
(ప్రజాశక్తి స్పోర్ట్స్‌డెస్క్) : భారత్ - ఇంగ్లాండ్ జట్లమధ్య గురువారంనుంచి ప్రారంభం కానున్న నాల్గో, చివరి టెస్ట్‌కు బ్యాటింగ్ పిచ్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. మూడోటెస్ట్ జరిగిన మొతేరా స్టేడియంలోనే నాల్గో టెస్టూ జరగనుంది. ఈ వేదికపై ఇటీవల ముగిసిన గులాబీ(డే/నైట్) టెస్టుమ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగియడంతో పిచ్ నాణ్యతపై అన్నివైపులనుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దాంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసిసి)నుంచి చిక్కులు వచ్చే ప్రమాదం ఉన్నందున.. నాలుగో టెస్టుకి భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించబోతునట్లు తెలిసింది. ఐసిసి చర్యల నుంచి తప్పించుకోవడం ఒక ఎత్తయితే.. ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్తుని కూడా ఖాయం చేసుకోవడం భారత్ మరోప్లాన్. బ్యాటింగ్ పిచ్‌గా తయారుచేస్తే ఆఖరి టెస్ట్‌ను భారత్ కనీసం డ్రా చేసుకున్నా సరిపోతుంది. నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో కోహ్లిసేన ఇప్పటికే 2 - 1 ఆధిక్యతలో నిలిచి ఐసిసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.
స్టేడియంలో రెండురకాల పిచ్‌లు..
మొతేరా స్టేడియంలో మొత్తం 11రకాల పిచ్‌లు అందుబాటులో ఉన్నాయి. అందులో ఆరు ఎర్ర నేల పిచ్‌లు ఉండగా.. ఐదు నల్లనేల పిచ్‌లు ఉన్నాయి. మూడోటెస్ట్ ఎర్ర నేల పిచ్‌పై జరగడంతో అది తొలిరోజునుంచే స్పిన్నర్లకు స్వర్గధామంగా మారింది. దీంతో తర్వాతి టెస్ట్‌కు గ్రౌండ్మన్లు నల్లనేల పిచ్‌ను సిద్ధం చేస్తున్నారు. స్టేడియం ఆధునీకరణలో భాగంగా ఇలా రెండు రకాల పిచ్‌లను స్థానిక ఆటగాడు పార్ధీవ్ పటేల్ సూచన మేరకు చేసినట్లు తెలిసింది. అదే జరిగితే నాల్గో టెస్ట్‌లో పరుగుల వరద పారి ఇరుజట్లు భారీస్కోర్లు నమోదవ్వడమే కాకుండా.. ఆట కూడా పూర్తిగా ఐదు రోజులు సాగే అవకాశముంది.
ఐసిసి చర్యలను..
మూడోటెస్ట్ మాదిరిగానే నాలుగో టెస్టు కూడా స్పిన్‌కి అతిగా సహకరించి అదికూడా 2-3 రోజుల్లోనే ముగిస్తే.. మొతేరా స్టేడియంపై చర్యలకు ఐసిసి తెరలేపొచ్చు. ఈ ప్రభావం 2021 టి20 వరల్డ్‌కప్‌పై పడి ఇక్కడ మ్యాచ్‌ల ఆతిథ్యానికి ఐసిసి ఒప్పుకోకపోవచ్చు. అలానే ఐపిఎల్ 2021 ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఈ వేదికపైనే జరగనుండడంతో ఆ అవకాశాలూ సన్నగిల్లే అవకాశముంది. పిచ్ నాణ్యతపై మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ ఇచ్చే రిపోర్ట్‌ని బట్టి ఐసిసి చర్యలు తీసుకోనుంది. ఇప్పటివరకు మూడో టెస్టుపై ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. దాంతో.. నాలుగో టెస్టు విషయంలో బిసిసిఐ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.