Oct 27,2021 19:09

దేశం గర్వించదగ్గ పవర్‌ లిఫ్టర్‌ ఆమె. ముగ్గురు ఆడపిల్లలకు రోల్‌మోడల్‌. పెళ్లి తరువాత కొన్నాళ్ల విరామం తీసుకున్న ఆమె ఒంటరి తల్లిగా పిల్లల ఆలనాపాలనా చూసుకుంటూనే తనకెంతో ఇష్టమైన క్రీడలో ప్రతిభ చూపేందుకు సిద్ధమయ్యారు. మూడు పదుల వయసులో కూడా పలు జాతీయ పోటీల్లో పాల్గోని  బంగారు పతకాలు సొంతం చేసుకుంటున్నారు. ప్రస్తుతం మాస్కో అంతర్జాతీయ పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలకు ఎంపికై నిధుల లేమి వల్ల తన కల నెరవేరదేమోనని బెంగపడుతున్నారు. ఈ బాధ తన ఒక్కత్తే కాదు, ఎంతోమంది క్రీడాకారులది కూడా.

ప్రతిభ గుర్తించి ప్రోత్సహించేవారు చాలా అరుదుగా ఉంటారు. ముఖ్యంగా క్రీడారంగంలో పతకాలు, అవార్డులు సాధించిన తరువాతే క్రీడాకారుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. విజయం తరువాతే లక్ష్య మార్గంలో వారు ఎదుర్కొన్న సాదకబాధలు బయటికి వస్తాయి. 'ప్రతిరోజూ జిల్లాల వారీగా క్రీడాపోటీల్లో ప్రతిభచాటిన చిన్నారులను, జాతీయస్థాయి పోటీల్లో సత్తా చాటుతున్న ఆటగాళ్ల గురించి వింటూనే ఉంటాం. వారంతా ఆ స్థాయికి చేరారంటే వారి వెనుక ఎంతో కఠోరశ్రమ దాగుంది. ఏ క్రీడాకారులైనా దేశవ్యాప్త పోటీల్లో పాల్గొంటూ పతకాలు సాధించినా అంతర్జాతీయ పోటీలకు వెళ్లాలంటే నిధులు తప్పనిసరి. కాని నిధుల కొరత, ప్రభుత్వ ప్రోత్సాహం కొరవడి ఎంతోమంది క్రీడాకారులు ఉన్నచోటునే ఎటువంటి చలనం లేకుండా నిలబడిపోయారు. వారిని ప్రోత్సహించి రాబోయే తరానికి కొండంత స్ఫూర్తిగా నిలవాలంటే ప్రభుత్వాలు ప్రోత్సహించాలం'టారు రేఖ.

2000వ సంవత్సరం వెయిట్‌ లిఫ్టింగ్‌ ఒలింపిక్‌ పతకం సాధించిన కరణం మల్లీశ్వరి తరువాత మన రాష్ట్రం నుంచి ఒలింపిక్‌కు ప్రాతినిథ్యం వహించిన వారెందరు అంటే సమాధానం ఉండదు. 20 ఏళ్లు గడిచినా ఇంతవరకు ఒక్క క్రీడాకారుడు కూడా అంతర్జాతీయ పోటీలకు రాష్ట్రం తరపున ఆడలేదు. ఇదే ప్రశ్న అడుగుతారు రేఖ. 'మల్లీశ్వరి పతకం తెచ్చినప్పుడు ఆమెకు స్వాగతం పలికే విద్యార్థి బృందంలో నేను ఉన్నాను. అప్పటివరకు స్కూలులో కోకో, కబడ్డీ ఆటల్లో చాలా చురుకుగా పాల్గొనేదాన్ని. మల్లీశ్వరిని చూశాక సొంతంగా ఏదైనా క్రీడలో రాణించాలనుకున్న పట్టుదల పెరిగింది. ఎప్పటికైనా అంతర్జాతీయ క్రీడాబృందంలో దేశం తరపున జెండా పట్టుకోవాలన్న కల బాగా పెరిగిపోయింది' అంటూ ఆనాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు.

