Nov 25,2021 18:02

న్యూఢిల్లీ :   క్రిప్టోకరెన్సీకి చట్టబద్ధత కల్పించడాన్ని భారత్‌లో సగానికి పైగా ప్రజలు వ్యతిరేకిస్తున్నట్లు ఒపీనియన్‌ పోల్‌ 'లోకల్‌ సర్కిల్స్‌' చేపట్టిన సర్వేలో తేలింది. క్రిప్టోకరెన్సీలతో పాటు బిట్‌కాయిన్‌ వంటి అన్ని ప్రైవేట్‌ డిజిటల్‌ కాయిన్‌లకు చట్టబద్ధత కల్పించడంతో పాటు వినియోగాన్ని క్రమబద్దీకరించనున్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో బిల్లును కూడా ప్రవేశపెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో వాటాదారులు విక్రయాలు చేపట్టినట్లు సమాచారం. అయితే ఈ బిల్లు సిద్ధ కాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. 54 శాతం ప్రజలు క్రిప్టోకరెన్సీని చట్టబద్ధం చేయడాన్ని నిరాకరించారని,. బదులుగా విదేశాల్లో మాదిరిగా డిజిటల్‌ ఆస్తులను కలిగి ఉన్న వారిపై పన్ను విధించడాన్ని ప్రవేశపెట్టవచ్చని సర్వేలో పేర్కొన్నట్లు అధ్యయన కర్తలు తెలిపారు. గత 15 రోజులుగా 56 వేల మందిపై ఈ సర్వే చేపట్టింది. 26శాతం మంది చట్టబద్ధత కల్పించాలని, భారత్‌లో కూడా పన్ను విధించాలని కోరగా, 20 శాతం మంది స్పందించలేదని అన్నారు.

చాలామంది భారతీయులు  క్రిప్టో కరెన్సీలో  పెట్టుబడి పెట్టినప్పటికీ.. పటిష్టమైన ఫ్రేమ్‌వర్క్‌ లేకపోవడం పెట్టుబడిదారులకు అధికనష్టాలకు దారితీస్తోంది. 71 శాతం మంది నిపుణులు కూడా స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదని లోకల్‌ సర్కిల్స్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సచిన్‌ తపారియా తెలిపారు. క్రిప్టోకరెన్సీల కారణంగా ఎదురయ్యే నష్టాలను ఫ్లాట్‌ ఫారమ్‌లు, ఎక్సేంచీలపై ప్రకటనలు నష్టాలను హైలెట్‌ చేయడం లేదని తపారియా అన్నారు. 76 శాత మంది నిబంధనలు సిద్ధమయ్యే వరకు ఈ ప్రకటనలను నిలిపివేయాలని కోరినట్లు సర్వేలో తేలింది. డిజిటల్‌ కాయిన్‌ల్లో లావాదేవీల విలువ పెరిగినప్పటికీ.. సుమారు 70 శాతం నుండి 80 శాతం ఖాతాలు (27 డాలర్లు) 2వేల కంటే తక్కువ మొత్తం బ్యాలెన్స్‌గా కలిగి ఉన్నారని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ తెలిపారు.

- సుమారు 87శాతం కుటుంబాలకు క్రిప్టోకరెన్సీలో వ్యాపారం చేయడం లేదా పెట్టుబడి పెట్టడం లేదు.
- క్రిప్టోకరెన్నీ ఫ్లాట్‌ఫారమ్‌ ప్రకటనలను కొనసాగించడానికి 5 శాతం మంది మాత్రమే అనుకూలంగా ఉన్నారు.
- సుమారు 51 శాతం మంది ఆర్‌బిఐ నిర్వహించే సొంద డిజిటల్‌ కరెన్సీని విడుదల చేయడాన్ని సమర్థిస్తున్నారు.
- 74 శాతం మంది నష్టాలను ప్రకటనలు హైలెట్‌ చేయడం లేదని చెప్పారు.
- 1 శాతం మంది క్రిప్టోకరెన్సీని విశ్వసిస్తున్నారు.