
ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్: జిల్లాలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్‌లో డబ్బులు వసూలుచేసే కఠినచర్యలు తీసుకుంటామని, పేద ప్రజలందరికీ నాణ్యమైన, కార్పొరేట్ వైద్యసేవలు అందించటమే డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ధ్యేయమని జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ వి.శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. జిల్లాలో 9,22,376 మందికి ఆరోగ్య కార్డులు అందజేశామన్నారు. వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకంలో 2434 వ్యాధులకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఎటువంటి ఆరోగ్య కార్డులు లేని వారు ఆరోగ్యరక్ష కార్డుతో కార్పొరేట్ వైద్య సేవలను పొందటానికి అవకాశం ఉందన్నారు. ఆరోగ్యశ్రీ కరపత్రాలు, పోస్టర్లు, క్యాలెండర్లను ప్రతి సచివాలయంలో ప్రదర్శించి అక్కడ ఉండే ఎఎన్ఎం ద్వారా రోగులకు నెట్వర్క్ హాస్పిటల్స్‌కి సిఫారసు చేస్తామన్నారు. జిల్లాలో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకంలో ప్రజలకు అందజేస్తున్న వైద్య సేవలను ఆయన ప్రజాశక్తికి వివరించారు. అవన్నీ ఆయన మాటల్లోనే..
జిల్లాలో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకం 2014 జూన్ 2 నుండి కొనసాగుతోంది. ఈ పథకం ద్వారా ఎన్ని లక్షలు ఖర్చయినా పూర్తిగా ఉచిత వైద్యం అందుతోంది. వైద్యం ఖర్చు రూ.వెయ్యికి మించిన అన్ని కేసులకు ఏవిధమైన పరిమితి లేకుండా ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. హైదరా బాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలలో ఎక్కడైనా చికిత్స చేయించుకున్నా ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. ఆరోగ్యశ్రీ పథకంలో 2434 వ్యాధులకు నెట్వర్క్ హాస్పిటల్స్‌లో వైద్యచికిత్సలు అందుతున్నాయి. కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రత్యేకంగా రూ.10 వేలు పింఛన్ నెలనెలా వస్తోంది. వార్షిక ఆదాయం రూ.50 వేల లోపు ఉన్నవారు, కుటుంబానికి 12 ఎకరాల లోపు సాగుభూమి లేదా 35 ఎకరాల లోపు బీడు భూమి, సాగు, బీడు భూమి కలిపి 35ఎకరాల లోపు ఉన్నవారు అర్హులు. కుటుంబంలో అందరికీ కలిపి ఒక వ్యక్తిగత కారు ఉన్నవారు అర్హులే. 3000 చదరపు అడుగులు లేదా అంత కన్నా తక్కువ ఉన్న స్థలానికి మున్సిపల్ ఆస్తి పన్ను చెల్లించే కుటుంబాలు అర్హులు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఈ ఏడాది నవంబర్ నెలాఖరు వరకు జిల్లాలో 12,926 శస్త్ర చికిత్సలు చేయగా ఇందుకు రూ.30.65 కోట్లు ఖర్చు చేశాం. జిల్లాలో 72 నెట్వర్క్ హాస్పిటల్స్ ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నాం. జిల్లాలో 121 మంది నెట్వర్క్ ఆరోగ్య మిత్రలు పనిచేస్తున్నారు. జిల్లాలో 73 మంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఆరోగ్యమిత్రలు ప్రజలకు వైద్య సేవలు అందించటంలో సహాయపడుతున్నారు.
2.05 లక్షల సర్జరీల నిర్వహణ
డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లాలో ఆరోగ్యశ్రీ పథకం అమలు నుంచి ఇప్పటివరకు 2,05,977 సర్జరీలు నిర్వహించాం. ఇందుకోసం రూ.594.87 కోట్లు ప్రభుత్వం ఖర్చుచేసింది. గతంలో 2,03,051 సర్జరీలకు రూ.564.25 కోట్లు ఖర్చు చేశాం. ప్రస్తుత సంవత్సరంలో 12,926 సర్జరీలకు రూ.30.65 కోట్లు ఖర్చు చేశాం.