ఆమె తండ్రి సెంట్రింగ్‌ పనిచేసేవారు. తల్లి ప్రైవేటు ఉద్యోగి. ఇద్దరాడపిల్లల్లో రేఖ చిన్నమ్మాయి. మల్లీశ్వరిలాగా తాను కూడా వెయిట్‌ లిఫ్టర్‌ కావాలనుకున్నప్పుడు తన వయసు 12 ఏళ్లు. లక్ష్యం అయితే ఉందికాని దాని సాధించే మార్గం మాత్రం అంత సులభంగా రాలేదు. పైగా వెయిట్‌లిఫ్టర్‌గా శిక్షణ తీసుకుంటున్న సమయంలోనే అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదంలో భుజపుటెముక దెబ్బతిని ఆ శిక్షణకు పనికిరావని చెప్పేశారు. అయినా తన పట్టుదల వదల్లేదు రేఖ. పవర్‌ లిఫ్టింగ్‌లో తన సత్తా చూపేందుకు సిద్ధమయ్యారు. అలా మొదలైన ఆమె ప్రయాణం ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది. స్థానిక పోటీల నుంచి జాతీయపోటీల్లో ఎన్నో బహుమతులు, పతకాలు ఆమె వశమయ్యాయి.
 

వివాహం... పిల్లలు
హైస్కూలు విద్య హైద్రాబాద్‌లోనే పూర్తిచేశారు రేఖ. ఇంటర్మీడియట్‌ పొన్నూరు నాగార్జున యూనివర్శిటీలో చదివారు. ఆ తరువాత 18 ఏళ్లకే 2005లో వివాహమైంది. ముగ్గురు ఆడపిల్లలకు తల్లైంది. వివాహబంధంలో ఒడుదుడుకులు ఆమెను ఒంటరిని చేశాయి. పిల్లలను తీసుకుని పుట్టింటికి చేరింది. భర్త నుంచి విడిపోయి 2019 నుంచి ఒంటరిగానే పిల్లల ఆలనాపాలనా చూసుకుంటోంది.

దేశం గర్వించే గుర్తింపు తేవాలని ఉంది ...


 

లక్ష్యం దిశగా ...
పదేళ్ల తరువాత బాల్యంలో ముద్రపడిన తన కలకు మళ్లీ కొత్త చిగురులు వేసుకుంది. శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది. పోటీల్లో పాల్గొంటూ చంటిపిల్లకు పాలిచ్చిన అనుభవం రేఖది. ఈ ప్రయాణంలో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. 'ముగ్గురు బిడ్డల తల్లివి నీకిది అవసరమా? పిల్లల పోషణ అంతా నువ్వే చూసుకోవాలి. ఆటలంటూ బరువులు ఎత్తుతూ ఒళ్లంతా హూనం చేసుకుంటే రేపు నీ పిల్లలకు దిక్కెవరు?' అంటూ సూటిపోటి మాటలతో బాధపెట్టారు. అయినా రేఖ వెనుకడుగు వేయలేదు. బిడ్డల సంరక్షణ చూసుకుంటూనే పోటీల్లో పాల్గొంటూ తన సత్తా చూపించారు. రష్యా మాస్కోలో 2021 అంతర్జాతీయ పవర్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు ఎంపిక అయ్యారు. పదేళ్ల తరువాత 2021లో తెలంగాణ స్ట్రాంగ్‌ ఉమెన్‌' టైటిల్‌ సాధించారు. 'సాధారణంగా ప్రతి సంవత్సరం రైల్వే టీమ్‌ దీన్ని సాధించేది. కాని ఇప్పుడు నేను ఆ స్థానాన్ని ఆక్రమించాను. అది నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది' అంటారు రేఖ.

