సంస్కృతికి వారధి సాహిత్యం..

Nov 12,2023 08:44 #Children, #Sneha, #Special Days, #Stories

బాలలకు మన సంస్క ృతిని వారసత్వంగా అందించేది సాహిత్యమే. నేను ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు మొదటిసారి సోవియట్‌ భూమి పుస్తకం చూశాను. అంతవరకూ అన్ని రంగుల్లో, అంత మంచి పేపరుతో వచ్చిన పుస్తకం నేను చూడలేదు. పుస్తకం రాగానే బొమ్మలు చూసేదాన్ని, ముఖ్యంగా ఆయిల్‌ పెయింటింగ్స్‌ చాలా నచ్చేవి. అలా బొమ్మలు వెయ్యాలని బలమైన కోరిక ఉండేది. రైతులు, అంతరిక్ష పరిశోధనలు, అభివృద్ధి గురించినవి ఆకట్టుకునేవి. కొన్ని సీరియల్స్‌, పరిశోధనాత్మక వ్యాసాలు.. తర్వాత వచ్చే సంచిక కోసం ఎదురుచూసేలా చేసేవి.

సాహిత్యం బాలల్ని తీర్చిదిద్దడంలో, పఠనాభిమానాన్ని పెంపొందించడంలో, విలువైన జీవిత పాఠాల్ని అందించడంలో కీలకపాత్ర పోషిస్తుందనేది తర్వాత అర్థమైంది. అలాంటి సాహిత్యం అందించిన వారిలో రష్యన్‌ రచయితలు లియో టాల్‌స్టాయ్, గోర్కీ, మకరెంకో, దోస్తోవ్‌స్కీ, చెహోవ్‌ మొదలైనవారు ఉన్నారు. పిల్లల కోసం వీరు రాసిన కథలను సోవియట్‌ ప్రచురణ సంస్థ ప్రపంచ భాషలలోకి అనువదించి, ప్రపంచానికి అందుబాటులోకి తెచ్చింది. లియో టాల్‌స్టారు బాల సాహిత్యానికి గణనీయమైన కృషి చేశారు. ఆయన రచనలు రష్యన్‌ విప్లవంపై గణనీయమైన ప్రభావాన్ని చూపాయి. మనదేశంలోని పిల్లలతో సహా ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం చేస్తూనే ఉన్నాయి.
నేను సెలవులకు ఇంటికి వచ్చినప్పుడు ఈ పుస్తకాలు చదివేదాన్ని. భారతీయ నవలల కంటే రష్యన్‌ సాహిత్యం ముందుగా చదివాను. దీనికి కారణం అవి ఉచితంగా, తక్కువ ధరకు దొరకడమే కారణం. అవి నా బాల్యంపై బలమైన ముద్ర వేశాయని ఇప్పుడనిపిస్తోంది. సమ సమాజం భావన అక్కడే మొదలైంది. వందల పేజీలు 1, 2 రోజుల్లో చదివేయడం ఎలా సాధ్యమైందా అనిపిస్తుంది. గోర్కీ ‘అమ్మ’ నవల తొమ్మిదో తరగతిలో చదివినప్పుడు జన్మభూమి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమవ్వాలి, అన్యాయాన్ని ఎదిరించాలి అనిపించింది. అదే ఎదిగిన కొడుకుకు తల్లినయ్యాక మళ్ళీ చదివినప్పుడు కొడుకు సమాజం పట్ల బాధ్యతగా వుండడంలో తల్లి బాధ్యతగా నిర్వహించినట్లు అనిపించింది. ‘రోజెన్‌ బర్గ్‌’ నవల రష్యన్‌ శాస్త్రవేత్త దంపతులు దేశం కోసం చేసిన త్యాగం.. చదివినంత సేపు కన్నీళ్లు కారుతూనే ఉండేవి. నేనూ తమ్ముడూ కలసి చదివి, దానికోసమే రోజుల తరబడి మాట్లాడుకునే వాళ్ళం. రష్యాలో విప్లవ సాధనలో సామాన్య పౌరులు ఎలా యోధులుగా మారేవారో, వారి సాహసాలు ఉత్తేజపరిచిన జ్ఞాపకం. ‘యుద్ధం-శాంతి’ రెండు భాగాలు ఒక్కొక్కటి 400 పేజీల పైనే. ప్రతి పాత్ర గురించి చర్చించడం, నచ్చనిది ఎందుకు ఇలా చేశారనే ప్రశ్నలు వచ్చేవి.

