Oct 27,2021 23:51

పుస్తెలతాడును చూపిస్తున్న సిఐ వినోద్‌బాబు

ప్రజాశక్తి-పాలకొండ: పట్టణంలో గారమ్మకాలనీలో సోమవారం అర్ధరాత్రి రెండు ఇళ్లల్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు 24 గంటల వ్యవధిలో ఛేదించి, నిందితులను పట్టుకున్నారు. కేసు వివరాలను పాలకొండ డిఎస్‌పి ఎం.శ్రావణి బుధవారం వివరించారు. సోమవారం అర్ధరాత్రి రెండిళ్లలో రెండు తులాల బంగారు పుస్తులతాడు, నాలుగున్నర తులాల వెండి పట్టీలు, నాలుగు సెల్‌ఫోన్లు అపహరణకు గురయ్యాయని, బాధితులు ధనలక్ష్మి, వారాడ రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. అదే ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి దొంగతనానికి పాల్పడినట్టు గుర్తించామన్నారు. చేతి వేణిముద్రలతో పాటు అనుమానంగా ఉన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని కేసును ఛేదించామన్నారు. ఈ కేసులో ఒక మైనర్‌ దొంగతనానికి పాల్పడినట్టు నిర్ధారించామన్నారు. మైనర్‌ను బాలల నేరస్తుల కింద రిమాండ్‌కు పంపించామన్నారు. గతంలో ద్విచక్రవాహనం దొంగతనం కేసులో నిందితుడుగా గుర్తించామన్నారు. కేసును ఛేదించిన కానిస్టేబుల్‌ శివకు రివార్డు అందిస్తున్నట్లు తెలిపారు. ఆమెతో పాటు సిఐ జి.శంకరరావు, ఎస్‌ఐ ప్రసాదరావు ఉన్నారు.
పుస్తెలతాడు చోరీ కేసులో..
కవిటి:
మండలంలోని జాడుపూడి వద్ద మంగళవారం మహిళ మెడలో పుస్తులతాడు చోరీ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేధించారు. సిఐ వినోద్‌బాబు కథనం ప్రకారం.. బాధితురాలు సప్ప ఎండమ్మ ఆటో ఎక్కేసరికి ఆటోలో ముగ్గురు మహిళలు ఉన్నారని చెప్పిందని, ఆమె కథనం ప్రకారం.. తమదైన శైలిలో దర్యాప్తు చేపట్టామని అన్నారు. విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన ముగ్గురు మహిళలు కొత్తవలస నుంచి బరంపురం ఆటో రూ.5500కు బుక్‌ చేసుకొని వెళ్లారని తెలిపారు. జాడుపూడి వద్ద ఎండమ్మ అదే ఆటో ఎక్కడంతో ఆమె పుస్తెలతాడు చోరీ చేశారని వివరించారు. ఎస్‌ఐ అప్పారావు, హెచ్‌సి నీలకంఠం బుధవారం బరంపురం నుంచి నిందితులను కవిటి తీసుకొచ్చారని అన్నారు. నిందితులను పట్టుకున్న ఎస్‌ఐ, హెచ్‌సిలకు రివార్డు ప్రకటించినట్లు సిఐ వినోద్‌బాబు తెలిపారు.