Nov 27,2020 15:13

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : వ్యవసాయ, రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతాంగం చేపట్టిన ఆందోళనలకు మద్దతుగా రాష్ట్రంలోని రైతు సంఘాలు మద్దతుగా ఆందోళన నిర్వహించాయి. దీనిలో భాగంగా విజయవాడలో ఆంధ్రప్రదేశ్‌ అఖిలపక్ష రైతు పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నాయకులు నిరసన ర్యాలీ శుక్రవారం నిర్వహించారు. శ్రీశ్రీ భవన్‌నుండి ప్రారంభమైన ర్యాలీ ప్రజావైద్యశాల రోడ్డు మీదుగా బందర్‌రోడ్డుకు చేరుకుంది. వ్యవసాయ నల్ల చట్టాలు, లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని నినదించారు. మోడీ డౌన్‌డౌన్‌ అంటూ స్లోగన్స్‌ ఇచ్చారు. మోడీ ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్‌ను ప్రైవేటీకరించడం రద్దు చేయాలని, పంటన్నిటికీ గిట్టుబాటు ధరల చట్టం తేవాలని, పంట రుణాల విముక్తికి చట్టం చేయాలని నేతలు డిమాండ్‌ చేశారు. ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు జరిపిన దాడులను ఖండింస్తూ ర్యాలీని కొనసాగించారు. అప్పటికే మోహరించిన పోలీసులు బందర్‌ రోడ్డుపై ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, నేతలకు మధ్య కొంత తోపులాట చేసుకుంది. ఇంతలో పెద్దఎత్తున వర్షం కురవడం ప్రారంభమైంది. వర్షంలోనూ నాయకులు పోలీసులను తప్పించుకుని సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్దనున్న ఇన్‌కమ్‌ట్యాక్స్‌ కార్యాలయం వద్ద ర్యాలీ చేయడానికి ప్రయత్నించారు. ఇంతలో పోలీసులు అప్పటికే సిద్ధంగా ఉంచిన పోలీసు వ్యానును రోడ్డుకు అడ్డుగా పెట్టి నేతలను అరెస్టు చేయడం ప్రారంభించారు. దీంతో నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు ఒక్కొక్కరిని అరెస్టు చేసి వ్యానులో ఎక్కించారు. ఈ క్రమంలో గవర్నర్‌పేట సిఐ కృష్ణబాబు నేతల పట్ల అత్యంత దురుసుగా ప్రవర్తించారు. కాలర్‌పట్టుకుని లాగడం, దుర్బాషలాడడం వంటి చర్యలకు దిగడంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసన ర్యాలీలో రైతు పోరాట సమన్వయ కమిటీ నాయకులు వడ్డే శోభనాద్రీశ్వరరావు, వై.కేశవరావు, మర్రాపు సూర్యనారాయణ, వి.శ్రీనివాసరావు, సిహెచ్‌ బాబూరావు, రావుల వెంకయ్య, యలమందరావు, పి.జమలయ్య, వి.వెంకటేశ్వర్లు,వి.ఉమామహేశ్వరరావు, ఎవి.నాగేశ్వరరావు, అండ్ర మాల్యాద్రి, కె.ధనలక్ష్మి, కమల, డి.రమాదేవి, బోజెడ్ల.నాగేశ్వరరావు, ఎం.సూర్యారావు, కోటి, రాము, ప్రసన్న, ఎన్‌సిహెచ్‌ శ్రీనివాసరావు, రంగారెడ్డి, సత్యబాబు, దయారమాదేవి రైతు, వ్యవసాయ కార్మిక, కౌలు రైతు సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అరెస్టు అయిన నాయకులను పోలీసులు గవర్నర్‌పేట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. సిపిఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు, సిఐటియు రాష్ట్రకార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు అరెస్టు అయిన నేతలను పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి పరామర్శించారు. మధ్యాహ్నానికి నాయకులను సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.