Jun 10,2021 18:34

దేశంలో ఎంతోమంది వర్తమాన విషయాలను అసలు పట్టించుకోరు. ప్రస్తుత విపత్తు సమయంలో కూడా చాలామంది అదే నిర్లిప్తతతో ఉంటున్నారు. మహమ్మారిపై ఎలా పోరాడుతున్నాం? ప్రజా ఆరోగ్యం పట్ల పాలకుల తీరు,..ఇత్యాది అంశాల జోలికి అసలే వెళ్లరు. అయితే ఇటీవల కేరళ త్రిసూర్‌కు చెందిన 5వ తరగతి విద్యార్థిని దేశ రాజధాని ఢిల్లీలో విరుచుకుపడుతున్న మహమ్మారిని కట్టడి చేయడంలో దేశ అత్యుత్తమ న్యాయస్థానం వ్యవహరించిన తీరును కొనియాడుతూ ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖ రాసింది. లేఖతో పాటు తన మాటల సారాన్ని చిత్రరూపంలో కూడా వ్యక్తం చేసింది. ప్రాపంచిక విషయాలపై ఆ పాప చూపిస్తున్న ఆసక్తిని ప్రశంసిస్తూ న్యాయమూర్తి ఎన్‌ వి రమణ ప్రత్యుత్తరం కూడా ఇచ్చారు. ఈ పాపను చూసైనా మనలో చాలామంది మేల్కొంటారేమో చూడాలి.


కేరళ త్రిస్సూర్‌కు చెందిన లిడ్వినా జోసెఫ్‌ 5వ తరగతి చదువుతోంది. సుప్రీంకోర్టుకు పంపిన లెటర్‌లో ఏముందంటే... 'దేశరాజధాని ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో రోజురోజుకూ పెరుగుతున్న కోవిడ్‌ కేసులు, మరణాలు నన్ను ఎంతగానో బాధించాయి. కోవిడ్‌ -19కు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో సాధారణ ప్రజల బాధలు, మరణాలపై గౌరవ న్యాయస్థానం సమర్థవంతంగా జోక్యం చేసుకుందని వార్తాపత్రికల ద్వారా నేను తెలుసుకున్నాను. ఆక్సిజన్‌ సరఫరాకు సంబంధించి తక్షణ ఆదేశాలు ఇచ్చి ఎంతోమంది ప్రాణాలను కాపాడారు. ఇందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను' అంటూ ముగించింది.


మే నెల చివరిలో సుప్రీంకోర్టుకు ఆ లేఖ చేరింది. రోజూ ఎన్నో ఉత్తర ప్రత్యుత్తరాలు అక్కడ జరుగుతూనే ఉంటాయి. అలా ఆ ఉత్తరాల కట్టలో చేరింది ఈ చిన్నపాప స్వదస్తూరితో రాసిన లేఖ, చిత్రరూపం. దానిని అందుకున్న జస్టిస్‌ ఎన్‌వి రమణ పాపను ప్రశంసిస్తూ ప్రత్యుత్తరం ఇచ్చారు.

చిన్న పాప పెద్ద సందేశం


'దేశంలో జరుగుతున్న సంఘటనలపై నువ్వు స్పందించిన తీరు, మహమ్మారి నేపథ్యంలో ప్రజల శ్రేయస్సు కోసం ఆందోళన చెందడం నన్ను విశేషంగా ఆకట్టుకున్నాయి. భవిష్యత్తులో దేశానికి ఎంతో కీలకమైన అంశాలపై కూడా నువ్వు విస్తృత పరిజ్ఞానం కలిగివుంటావని ఆశిస్తున్నాను. ఆ దిశగా నువ్వు నడవాలి, ఆ మార్గంలో విజయాలు సాధించాలి' అంటూ ఎన్‌వి రమణ నుంచి ఉత్తరం చేరింది. 'నా ఉత్తరానికి సి.జె నుంచి ప్రత్యుత్తరం వస్తుందని నేను అసలు ఊహించలేదు. కాని ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది' అంటోంది లిడ్వినా. 'రోజూ ఉదయం వచ్చే న్యూస్‌పేపరును ఎంతో శ్రద్ధగా చూస్తూ ఉంటుంది. అందులో వార్తలపై తనకు తెలియని వివరాలను అడిగి తెలుసుకుంటుంది. అందుకే సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాలపై ఉత్తరం రాయాలన్న ఆలోచన రాగానే ఆ దిశగా ప్రోత్సహించాను' అంటారు పాప తండ్రి.


అంశం ఏదైనా పదేళ్ల ఓ చిన్నపాప ప్రస్తుత సమాజం ఎదుర్కొంటున్న విపత్తు, తత్సంబంధితంగా న్యాయస్థానాలు, పాలకులు తీసుకుంటున్న చర్యలపై పూర్తి అవగాహనతో ఉంది. కోవిడ్‌ తాజా పరిస్థితులపై ఆమె స్పందించిన తీరు అద్భుతం. చిన్న వయసులోనే ఇంతటి పరిజ్ఞానం చూపిన జోసెఫ్‌కు దేశ నలుమూలల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది.