Feb 24,2021 21:25

ఫొటో : అన్నదానం చేస్తున్న దృశ్యం

ఫొటో : అన్నదానం చేస్తున్న దృశ్యం
డాక్టర్‌ సుందర రామిరెడ్డి వర్థంతి
ప్రజాశక్తి-ఆత్మకూరు : మాజీ శాసనసభ్యులు, ప్రజా వైద్యులు డాక్టర్‌ భూమిరెడ్డి సుందర రామిరెడ్డి ప్రధమ వర్థంతి కార్యక్రమం బుధవారం కుటుంబ సభ్యులు మాజీ జెడ్‌పి చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేందర్‌ రెడ్డి, మనుమడు బొమ్మిరెడ్డి తారక్‌నాథ్‌రెడ్డి ఘనంగా నిర్వహించారు. వారి ఆధ్వర్యంలో పట్టణంలో మున్సిపల్‌ బస్టాండ్‌ సెంటర్‌ అంబేద్కర్‌ బొమ్మ వద్ద, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో, ఇసిఎస్‌ఆర్‌ కాలనీ మసీదు వద్ద, యాదవ స్ట్రీట్‌ వద్ద, సుందర్‌ రామిరెడ్డి స్వగ్రామం బట్టేపాడు వారి తాత గ్రామం రేవూరు వద్ద అన్నదానం కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సుమారు నాలుగువేల మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ డాక్టర్‌ సుందర్‌ రామిరెడ్డి వైద్య సేవలో ఎనలేని సేవలు చేశారని
కొనియాడారు. పేదలకు ఫీజులు లేకుండా వైద్యం అందజేశారు. మూడు పర్యాయాలు ఆత్మకూరు శాసనసభ్యులుగా ఎన్నికై ఎలాంటి మచ్చ లేని రాజకీయ నాయకుడిగా కొనసాగారని తెలిపారు. పేద ప్రజల కోసం తపించే వ్యక్తిత్వం కలిగిన డాక్టర్‌ సుందర్‌ రామిరెడ్డి అని పలువురు కొనియాడారు. పలువురు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్‌ చైర్మన్‌ ఇందూరు వెంకటరమణారెడ్డి, మాజీ మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ చంద్ర రెడ్డి, కేతా విజయ భాస్కర్‌ రెడ్డి, పులిమి శైలజారెడ్డి, పిడికిటి వెంకటేశ్వర్లు నాయుడు, సాదిక్‌ హుస్సేన్‌, టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.