Sep 15,2021 21:40
సభలో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు

ప్రజాశక్తి-కృష్ణా ప్రతినిధి : రెండోసారి పూర్తి మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల విధానాలను పెద్ద ఎత్తున అమలు చేసేందుకు పూనుకుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. పోరాటాల ద్వారా వీటిని తిప్పికొట్టాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 27న జరిగే భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ సిపిఎం కృష్ణా జిల్లా తూర్పు కమిటీ ఆధ్వర్యంలో మచిలీపట్నంలోని ఇంగ్లీషుపాలెం షాదీఖానాలో బుధవారం సభ నిర్వహించారు. పార్టీ పట్టణ కార్యదర్శి సిహెచ్‌.రవి అధ్యక్షతన జరిగిన ఈ సభలో మధు మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నెలల తరబడి పోరాడుతున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి కోడ్‌లుగా మార్చేసిందన్నారు. దేశ పురోభివృద్ధికి దోహదపడుతూ లాభాలు తెచ్చిపెడుతోన్న ప్రభుత్వరంగ సంస్థలను సైతం ప్రయివేటీకరిస్తోందని, మానిటైజేషన్‌ పేరుతో రోడ్లు, రైల్వేలు, ఇతర ప్రభుత్వ రంగ సేవలను సమస్తం లీజులకు కట్టబెడుతోందని తెలిపారు. దీనివల్ల రవాణా ఛార్జీలు, ఇతర సేవల ఖరీదు రెట్టింపయ్యే ప్రమాదం ఉందన్నారు. పెట్రో, గ్యాస్‌ ధరలను రోజురోజుకూ పెంచుకుంటూపోతోందని తెలిపారు. మరోపక్క మత సామరస్యాన్ని దెబ్బతీస్తూ మైనార్టీల హక్కులకు వ్యతిరేకంగా లౌకికతత్వాన్ని దెబ్బతీసేలా మతోన్మాదాన్ని రెచ్చగొడుతోందని విమర్శించారు. ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ వ్యవసాయం, పోర్టులు, విద్యుత్‌ తదితర రంగాలను కేంద్రం తన చేతిలోకి తీసుకుంటోందన్నారు. అయినా రాష్ట్రంలోని అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ త్రిపురలో సిపిఎం నాయకులపై, కార్యకర్తలపై, సిపిఎం కార్యాలయాలపై బిజెపి దాడులకు పూనుకుంటోందన్నారు. విద్యారంగంలో కేంద్రం తీసుకొచ్చిన మార్పులతో అంగన్‌వాడీ వ్యవస్థ దెబ్బతింటుందని, విద్యార్థులకు పాఠశాలలు దూరమవుతున్నాయని తెలిపారు. సిపిఎం కృష్ణా జిల్లా తూర్పు కార్యదర్శి ఆర్‌.రఘు, జిల్లా కమిటీ సభ్యులు పిన్నమనేని విజయ తదితరులు మాట్లాడారు.