టాల్‌స్టాయ్ ముఖ్య రచనల్లో ‘ఇవాన్‌ ది ఫూల్‌’, ‘ది త్రీ క్వశ్చన్స్‌’ నాకు బాగా నచ్చినవి. ‘ది టేల్‌ ఆఫ్‌ ఇవాన్‌ ది ఫూల్‌’ 1886లో ప్రచురించబడిన చిన్న కథ. ఇది ముగ్గురు సోదరులు, మతి లేని సోదరి కుటుంబ కథ. బేతాళ కథలాగా ఆనందం, జ్ఞానానికి ప్రతీకగా ఉండే పౌరాణిక పక్షి ఫైర్‌బర్డ్‌ను కనుగొనడానికి ప్రయాణం ప్రారంభించిన ఒక సాధారణ మనసు గల బాలుడి కథను చెబుతుంది. కథలో పాత్రలను దెయ్యాలతో చెప్పిస్తుంటాడు. చాలా ఆసక్తికరంగా వుంటుంది. ఈ కాలంలో హారీ పోటర్‌ పిల్లలు ఎలా చదివారో బహుశా అప్పట్లో ఆ కథ అలా చదివించింది. వినయం, పట్టుదల, అంతర్గత ఆనందం పొందే వ్యక్తిగా ఇవాన్‌ కనిపిస్తాడు. పిల్లలు ఇవాన్‌లాగా వుండాలని అనుకుంటారు. ప్రజల కోసం ప్రేమ, భయం, తాదాత్మ్యం, నేర్చుకోవడం, నైతికత ఉండాలనే కథ. ఇది కొంతకాలం తొమ్మిదో తరగతి నాన్‌ డీటెయిల్‌గానూ వుంది. దీన్ని పాఠశాలలో పిల్లలతో ప్లే లెట్స్‌ వేయించేవారు.
‘ది త్రీ క్వశ్చన్స్‌’ రాజు మూడు ప్రశ్నలకు సమాధానాలు కనుగొనడం ఈ కథ. కథంతటా, టాల్‌స్టారు తమ జీవితాలను ఎలా గడపాలి అనే ప్రశ్నలను కలిగి ఉన్న వ్యక్తులకు.. తమలో తాము సమాధానాలు ఉన్నాయని వివరించడానికి ప్రయత్నిస్తాడు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు మంచి చేయడమే ప్రశ్నలకు సమాధానంగా కథ ముగుస్తుంది.
టాల్‌స్టాయ్ సామాజిక న్యాయం, సమానత్వం కోరుకున్న వ్యక్తి. అతని రచనలు అన్నీ దాదాపుగా ఆ కోణంతోనే ఉంటాయి. ‘యుద్ధం-శాంతి’, ‘అన్నా కరెనీనా’ నవలలు నైతిక సూత్రాలపై నొక్కిచెప్పడం, సామాజిక అన్యాయాలపై తిరుగుబాటు ప్రతిధ్వనించింది. పిల్లలను వారి సామాజిక, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ఇతరుల పట్ల సానుభూతి, శ్రద్ధతో పెంచాలని అతను నమ్మాడు. అందుకే ఆయన రచనలతో ఆనాటి సమాజాన్ని మార్చాలనే కోరిక బాలలు, యువతపై తీవ్ర ప్రభావం పడింది. ఆ విధంగా క్రూరమైన జార్‌ చక్రవర్తి పాలన అంతమై, సోషలిస్టు సమాజం ఏర్పడింది. టాల్‌స్టారు అహింసా తత్వశాస్త్రం, నైతిక జీవనం మార్టిన్‌ లూథర్‌కింగ్‌ జూనియర్‌ వంటి ప్రపంచ వ్యక్తులను ప్రేరేపించింది. మనదేశ స్వాతంత్య్ర పోరాటంలో కీలకపాత్ర పోషించిన మహాత్మాగాంధీ అహింస సిద్ధాంతానికి ప్రేరణ ఆయన రచనలే.

