Sep 15,2021 21:43

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆసరా, చేయూత, సున్నావడ్డీ వంటి పథకాలతో నిజమైన మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం దారులు వేస్తోందని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్నారు. డ్వాక్రా మహిళల కోసం ప్రవేశపెట్టిన పలు పథకాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తాడేపల్లి సిఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రుణాలు మాఫీ చేస్తామని హమీనిచ్చి, రుణాలు కట్టద్దని చెప్పి చివరకు చేతులెత్తేసిందన్నారు. దీనివల్ల అక్కచెల్లెమ్మలపై వడ్డీ భారం పెరిగిపోయిందని తెలిపారు. ఈ నేపధ్యంలో అటువంటి వాటిని నాలుగు దఫాలుగా ప్రభుత్వమే చెల్లిస్తోందని అన్నారు. 2016లో రద్దయిన సున్నావడ్డీ రుణాలను తిరిగి పునరుజ్జీవింపజేసి, వారి కాళ్ల మీద వారు నిలబడే విధంగా చేసిందన్నారు. చంద్రబాబు చేసిన చర్యలవల్ల మొత్తం వ్యవస్థే చిన్నాభిన్నం అయిందని, ఎ గ్రేడ్‌లోని సంఘాలన్నీ సి గ్రేడ్‌లోకి వెళ్లిపోయాయన్నారు. రెండో విడత ఆసరాను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించాలని తెలిపారు. ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గనేలా చేయాలన్నారు. ఆసరా కింద ఇచ్చే డబ్బును బ్యాంకులు జమచేసుకోలేని విధంగా ఇవ్వాలని తెలిపారు. స్థిర ఆర్థికాభివృద్ధికోసం తోడ్పడే ఉపాధి మార్గాల కోసం బ్యాంకులు రుణాలు ఇప్పించేలా స్పాట్‌ డాక్యుమెంటేషన్‌ ఇళ్ల లబ్దిదారులకు రూ.35 వేల చొప్పున పావలావడ్డీకి రుణం ఇప్పించేలా చూడాలన్నారు. దీనిపై అధికారులు స్పందిస్తూ మహిళకు వేర్వేరు పద్ధతుల్లో ఉపాధి మార్గాలను చూపిస్తున్నామని వివరించారు. రెండో విడతలో 2,21,598 మంది మహిళలకు ఉపాధి చూపిస్తామన్నారు. ఈ ఏడాది రిలయన్స్‌కు చెందిన ఎజియో టానాజెర్‌, గ్రామీణ వికాస్‌ కేంద్ర, మహింద్రా, గెయిన్‌, కల్‌గుడి కంపెనీలతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని తెలిపారు. ఈ సమావేశంలో గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.