Nov 29,2020 11:57

చలికాలం వచ్చేసింది. ఈ కాలంలో ముందుగా మన శరీరంలో చర్మసంబంధమైన మార్పులే ఎక్కువగా వస్తుంటాయి. చర్మంలో తేమశాతం తగ్గి పొడిబారడం చలికాలంలోనే జరుగుతుంటుంది. చలికాలంలో ఉష్ణోగ్రతలలో గణనీయంగా వచ్చే మార్పుల కారణంగా చర్మం తీవ్రమైన ప్రభావాలకు గురవుతుంది. ఇది అనేక చర్మ సమస్యలకు దారి తీస్తుంది. కనుక ఈ పద్ధతులు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు.
చలికాలంలో వేడినీటి స్నానం మంచిది కాదు. ఇది చర్మంపై దుష్ప్రభావాన్ని కలిగిస్తుంది. స్నానం తరువాత చర్మం కొంచెం తడిగా ఉన్నప్పుడే పెదవులకు ఒంటికి మాయిశ్చరైజర్లు రాసుకోవాలి. సాధ్యమైనంత మంచినీళ్లు ఎక్కువగా తీసుకుంటే మంచిది. భోజనంలో తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
చర్మం పొడిగా ఉన్నప్పుడు పెళుసుగా మారి దురదలు ఏర్పడే అవకాశాలున్నాయి. దీంతో పదే పదే గోకడం వల్ల చర్మం పై పొర రాలిపోయి అనేక రకాల అలర్జీలు, ఇన్ఫెక్షన్స్‌ వస్తాయి. ముఖం మీది చర్మం, పెదవులు కూడా ఈ ప్రభావానికి లోనవుతాయి. కాబట్టి చలికాలంలో చర్మానికి సంబంధించి ఏ చిన్న అలర్జీ, వ్యాధి ఉన్నా.. వెంటనే చర్మవ్యాధి నిపుణులను సంప్రదించడం చాలా మంచిది.