Nov 29,2020 23:39

పంటలను పరిశీలిస్తున్న బాచిన కృష్ణచైతన్య

ప్రజాశక్తి-పంగులూరు : నివర్‌ తుపాన్‌ కారణంగా దెబ్బతిన్న పంటలను వైసిపి అద్దంకి నియోజక వర్గ ఇన్‌ఛార్జి బాచిన కృష్ణచైతన్య పరిశీలించారు. మండల పరిధిలోని బూదవాడలో మిర్చి, మినుము పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుపాన్‌ కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం ఇప్పించేందుకు కృషిచేస్తానని తెలిపారు. తొలుత కొండమంజులూరు గ్రామంలో వేణుగోపాలస్వామి దేవాలయం, శివాలయం ట్రస్టుబోర్డుల ప్రమాణస్వీకారంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య సబ్‌ సెంటర్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుగరటయ్య, ఎఎంసి చైర్మన్‌ భువనేశ్వరి, వైసిపి నాయకులు యర్రం శ్రీనివాసరెడ్డి, సుబ్బారావు, భాస్కరరాజు, వెంకన్నబాబు, ఓబుల్‌రెడ్డి, కాశిరెడ్డి పాల్గొన్నారు. దర్శి : నివర్‌ తుపాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటల నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు అందజేయనున్నట్లు ఎడిఎ అర్జున్‌నాయక్‌, తహశీల్దారు వరకుమార్‌ తెలిపారు. మండలంలోని కొత్తపల్లి, లక్ష్మీపురం గ్రామాలలో వర్షానికి దెబ్బతిన్న వరి పంటను వారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎఒ బాలక్రిష్ణనాయక్‌, వైసిపి నాయకులు కుమ్మిత అంజిరెడ్డి, మల్లిఖార్జునరెడ్డి, సుబ్బారెడ్డి, సుబ్బయ్య, బత్తినేని వెంకటేశ్వర్లు, యోహాన్‌ పాల్గొన్నారు. మార్టూరు రూరల్‌ : నివర్‌ తుపాన్‌ ప్రభావంతో మండలంలో 22 హెక్టర్లలో పంట నష్టం వాటిల్లినట్లు ఉద్యానవన అధికారి హనుమంత్‌ నాయక్‌ తెలిపారు. మండల పరిధిలోని కోలలపూడి, రాజుగారిపాలెం, బొబ్బేపల్లి, మార్టూరు, నాగారాజుపలి గ్రామాల్లో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పొన్నలూరు : నివర్‌ తుపాన్‌ ప్రభావంతో పొన్నలూరు, నాగిరెడ్డిపాలెం, వెంకుపాలెం గ్రామాల్లో దెబ్బతిన్న పొగాకు తోటలను వేలం నిర్వాహణాధికారి ఆదిశేషయ్య ఫీల్డ్‌ అసిస్టెంట్‌ రాజగోపాల్‌ రెడ్డి పరిశీలించారు. పర్చూరు : టిడిపి రాష్ట్ర కార్యదర్శి షేక్‌ కరిముల్లా ఇంకొల్లు, ,కారంచేడు మండలాల్లో పర్యటించి తుపాన్‌ కారణంగా దెబ్బతిన్న మిర్చి ,పొగాకు ,పత్తి ,శనగ పంటలను పరిశీలించారు. యద్దనపూడి : తుపాన్‌ కారణంగా పెదజాగర్లమూడిలో దెబ్బతిన్న మిర్చి , శనగ పంటలను పంటలను టిడిపి రాష్ట్రకార్యదర్శి షేక్‌ కరిముల్లా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచి దూళిపాళ్ల వెంకట స్వామి, వెంకట్రావు, సుబ్బారావు పాల్గొన్నారు. పర్చూరు : తుపాన్‌ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను టిడిపి బాపట్ల పార్లమెంట్‌ అధ్యక్షులు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పరిశీలించారు. పర్చూరు మండలం చిన్ననందిపాడులో మిర్చి పంటను పరిశీలించారు.ఈ సందర్భంగా దెబ్బతిన్న పంటలను అంచనా వేసి రైతులకు నష్టపరిహారం అందించాలన్నారు.