Dec 03,2021 21:11

న్యూఢిల్లీ : దేశంలో కొన్ని ప్రాంతాల్లో కోవిడ్‌-19 ఇన్‌ఫెక్షన్ల సమూహాలు (క్లస్టర్లు) ఏర్పడినట్లు వార్తలు వచ్చాయని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం హెచ్చరించింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ నుంచి రక్షణ పొందడానికి మరిన్ని ప్రజారోగ్య చర్యలు అవసరమని తెలిపింది. టీకాలతో యాంటీబాడీలు, సెల్యూలార్‌ ఇమ్యూనిటీ వంటి రక్షణ లభిస్తుందని తెలిపింది. టీకాలతో వ్యాధి తీవ్రత తగ్గుతుందని ఇప్పటికే రుజువుకావడంతో టీకాలు వేయడం చాలా ముఖ్యమని పేర్కొంది.
అలాగే , పాజటివ్‌ వ్యక్తుల కాంట్రాక్టుల ట్రేసింగ్‌లపై దృష్టి పెట్టాలని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాసింది. 'వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి ట్రేసింగ్‌లపై దృష్టి పెట్టడం చాలా కీలకంగా ఉంటుంది. పాజటివ్‌ వ్యక్తుల కాంట్రాక్టులును 72 గంటలలోపు తప్పనిసరిగా గుర్తించాలి. వారిని నిర్భంధించాలి. పరీక్షించాలి. అలాగే పాజటివ్‌ వ్యక్తుల నమూనాలను వేగంగా జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం పంపాలి. ఐఎన్‌ఎస్‌ఎసిఒజి నెట్‌వర్క్‌లోని ప్రయోగశాలలకు మాత్రమే పంపాలి. ఈ ప్రక్రియ కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి' అని రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ పేర్కొన్నారు. కరోనా క్లస్టర్లు లేదా హాట్‌స్పాట్లను గుర్తించడంలో క్రియాశీల నిఘా, పరీక్షలు చాలా కీలకమని తెలిపారు.