Sep 15,2021 13:31

జబల్‌పూర్‌ :  డెంగ్యూ వ్యాప్తిని నిరోధించేందుకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కూలర్‌లపై నిషేధం విధించింది. జిల్లాలో డెంగ్యూ కేసులు పెరగకుండా ఉండేందుకు కూలర్లపై నెలరోజుల పాటు నిషేధం విధించామని జబల్‌పూర్‌ జిల్లా ఉన్నతాధికారి పేర్కొన్నారు.  జవవరి నుండి ఇప్పటివరకు 410 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని.. ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నామని అన్నారు. కూలర్‌లలో నీరు నిల్ల ఉండటంతో దోమల లార్వా వృద్ధి చెందే అవకాశం ఉందని చెప్పారు. కూలర్లను నీటిని తీసివేసి ఒక రోజు డ్రైగా ఉంచాలని, వారానికొకసారి శుభ్రం చేయాల్సి వుందని అన్నారు. అయితే కేసులను అడ్డుకునేందుకు కూలర్లపై నెలరోజుల పాటు నిషేధం విధించామని అన్నారు. డెంగ్యూ కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఫాగింగ్‌ చేస్తున్నామని అన్నారు. కాగా, ఈ ఆదేశాలపై స్తానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహదారులు, వీధులలో ఎప్పటికప్పుడు చెత్తను తొలగించకుండా.. కేవలం కూలర్లపై నిషేధం విధించినంత మాత్రాన దోమలను నివారించలేమని అన్నారు. మా ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటామని.. కానీ వీధుల్లో పేరుకుపోయిన చెత్తను మునిసిపాలిటీ అధికారులు శుభ్రం చేయడం లేదని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో కూడా డెంగ్యూ విజృంభిస్తోంది. ఘజియాబాద్‌, కాన్పూర్‌, ప్రయాగరాజ్‌, మీరట్‌ జిల్లాలతో పాటు పలు నగరాల్లో అధిక సంఖ్యలో డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి.