాద సినిమాలకు మాటలు పాటలు రాయడం, మెరీనా బీచ్‌లో తిరగడం, ఆరుద్ర, శ్రీశ్రీ లాంటి వాళ్ళతో కలవడం, సినిమాల్లో తను ఇమడలేకపోవడం ... ఇలాంటి మాటల మధ్యలో నుంచి తిరిగి గుంటూరు వచ్చేవాళ్ళం. అక్కడ పోలీసు క్వార్టర్స్‌లో రాజ్యలక్ష్మితో పరిచయం, ఆ పరిచయం ప్రేమగా మారడం, ఒకరోజు ఆమెను తీసుకుని హైదరాబాద్‌ శివారెడ్డి ఇంట్లో కాలు పెట్టడం ... ఇవన్నీ జ్ఞాపకాలు జ్ఞాపకాలుగా చెబుతూ ఉండేవారు. రాజ్యలక్ష్మితో పెళ్లి తర్వాత ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఉదయం పత్రికల్లో పని చేయడం, ఈనాడులో ఉద్యోగులందరూ సమ్మె చేస్తున్న తరుణంలో ఈనాడులో చేరమని ఆయనపై రకరకాల ఒత్తిళ్లు రావడం, ఉద్యోగులు సమ్మె చేస్తున్నప్పుడు వారికి వ్యతిరేకంగా తాను అక్కడ చేరకపోవడం లాంటి కబుర్లు చెప్పేవారు. తన 25 ఏళ్ల వయసులోనే ప్రజాతంత్రకు సంపాదకుడుగా వ్యవహరించడం, ఆ పత్రికలో శ్రీశ్రీతో అనంతం రాయించడం వంటి విషయాలు కూడా చెప్పేవారు. అనంతం రాయించేటప్పుడు శ్రీశ్రీతో పడిన ఇబ్బందులు, సమయానికి ఆయన తన రచనను ఇవ్వలేకపోయినప్పుడు ఆయనను బెదిరించో బామాలో రాయించిన జ్ఞాపకాలు పంచుకునేవారు.
2009లో దేవిప్రియ షష్టిపూర్తి కార్యక్రమాన్ని వైభవంగా జరిపాము. ఆ రోజు ఉదయమే విశ్వేశ్వరరావు, పెనుగొండ లాంటి వాళ్లు విజయవాడ, గుంటూరు నుంచి వస్తే- హైదరాబాదులో ఉన్న శివారెడ్డి, గోపి, ఓల్గా, బి.నర్సింగరావు, రామచంద్రమూర్తి, రమణజీవి, నాళేశ్వర శంకరం, మల్లేపల్లి లక్ష్మయ్య లాంటి ప్రముఖులెందరో వచ్చారు. ఆ ఆత్మీయ సమావేశం చాలా అద్భుతంగా జరిగింది. గంధకుటి, ఇన్షాఅల్లా శతకం పుస్తకాలు అప్పుడే ఆవిష్కతమయ్యాయి. అప్పుడు ఓల్గా చెప్పిన మాటలు ఇప్పటికీ నాకు బాగా గుర్తున్నాయి. కాలేజీలో చదువుకునే రోజుల్లో అప్పటికే యువకవిగా సందడి చేస్తున్న దేవిప్రియను ఆటోగ్రాఫ్‌ అడిగారట ఆవిడ. ఎందుకంటే తర్వాత రోజుల్లో మాకు ఎవరికీ అందనంత, దగ్గరికి వచ్చి ఆటోగ్రాఫ్‌ తీసుకోలేనంత ఎత్తుకు వెళ్ళిపోతావు.. అందుకే ఇప్పుడే అడుగుతున్నాను అన్నారట ఆవిడ. నిజంగానే దేవిప్రియ బహుముఖంగా ఆకాశమంత ఎత్తు ఎదిగిన సాహితీవేత్త.
దేవిప్రియ, రాజ్యలక్ష్మి గార్లకు మా ఉమా అంటే అత్యంత అభిమానం. మేమిద్దరం వాళ్ళ పిల్లల్లాగే వాళ్ళింట్లో కలిసిపోయాం. అంత పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి కూడా చిన్నపిల్లాడిలా రాజ్యలక్ష్మి గారు చేసిన స్వీటు, హాటు లాంటివి బాక్స్‌లో పెట్టుకొని వచ్చి 'ఉమా.... అమ్మ....' అంటూ తలుపు తట్టేవారు. 'మీరు ఎందుకు వచ్చారు సార్‌. పిలిస్తే మేము వచ్చేవాళ్ళం కదా' అని మేము మొహమాటపడుతుంటే 'మా అమ్మాయికి నేను తీసుకొని రాకూడదా?' అని నవ్వేవారు.
