Jan 12,2021 21:50

న్యూఢిల్లీ : ఇతర ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారత్‌లో అధిక స్థాయిలో ఇంటర్నెట్‌ సేవలపై నిర్భందం జరిగిందని తాజాగా ఒక సర్వేలో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా రూ.401 కోట్ల డాలర్ల నష్టం ఉండే ఒక్క భారత్‌లోనే రూ.280 కోట్ల డాలర్ల మేర వరకు వుందని గ్లోబల్‌ సర్వే అంచనా వేసింది. ఇంటర్‌నెట్‌ పర్యవేక్షణకు సంబంధించి ఎన్‌జిఓ అయిన నెట్‌ బ్లాక్స్‌, ది ఇంటర్‌నెట్‌ సొసైటీ కలిసి ఈ నివేదికను రూపొందించాయి. ప్రపంచ బ్యాంక్‌, అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్‌ యూనియన్‌ (ఐటియు), యూరోస్టాట్‌, యునైటెడ్‌ స్టేట్స్‌ సెన్సస్‌లకు చెందిన ప్రామాణికాలను ఉపయోగించి ఈ సర్వే నిర్వహించారు. 2020లో ప్రధానంగా 21 దేశాల్లో 93 సార్లు ఇంటర్‌నెట్‌ షట్‌డౌన్‌ అయింది. 2019లో కన్నా 2020 లోనే ఎక్కువసార్లు ఇంటర్‌నెట్‌ కుప్పకూలిందని నివేదిక పేర్కొంది. మొత్తంగా 27,165 గంటల పాటు ఇంటర్‌నెట్‌ పనిచేయలేదు. కరోనాతో దెబ్బతిన్న పేద దేశాలపై ఈ షట్‌డౌన్‌ మరింత ప్రభావాన్ని కనపరిచిందని నివేదిక పేర్కొంది. ఇంటర్‌నెట్‌లో అంతరాయాల వల్ల దాదాపు 26.8 కోట్ల మంది ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. వీటిల్లో ఎన్నికల జోక్యం, పత్రికా స్వేచ్ఛ వంటి పలు కారణాల వల్ల ఇంటర్‌నెట్‌ అంతరాయం కలిగింది. మన దేశంలో జమ్మూకాశ్మీర్‌ ఇప్పటికీ ఇంటర్‌నెట్‌ అంతరాయాన్ని ఎదుర్కొంటూనే వుంది.