చిల్డ్రన్స్‌ క్లబ్స్‌ ఏర్పాటు అవసరం

బాలల్లో శాస్త్రీయ ఆలోచన, అభ్యుదయ భావాలు పెంపొందించడానికి సామాజిక ఉద్యమాల్లో భాగస్వాముల్ని చేయాలంటే ఆ కృషి బాల్యం నుంచే జరగాలి. అలాంటి కృషి దేశంలో అనేక రాష్ట్రాలలో జరుగుతోంది. కేరళలో పిల్లల భాగస్వామ్యంతో శిబిరాలు నడిచాయి. ‘ప్రపంచానికి పిల్లల పరిచయం’ అన్న పుస్తకాలతో కేరళ బాల సంఘం విస్తరణకు పాట, మాట, కథ, డాన్స్‌ మొదలైన వాటిని ఉపయోగించారు. ప్రపంచంలోనే అతి పెద్ద సాంస్కృతిక సంస్థగా ‘వేనల్‌ తుంబికల్‌’ నిలిచింది. 1990 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం విద్య, సంస్కృతి, సమకాలీన సామాజిక జాతీయ సమస్యలు, ప్రజాస్వామ్య విలువలు, ప్రగతిశీల చదువు మొదలైన అంశాలతో సాంస్కృతిక జాతా నిర్వహిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో ‘కిషోర్బాహిని’ (జషెల్లార్‌ ‘క్రమిషామేషీ), త్రిపురలో ‘కిషోర్‌’ అని పిలుస్తారు. పిల్లల ప్రయోజనాల కోసం క్రీడా ఉత్సవాలు, సాంస్కృతిక పోటీలు, తరగతులు, ఊరేగింపులు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో 2010 నుంచి ‘వైజాగ్‌ చిల్డ్రన్స్‌ క్లబ్‌’ ఏర్పాటు చేశాం. రాష్ట్రమంతా 2017 నుంచి ‘ఆంధ్రప్రదేశ్‌ చిల్డ్రన్స్‌ క్లబ్స్‌’ పేరుతో 20 జిల్లాల్లో ‘చిల్డ్రన్స్‌ క్లబ్స్‌’ ఏర్పాటు చేయడం జరిగింది.

మన పిల్లలకూ కావాలి..