ఆరోగ్య రక్షలో 11,870 మంది నమోదు
జిల్లాలో ఆరోగ్య రక్ష పథకంలో 11,870 మంది నమోదయ్యారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ వంటి పథకాలకు అర్హత లేని వారు ఆరోగ్యరక్షలో చేరవచ్చు. ఒక వ్యక్తి సంవత్సరానికి రూ.1200 చెల్లించి ఆరోగ్యరక్ష పథకంలో చేరొచ్చు. ఈ పథకంలో చేరిన వారికి 24 వ్యాధులకు సంబంధించి జిల్లాలోని నెట్వర్క్ ఆసుపత్రులలో వైద్యసేవలు పొందవచ్చు. జిల్లాలో 121 మంది ఆరోగ్యమిత్రలు నెట్వర్క్ హాస్పిటల్లో రోగి చేరినప్పటి నుంచి తిరిగి డిశ్చార్జ్ అయ్యే వరకు పర్యవేక్షిస్తారు. అవసరమైన సలహాలు అందజేస్తారు. ఆరోగ్యమిత్రలను పర్యవేక్షించేందుకు జిల్లాలో ఆరుగురు టీమ్ లీడర్లను నియమించాం. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంలో జిల్లాలోని 72 నెట్వర్క్ హాస్పిటల్స్ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాం. 17 ప్రభుత్వరంగ వైద్యశాలల్లో, 55 కార్పొరేట్ వైద్యశాలల్లో వైద్యసేవలు అందించేందుకు కృషి జరుగుతోంది.
సిఎంసి ద్వారా వైద్య సేవలు
డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు లేదా ఏ కార్డు లేని వారికి చీఫ్ మినిస్టర్ క్యాంప్ ఆఫీస్(సిఎంసి) లేఖ ద్వారా వైద్య సేవలు పొందటానికి అవకాశం ఉంది. రోగి ఆధార్ కార్డు, డాక్టర్ సర్టిఫికెట్, భౌతికంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి హాజరైతే రోగి ఐరిష్ తీసుకొని అన్ని వివరాలు పరిశీలించిన తరువాత ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయ అధికారులు లేఖ ఇస్తారు. ఈ లేఖ ద్వారా ఆరోగ్యశ్రీ పథకంలో వైద్య సేవలు పొందటానికి అవకాశం ఉంది.
జీవనోపాధి భృతి అమలుకు శ్రీకారం
డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో చికిత్స అనంతరం జీవనోపాధి భృతి అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. చికిత్సానంతర భృతి 2019 డిసెంబర్ 1 నుండి అమలు జరుగుతోంది. చికిత్స అనంతరం రోగి కోలుకునే సమయంలో రోజుకి రూ.225 లేదా నెలకు రూ.5 వేలు అందజేస్తారు. వ్యాధి తీవ్రతను బట్టి అదనంగా నిపుణుల సూచనలమేరకు జీవనోపాధి భృతి అందుతుంది. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన 48 గంటలలో రోగి బ్యాంకు ఖాతాకు నగదు జమ అవుతోంది.
జిల్లాలో 9.22 లక్షల ఆరోగ్యశ్రీ కార్డులు
జిల్లాలో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పధకంద్వారా 9,22,376 కార్డులు ప్రజలకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అందిన దరఖాస్తులలో 98 శాతం మందికి కార్డులు పంపిణీ అయ్యాయి. రానున్న కాలంలో వైఎస్ఆర్ ఆరోశ్రీ పథకంలో రోగులకు మరిన్ని వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటాం.
విచారించేందుకు కమిటీ
జిల్లాలో నెట్వర్క్ హాస్పిటల్స్‌లో డబ్బులు వసూలు చేసే కఠిన చర్యలు తీసుకుంటాం. హాస్పిటల్లో డబ్బులు తీసుకున్న విషయాన్ని విచారించేందుకు కలెక్టర్ కమిటీని నియమించారు. ఇందులో డిఎం,హెచ్ఒ, డిసిహెచ్ఎన్, కలెక్టర్ నామినేట్ చేసిన ప్రతినిధి, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ ఉంటారు. హాస్పిటల్ డబ్బులు వసూలు చేసినట్లు రుజువైతే 10 రెట్లు డబ్బులు వసూలు చేసి జెసి ఏర్పాటు చేసిన ప్రత్యేక ఖాతాలో వేస్తారు. మళ్లీ డబ్బులు తీసుకున్నట్లయితే హాస్పిటల్‌ను నెట్వర్క్ హాస్పిటల్స్ నుంచి సస్పెండ్ చేస్తారు. తిరిగి అదే పునరావృతమైతే హాస్పిటల్ గుర్తింపును రద్దు చేస్తాం. ఈ నిబంధనలు డిసెంబర్ ఒకటి నుంచి అమలులోకి రానున్నాయి.