Jul 31,2021 07:01
  • ఈ ఏడాదీ రహస్య అమ్మకాలు
  • సీడ్‌ ప్యాకెట్‌తో గ్లెయిసెల్‌ మందు
  • అధిక ధరలకు రైతులకు అంటగడుతున్న మాఫియా

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ఈ ఏడాది కూడా అనుమతుల్లేని బిటి-3 పత్తి గప్‌చుప్‌గా సాగవుతోంది. విత్తన మాఫియా రహస్య నెట్‌వర్క్‌తో మే నెలాఖరు నుండే సీడ్‌ను రైతులకు సరఫరా చేసింది. విత్తనాల ప్యాకెట్లతో పాటు కలుపు మొక్కలను నిరోధించే ప్రమాదకర గ్లెయిసెల్‌ హెర్బిసైడ్‌ డబ్బాలను సైతం అధిక ధరలకు రైతులకు అంటగట్టింది. జూన్‌ చివరి వరకు సరైన వానలు లేనందున విత్తనాలు సేకరించి పెట్టుకున్నప్పటికీ రైతులు సాగు చేయలేదు. జులైలో కురిసిన వానలతో సాగు ఊపందుకుంది. దాదాపు నాలుగైదేళ్లుగా రౌండప్‌ రెడీ ఫ్లెక్స్‌ (ఆర్‌ఆర్‌ఎఫ్‌), హెర్బిసైడ్‌ టాలరెంట్‌ (హెచ్‌టి), గ్లెయిసెల్‌, బోల్‌గార్డ్‌-3, బిటి-3 టెక్నాలజీ పేర్లతో అనుమతుల్లేని పత్తి విత్తనాల విక్రయం సాగుతూనే ఉంది. ప్రభుత్వం మారినా అక్రమ వ్యాపారం ఆగలేదు. ప్రతి సంవత్సరం వివిధ బ్రాండ్ల పేరుతో విత్తనాల అమ్మకం జరుగుతోంది. ప్రస్తుత ఖరీఫ్‌లో అరుణోదయా, మూడు మూళ్లు (333), ముప్పై తొమ్మిది (39) ఇత్యాది పేర్లతో రైతులకు సరఫరా అయ్యాయి. పత్తి అధికంగా వేసే కర్నూలు, గుంటూరు, కృష్ణా, అనంతపురం, ప్రకాశం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో బిటి-3 విత్తనాలు పెద్ద ఎత్తున రైతులకు చేరాయని చెబుతున్నారు.
 

                                                                      అదిరిపోయే ధర

    2021-22 సంవత్సరానికి 450 గ్రాముల బోల్‌గార్డ్‌ -2 పత్తి విత్తనాల ప్యాకెట్‌ ధర రూ.730గా ప్రభుత్వం నిర్ణయించింది. అనుమతుల్లేని బిటి-3 సీడ్‌ ప్యాకెట్‌ను తొలుత రూ.850కి విక్రయించగా, ఆ ధరను రూ.1,300 చేశారు. డిమాండ్‌ ఉన్న చోట అంతకంటే ఎక్కువే గుంజుతున్నారు. ఎకరానికి రెండు ప్యాకెట్లు చొప్పున సరఫరా చేస్తున్నారు. సీడ్‌ ప్యాకెట్‌తో పాటు చేలో కలుపు మొక్కలు రాకుండా ఉండేందుకంఊ నిషేధించిన గ్లెయిసెల్‌ మందునూ జత చేసి ఇస్తున్నారు. ఎకరానికి ఒక లీటరు వంతున మొత్తంగా మూడు మార్లు స్ప్రే చేసేందుకు కావాల్సిన మూడు లీటర్ల మందునూ అమ్ముతున్నారు. లీటరు గ్లెయిసెల్‌ మందుకు రూ.500 వసూలు చేస్తున్నారు.
 

                                                                     అత్యంత గోప్యం

    బిటి-3 విత్తన ప్యాకెట్లను రహస్యంగా అమ్ముతున్నారు. గ్రామాల్లో ఏజెంట్లను నియమించుకొని రైతుల నుండి ముందే డబ్బులు వసూలు చేసి, ఆపై ఎక్కడకు రావాలో ఫోన్‌, ఎస్‌ఎంఎస్‌, వాట్సాప్‌ సందేశాలు పంపించి, చెప్పిన చోటకు వచ్చాక సీడ్‌ ప్యాకెట్లు, గ్లెయిసెల్‌ మందు డబ్బాలను అందిస్తున్నారు. కాగా మొన్నామధ్య బిటి-3 విత్తనాలను ఉత్పత్తి చేస్తున్న జంగారెడ్డిగూడెంలోని ఒక మిల్లును సర్కారు సీజ్‌ చేసిందని సమాచారం. ఇటీవలే అనుమతుల్లేని సీడ్‌ను అమ్ముతున్న ఎపి వ్యక్తులను బెంగళూరులో అరెస్టు చేశారని వినికిడి. దాంతో సీడ్‌ సరఫరా కొంత తగ్గిందని తెలిసింది. పైగా రెండేళ్ల నుండి బిటి-3 విత్తనాలు సాగు చేసిన రైతు లకు ఎకరానికి దిగుబడి నాలుగైదు క్వింటాళ్లే వచ్చినందున రైతులు వెనక్కి తగ్గుతున్నారని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, బిటి-3 పత్తి విత్తనాలు లేనే లేవని, ఆ పేరుతో నకిలీవి అమ్ముతున్నారని వ్యవసాయశాఖ చెబుతోంది.