Jan 09,2021 17:09

న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి సమయం ఆసన్నమైంది. జనవరి 16 నుంచి దేశంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ జరగనుంది. ఉన్నతస్థాయి సమావేశంలో ప్రధాని మోడీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటిదాకా కరోనా భయం గుప్పిట్లో బతికిన ప్రజలకు ఈ వార్త మంచి ఉపశమనం అని చెప్పొచ్చు. తొలి విడతలో 3 కోట్ల మందికి వ్యాక్సిన్‌ అందజేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత కరోనా యోధులకు, 50 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. ప్రధాని మోడీ శనివారం అధికారులతో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశంలో కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై చర్చించారు. వ్యాక్సిన్‌ పంపిణీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన మార్గదర్శకాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. భారత్‌ బయోటెక్‌ రూపొందించిన 'కొవాగ్జిన్‌', ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన 'కొవిషీల్డ్‌' వ్యాక్సిన్‌కు భారత ఔషధ నియంత్రణ మండలి ఇప్పటికే అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. పుణేలోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఈ వ్యాక్సిన్లను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తోంది. అక్కడి నుంచి ప్రత్యేక విమానాల ద్వారా దేశంలోని 41 నిల్వ కేంద్రాలకు వ్యాక్సిన్లను తరలిస్తున్నారు.