
యూరప్ : యూరప్‌లో ఓ స్పెషల్ ఆహారానికి అక్కడి యురోపియన్ యూనియన్ ఫుడ్ సేఫ్టీ బోర్డు అనుమతులిచ్చింది. ఇది విని.. ఇప్పటి దాకా తిన్నవి కాకుండా కొత్త వంటకమేంటి? దాని గొప్పదనమేంటి? అని ఫుడ్ ప్రేమికులు ఆలోచిస్తున్నారా? అయితే అదేదో నోరూరించే, ఫుడ్ ప్రియులను మైమరపించే వంటకం ఏమీ కాదండోరు.. పురుగులతో చేసిన వంటకం. అవును మీరు విన్నది నిజమే.. అక్కడి యురోపియన్ యూనియన్ ఫుడ్ సేఫ్టీ బోర్డ్ మీల్వర్క్స్ అనే బీటిల్ జాతి పురుగులను తినేందుకు అధికారికంగా అనుమతులిచ్చింది. ఈ పురుగులను ఇప్పటికే అక్కడ పక్షులు, తొండలు వంటి పెంపుడు జంతువులకు ఆహారంగా వినియోగిస్తున్నారు. అయితే ఇప్పుడు ఫుడ్ బోర్డ్ అనుమతితో అక్కడ మనుషులు కూడా ఈ పురుగులను తినొచ్చు. ఈ పురుగుల్లో ప్రోటీన్స్, విటమిన్స్, ఫ్యాట్, ఫైబర్స్ వంటి అన్ని పోషకాలూ అత్యధికంగా ఉంటాయి. అందువల్లే అనుమతులిచ్చినట్లు ఫుడ్ బోర్డ్ అధికారులు చెబుతున్నారు.