Oct 24,2021 07:42
  • ధ్రువీకరణ పత్రాలకు తప్పని తిప్పలు

ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి : చిత్రావతి బ్యాలెన్సింగు రిజర్వాయరు (సిబిఆర్‌) నిర్వాసితుల గోడు పాలకులకు పట్టడం లేదు. గతేడాది అక్టోబరులో వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద పరిహారం చెల్లించి ఊరు ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు సంబంధించి రూ.240.53 కోట్లు నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చింది. దీంతో, నిధులొచ్చేశాయంటూ ఉన్నఫలంగా నిర్వాసితులందరినీ ఊరి నుంచి అధికారులు బలవంతంగా ఖాళీ చేయించారు. ఈ రిజర్వాయర్‌ పరిధిలో 1,503 నిర్వాసిత కుటుంబాలు ఉన్నట్లు అధికారులు తొలుత గుర్తించారు. వీటిలో 1,308 కుటుంబాలకు మాత్రమే వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద సుమారు రూ.200 కోట్లు పరిహారమిచ్చారు. మిగతా 195 కుటుంబాలకు పరిహారం అందలేదు. చిత్రావతి బ్యాలెన్సింగు రిజర్వాయరు కింద తాడిమర్రి మండలంలోని సిసిరేవు, మరిమేకులపల్లి గ్రామాలు, ముదిగుబ్బ మండలంలోని పిసిరేవు, రాఘవంపల్లి గ్రామాలు ఉన్నాయి. పరిహారం జాబితాలో తమ పేర్లు లేవని మరిమేకులపల్లి గ్రామానికి చెందిన నిర్వాసితులు అప్పట్లోనే ఆందోళన చేపట్టారు. తమ గ్రామానికి కటాఫ్‌ తేదీని 2006 వరకు పెట్టారని నిరసనలు చేపట్టడంతో మరికొన్ని పేర్లు అధికారులు పరిశీలించారు. మరో 200 నిర్వాసితులు ఉన్నట్టుగా అధికారులు తేల్చి జాబితా సిద్ధం చేశారు. కొత్తగా గుర్తించిన వారికి కూడా పరిహారం ఇవ్వలేదు. ఒక్కో ఇంటికి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేసి ఏడాది పూర్తయినా పరిహారం అందక నిర్వాసితులు ఎదురుచూస్తున్నారు. దీంతో, మ్తొతం 395 కుటుంబాలూ పరిహారం కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. అధికారులు దీనిపై నోరు మెదపడం లేదు.
 

                                                 ధ్రువీకరణ పత్రాలు అందక అవస్థలు

రిజర్వాయరులోకి పది టిఎంసిల పూర్తి సామర్థ్యంతో గతేడాది నీరు నింపడంతోపై నాలుగు గ్రామాలూ నీటిలో మునిగిపోయాయి. ఆయా గ్రామాల ప్రజలు కొంతమంది ముంపునకు గురైన ప్రాంతాన్ని వదిలి ఎగువ భాగంలో కొత్తగా ఇళ్లు కట్టుకుని నివాసముంటున్నారు. ఈ గ్రామాలు ముంపు కింద రికార్డుల్లో ఉన్నందున కొత్తగా ఎగువ భాగంలో ఇళ్లు కట్టుకున్నప్పటికీ నివాస, ఆదాయ, కుల, ఇతర ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయలేమని అధికారులు చెబుతున్నారు. దీంతో రైతులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
 

                                             అప్పులు చేసి ఇల్లు కట్టుకుంటున్నాను

గతేడాది మా ఊళ్లోకి నీళ్లొచ్చాయి. పాత ఇళ్లు నీళ్లలో మునిగిపోయినందున, మా పొలాలు ఇక్కడే ఉన్నందున అప్పుడు అందరం ఊరు పైభాగంలో కొత్తగా ఇళ్లు కట్టుకుంటున్నాం. మాకు వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద ప్రభుత్వమిస్తామన్న డబ్బులివ్వలేదు. ఇంటి నిర్మాణానికి బయట అప్పులు చేయాల్సి వస్తోంది. అధికారులు పరిహారమిస్తామని అంటున్నా ఇప్పటి వరకు ఇవ్వలేదు.
                                                                                    - నారాయణప్ప, మరిమేకలపల్లి

1

                                                      పొలానికెళ్లేందుకు దారి లేదు

నాకున్న రెండున్నర ఎకరాల్లో చీనీ తోట ఉంది. అది ముంపు కింద పోలేదు. కానీ, ఆ తోట చుట్టూ నీరు చేరింది. దీంతో, తోటలోకి వెళ్లేందుకు దారి లేక పంటను కోయలేకపోతున్నాను. ఈ తోట ముంపు కింద పోకపోయినా ఫర్లేదు. ఈ తోటకు వెళ్లేందుకు రహదారి సౌకర్యం కల్పించాలి.
                                                                      -చంద్రసేన, మరిమాకులపల్లి గ్రామం