మనదేశంలో ఆర్థిక అసమానతలు, సామాజిక వివక్ష కొనసాగుతున్నాయి. పిల్లలకు సమానత్వం, సహాయపడడం, సమిష్టితత్వం గురించి బోధించడం చాలా అవసరం. అశాస్త్రీయమైన భావాలు, విచ్ఛిన్నమైన విద్యావిధానం, క్షీణిస్తున్న నైతిక విలువలు, సమస్యల్ని పరిష్కరించడంలో టాల్‌స్టారు వంటి రచనలు పిల్లలపై మంచి ప్రభావం చూపిస్తాయి. బాలలు విజ్ఞానంతో పాటు నైతికంగా, సామాజిక స్పృహ ఉన్న పిల్లల్ని తయారుచేయడంలో ఇలాంటి రచనలు విలువైన పాత్ర పోషిస్తాయి. సామాజిక బాధ్యత గల పౌరులుగా మారడానికి, శాంతి, న్యాయాన్ని ప్రోత్సహించడానికి వారిని ప్రేరేపించవచ్చు. ప్రపంచ చరిత్ర, సంస్కృతిపై విస్తృత దృక్పథాన్ని పొందేందుకు సహాయపడుతుంది.
మనదేశంలో బాల సాహిత్యాన్ని ప్రోత్సహించడం, మెరుగుపరచడం అవసరం. గొప్ప సాహిత్య వారసత్వం ఉన్న దేశంగా ఉన్నప్పటికీ, బాల సాహిత్యం తరచుగా పెద్దల సాహిత్యంతో కప్పివేయబడుతోంది. ఈ అసమానతలకు అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా నాణ్యమైన పిల్లల పుస్తకాలు అందుబాటులో లేకపోవడం. ప్రాంతీయ భాషలలో, గ్రామీణ ప్రాంతాలలో పుస్తకాలు పరిమిత లభ్యత, ఆనందం కోసం చదవడానికి గణనీయమైన అవరోధాన్ని సృష్టిస్తుంది.
మన విద్యావ్యవస్థ అభ్యాసం, పరీక్ష-ఆధారిత పాఠ్యాంశాలపై దృష్టి పెడుతుంది. ఆనందాన్ని, పిల్లల అభివృద్ధికి పఠనాన్ని ప్రోత్సహించడానికి అసలు సమయం ఇవ్వడం లేదు. మన బాల సాహిత్యం విభిన్న సంస్కృతులు, అనుభవాలు, దృక్కోణాల పరిమిత ప్రాతినిధ్యంతో విభిన్నత పరంగా వెనుకబడి ఉంటుంది. డిజిటల్‌ యుగంలో, పిల్లలు ఎక్కువగా స్క్రీన్స్‌ వైపు ఆకర్షితులవుతున్నారు. ఇది పుస్తకాలను చదవకుండా దూరం చేస్తుంది.
బాల సాహిత్యాన్ని ప్రోత్సహించడం అనేది చాలా అవసరం. దానికోసం గ్రంథాలయాలకు ప్రభుత్వం నిధులు ఖర్చు పెట్టాలి. పాఠశాలల లైబ్రరీలలో పుస్తకాలు అందుబాటులో ఉంచడం, సమయాన్ని కేటాయించడం, చదవడాన్ని ప్రోత్సహించడం చేయాలి. విద్యావ్యవస్థలో అంతర్భాగంగా సాహిత్య పఠనం చేర్చాలి. స్వతంత్ర పఠనం, కథలు చెప్పడం కోసం సమయాన్ని కేటాయించేలా పాఠశాలల్ని ప్రోత్సహించాలి. దేశవ్యాప్తంగా ఉన్న పిల్లలకు సాహిత్యాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావడానికి బహుళ భాషలలో పిల్లల పుస్తకాల్ని ప్రచురించడాన్ని ప్రోత్సహించాలి.
మనదేశంలోని గొప్ప సాంస్కృతిక వైవిధ్యం, విభిన్న ప్రాంతాలు, విభిన్న జాతులు జరుపుకునే కథలను ప్రచారం చేయాలి. ఇంటరాక్టివ్‌ ఇ-బుక్స్‌, ఆడియో బుక్స్‌ను ఉపయోగిం చాలి. పిల్లల సాహిత్యాన్ని మరింత ఆకర్షణీయంగా చేయడానికి డిజిటల్‌ ప్లాట్‌ఫారమ్స్‌ను ఉపయోగించుకోవాలి.
తల్లిదండ్రులు పిల్లల్ని చదివేలా ప్రోత్సహించాలి. ఇంట్లో పఠనానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలి. రీడింగ్‌ క్లబ్స్‌ నివాస ప్రాంతాల్లో ఏర్పాటు చేసి, పిల్లల్ని చదివేలా ప్రోత్సహించాలి. పిల్లలతో రచనలు చేయడం కోసం వర్క్‌షాప్స్‌ నిర్వహించాలి. మంచి రచనలకు పురస్కారాల్ని ఇవ్వడం ద్వారా ప్రోత్సహించాలి. పిల్లల రచనల ప్రింట్‌/ డిజిటల్‌ మీడియాలో అందుబాటులో ఉంచాలి. బాల్యంలో పసి హృదయాలపై పడే ముద్ర, దాని ప్రభావం వారి జీవితాన్ని ప్రభావితం చేస్తుందనేది తిరుగులేని సత్యం. ఆ ముద్రలు బాలల్లో ఊహాశక్తికి రెక్కలు ఇవ్వాలి. సమాజాన్ని అర్థం చేసుకోగలగాలి. మంచి వ్యక్తులను, అలవాట్లను పరిచయం చేయాలి. అలాంటి పిల్లలు సమసమాజ నిర్మాణం వైపు అడుగులు వేసే ఆదర్శ పౌరులుగా, మానవీయంగా ఎదుగుతారు. పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా రచనలు ఉండాలి. స్వీయ అధ్యయనానికి, అనుభవానికి, అవగాహనకు అవకాశం ఉండాలి. మానవీయ విలువలను చాటిచెప్పేలా రచనలు రావాలి. పిల్లల రచనలు నిత్యనూతనంగా, పఠనాభిలాషను పెంపొందించేలా ఉన్నప్పుడే పిల్లలు చదువుతారు. అందుకని పాఠశాలతో పాటు తలిదండ్రులు, వివిధ సంస్థలు ఇందుకోసం కృషి చేయాలి.

డా.కోరెడ్ల రమాప్రభ,
సామాజిక కార్యకర్త, 94923 48428

➡️