అనేక ప్రక్రియల్లో అసంఖ్యాకమైన రచనలు చేసిన ప్రజ్ఞాశాలి దేవిప్రియ. నేను అల్వాల్‌ వెళ్ళేటప్పటికి అమ్మచెట్టు, నీటి పుట్ట, పిట్టకూడా ఎగిరి పోవాల్సిందే, సమాజానంద స్వామి, గరీబు గీతాలు వెలువరించారు. కవిత్వం పట్ల ఆయనకు ఒక నిబద్ధత ఉంది. ప్రాచీన కవిత్వం మీద గట్టి పట్టు ఉండటం వల్ల, పద్యరచన కూడా చేసి ఉండటం వల్ల ఆయన ఉపయోగించే భాష ప్రాచీనతతో కూడిన ఆధునికతను సంతరించుకొని ఉండేది. ప్రతి ఏటా డిసెంబర్‌ 31 రాత్రికి ఆత్మీయలందరితో ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసి ఒక కొత్త కవితా సంకలనం విడుదల చేయడం ఆయనకు అలవాటు. అలా చేప చిలుక, అరణ్యపురాణం, గంధకుటి సంపుటాలు ఆయన కలం నుంచి వెలువడ్డాయి. అప్పట్లో ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఉదయం పత్రికల్లో సంచలనం సష్టించిన రన్నింగ్‌ కామెంటరీని మూడు సంపుటాలుగా ప్రచురించారు. హైదరాబాద్‌ మిర్రర్‌ పత్రికలో తాను రాసిన సంపాదకీయాలు అన్నింటినీ 'అధ్యక్షా.. మన్నించండి' పేరుతో సంకలనం చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌లో సీనియర్‌ అధికారిగా పనిచేసిన కేజే రావు గారి జీవితచరిత్రను కోబ్రా డాన్సర్‌ అనే పేరుతో ఇంగ్లీషులో రాశారు. గురజాడ పూర్ణమ్మను ది గోల్డెన్‌ డాల్‌ పేరుతో ఇంగ్లీషులోకి అనువదించారు. అనేక వ్యాపార ప్రకటనలకు జింగిల్స్‌ రాశారు. గద్దర్‌ జీవిత కథను ప్రజాయుద్ధ నౌక పేరుతో డాక్యుమెంటరీ చేశారు. రంగుల కల, దాసి చిత్రాలకు మాటలు పాటలు రచయితగా పనిచేశారు. ఇలా అనేక రకాలుగా తన ప్రతిభాపాటవాలను చాటుకున్నారు. 2014లో కారణాంతరాల వల్ల మేము విజయవాడకు మకాం మార్చాం. 'మీరు వెళ్లిన తర్వాత మాకు ఇక్కడ చాలా బెంగగా ఉంది. మేము అక్కడికి వచ్చేస్తాము' అని రాజ్యలక్ష్మీ, దేవిప్రియ గార్లు అనేక సార్లు మాతో అన్నారు. 2015లో దేవిప్రియ సహచరి ఆయనను వదిలి వెళ్లిపోవడం ఆయనకు తగిలిన పెద్ద దెబ్బ. దాని నుంచి కోలుకోవడానికి ఆయనకు చాలా కాలం పట్టింది. అయితే కాలం ఎటువంటి గాయాన్ని అయినా మాన్పుతుంది అనే మాటను నిజం చేస్తూ 2017లో గాలిరంగు తర్వాత రాసిన కవితలు, మరీ ముఖ్యంగా రాజ్యలక్ష్మి వెళ్లిపోయిన తర్వాత ఆయన ఒంటరి జీవితాన్ని ప్రతిబింబిస్తూ రాసిన కవిత్వం ఇం...కొకప్పుడు పేరుతో కవితా సంపుటిగా వెలువరించారు. ఇది ఆయనకు కొత్త ఊపిరినిచ్చింది. మళ్లీ అందరితో కలవడం, ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేయటం మొదలుపెట్టారు. 2017 గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించిన తర్వాత ఆయనలో కొత్త ఉత్తేజం వచ్చింది. ఒకప్పుడు చాలా రిజర్వ్డ్‌ గా ఉండే ఆయన మిత్రులతో సంభాషణ జరుపుతుంటేవారు. ఆయన కవిత్వం మీద, వ్యక్తిత్వం మీద వచ్చిన అన్ని వ్యాసాలను కలిపి 2019లో నేను, ఖాదర్‌ మొహియుద్దీన్‌, నర్సింగరావు, సీతారాం, ఘంట చక్రపాణి సంపాదకత్వంలో బహుముఖ సంకలనాన్ని వెలువరించాము. ఇటీవల ఆయన ఆంగ్లంలో కూడా కవిత్వం రాయడం ప్రారంభించారు. నిరంతర సజనశీలిగా ఉన్న ఆయన ఇంత హఠాత్తుగా వెళ్లిపోతారని ఊహించలేదు. నేను అల్వాల్లో ఉన్నప్పటి నుంచి ఆయనను స్వీయచరిత్ర రాయమని అడుగుతుండేవాడిని. అది రాయాలని ఈ మధ్యనే తన సంకల్పాన్ని వ్యక్తం చేశారు కానీ, రాయకుండానే వెళ్ళిపోయారు.
- బండ్ల మాధవరావు