Nov 27,2020 22:50

సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న కౌలు రైతులు

ప్రజాశక్తి - టెక్కలి రూరల్‌: తమకు గుర్తింపుకార్డులు ఇవ్వాలని, రైతు భరోసా, పంటల నష్టపరిహారం, బ్యాంకు రుణాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఎపి కౌలు రైతు సంఘం ఆధ్వర్యాన దేవాదాయ రైతులు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు కొల్లి ఎల్లయ్య మాట్లాడుతూ జగన్నాథస్వామి, రాధాకాంత స్వామి, మఠాదిపతి, మహంత్‌లకు చెందిన సుమారు 400 ఎకరాలను 600 మంది దేవాదాయ కౌలు రైతులు సాగు చేస్తున్నారని తెలిపారు. మండలంలోని డమర, కిట్టాలపాడు, నర్సింగపల్లి, టెక్కలి, ముఖలింగాపురం, బెండకాయలపేట, తదితర గ్రామాలకు చెందిన వీరికి 1బి ఇవ్వడంలేదన్నారు. రాజకీయ ఒత్తిళ్లతో ఎవరో ఫిర్యాదు చేశారన్న నెపంతో అధికారులు 1బిలు ఇవ్వకపోవడం దారుణమని వాపోయారు. ఎపి కౌలు రైతు సంఘం నాయకులు బమ్మిడి ఆనందరావు మాట్లాడుతూ చీడపీడల వల్ల రైతులకు నష్టం కలుగుతోందన్నారు. దేవాదాయ శిస్తు నుంచి రైతులకు సడలింపు ఇవ్వాలని అన్నారు. తొలుత కార్యాలయ సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎన్‌.షణ్ముఖరావు, పెద్దింటి లచ్చయ్య, దారపు సన్యాసి రావు, జన్ని చిన్నారావు, చిన్నింటి జమ్మయ్య, కృష్ణారావు, శాంతమ్మ, కురమయ్య, చందనరావు, తదితరులు పాల్గొన్నారు.