తనలాంటి ఎంతోమంది ప్రతిభావంత క్రీడాకారులందరూ ఎటువంటి ఆదరణ, గుర్తింపు లేకుండా ఉన్నారని వాపోతారు ఆమె. జీవించడానికి కూడా కష్టపడేవారున్నారంటారు ఎంతో ఆవేదనగా. 'మాకు ఉద్యోగ భద్రత లేదు. చాలామంది మధ్య తరగతి ప్రజలు క్రీడలను ఎంచుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలన్న లక్ష్యం కూడా అందులో ఉంటుంది. కాని మనదేశంలో ఇతర రాష్ట్రాల్లో జాతీయస్థాయి క్రీడాకారులకు ఇస్తున్న ప్రోత్సాహం మన తెలుగు రాష్ట్రాల్లో ఉండదు. పతకాలు సాధించినప్పుడు ఆకాశానికెత్తడం కాదు. ఆ స్థాయి వరకు క్రీడాకారులు వెళ్లేలా ప్రోత్సహించాలి. అప్పుడే నాలాంటి వాళ్లెంతోమందికి ఉపాధి దొరుకుతుంది' అంటారు రేఖ.

'తెలంగాణ పరిస్థితే చూసుకుంటే ఎల్‌బి స్టేడియంలోనే పవర్‌ లిఫ్టింగ్‌ శిక్షణ ఉంది. అక్కడికి ఎంతోమంది వస్తారు. మాకు తగిన సమయం కూడా ఉండదు. ప్రతిరోజూ అక్కడికి వెళ్లాలంటే 50 కిలోమీటర్లు ప్రయాణించాల్సి రావడం చాలా కష్టంగా ఉంటుంది. అమ్మ నా గురించి ఎప్పుడూ ఆందోళన పడుతుంది. పిల్లలకు ఏమీ మిగల్చకుండా వారికి సమకూర్చుకున్న సొమ్మును కూడా శిక్షణకే పెట్టేశావు. ఇకనైనా దీనికి ముగింపు పలుకు అంటుంది. కాని నేను కేవలం ముగ్గురు పిల్లల తల్లిలా కాదు, దేశం గర్వించదగ్గ పవర్‌లిఫ్టర్‌గా చనిపోవాలి అని అమ్మతో అంటాను. కోవిడ్‌ వల్ల పిల్లల చదువు మధ్యలో ఆగిపోయింది. ఒక్కోసారి షూస్‌ కొనుక్కునేందుకు కూడా డబ్బులు ఉండవు. ఈ పరిస్థితి నా ఒక్కదానిదే కాదు. ఇక్కడ ఉన్న ఎంతోమంది క్రీడాకారులు ఇటువంటి బాధలే పడుతున్నారు. ఇక్కడే పుట్టి పెరిగిన నేను నా పెద్దమ్మాయిని అసోం వెయిట్‌లిఫ్టర్‌ శిక్షణకు పంపించానంటే మన ప్రాంతంలో క్రీడాకారులకు ఇస్తున్న ప్రోత్సాహం అర్థం చేసుకోవచ్చు' అంటారు రేఖ. ఇన్ని అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినా పిల్లలను వారికి నచ్చిన రంగంలో ప్రోత్సహిస్తున్నారు రేఖ.

దేశం గర్వించే గుర్తింపు తేవాలని ఉంది ...

ప్రస్తుతం అంతర్జాతీయ పోటీలకు సిద్ధమయ్యేందుకు నిధులు సేకరిస్తున్నారు. నెల రోజుల వ్యవధిలోనే లక్ష రూపాయల సొమ్ము చేరింది. ఆమె అభ్యర్థనను గౌరవించి రూ.100 నుంచి రూ.300, 500 వరకు సొమ్ము ఆమె ఖాతాలో జమ చేశారు. ఆ సొమ్ము శిక్షణకు ఏమాత్రం సరిపోదు. కులం పేరు చెప్పు కులసంఘాల ద్వారా నిధులు సమీకరిస్తామని కొందరు, ప్రభుత్వాన్ని అడగకుండా మమ్మల్ని అడుగుతున్నావా అని మరికొందరు హేళన చేశారు. అయినా మొక్కవోని దీక్షతో రేఖ ప్రయత్నిస్తోంది. 'ఆటగాడి ప్రతిభను ప్రతిభగానే చూడాలి. కులమతాలను ముడిపెట్టకూడదు. కాని మన దౌర్భాగ్యం ఇక్కడ ఇలాగే ఉంటుంది' అంటారు గద్గద స్వరంతో రేఖ.

- జ్యోతిర్మయి

దేశం గర్వించే గుర్తింపు తేవాలని ఉంది ...