Jun 20,2021 12:16

ఒక అడవిలో చిలుక, కోతి ఒకే చెట్టుపై నివాసం ఉంటూ స్నేహంగా ఉండేవి.
ఒకరోజు ఓ ఎద్దు ఆ చెట్టు నీడలో విశ్రాంతి తీసుకోవడానికి వచ్చింది.
చిలుక, కోతి దాన్ని ఆట పట్టించాలని అనుకున్నాయి. వెంటనే చెట్టు మీద నుంచి కిందకు వచ్చాయి. చిలుక ఎద్దు పైకి ఎక్కింది. కోతి దాని ముందు కూర్చుంది.
'ఎద్దన్నా! ఎద్దన్నా!! త్వరలో నీకు పెద్ద ఆపద రాబోతుంది' అంది చిలుక. ఎద్దు కలవర పడింది.
'ఏమిటది?' అడిగింది కోతి.
'అడవి చివర ఉన్న పల్లెవాసులు వ్యవసాయం చేయాలని సంకల్పించారు. పొలం దున్నటానికి ఎద్దు అవసరం ఏర్పడింది. వారు ఎద్దును వెతికే వేటలో పడ్డారు. ఏ క్షణంలోనైనా ఎద్దన్నను పట్టుకుపోవచ్చు. ముసలిదైనాక కసాయి వానికి ఇవ్వొచ్చు. వారు కైమా చేసి అమ్మొచ్చు' అని చెప్పింది చిలుక.
'నీకెలా తెలుసు?' అడిగింది కోతి.
'అదంతే. నాకు పుట్టుకతోనే జోస్యం తెలుసు' అంది చిలుక.
భయంతో ఎద్దు కాళ్ళు వణికాయి. భయం భయంగా అక్కడ నుంచి వెళ్ళిపోయింది.
అది భయపడుతుంటే కోతి, చిలుక పగలబడి నవ్వుకున్నాయి.
కొన్నాళ్ళు గడిచాయి. ఓ జింక రొప్పుతూ వచ్చి చెట్టు కింద బిత్తర చూపులు చూస్తూ నిలబడింది. దాన్ని కూడా భయపెట్టాలనుకున్నాయి.
వెంటనే చిలుక, కోతి చెట్టు దిగి జింక వద్దకు వచ్చాయి.
'జింకత్తా! జింకత్తా!! త్వరలో నీకు పెను ప్రమాదం రాబోతుంది. జాగ్రత్త?' అంది చిలుక. జింక అయోమయంలో పడింది.
'ఏమిటి ఆ ప్రమాదం?' అడిగింది కోతి.
త్వరలో 'ఓ చిరుతపులి దాడి చేయబోతుంది. దీని పని ఇక అంతే. చిరుతకు ఆహారం కావడమే' అంది.
'నీకెలా తెలుసు?' అడిగింది కోతి.
'అదంతే. నాకు పుట్టుకతోనే జోస్యం తెలుసు' అంది చిలుక.
జింకకు ముచ్చెమటలు పట్టాయి. భయంతో బిగుసుకుపోయింది. భయం భయంగా అక్కడ నుండి వెళ్ళిపోయింది. దానిలో కలిగిన భయానికి అవి రెండూ ఎగిరెగిరి నవ్వుకున్నాయి.
కొన్నాళ్ళు గడిచాయి. చిలుక జోస్యం చెప్పినట్టుగానే ఎద్దును రైతులు పట్టుకుపోయారు. జింకను చిరుతపులి తరిమి చంపింది. దీనితో చిలుక పెద్ద జ్యోతిష్యుడు అయిపోయింది. అడవంతా చిలుక ప్రతిభ పాకింది. సరదాగా ఆట పట్టించిన వ్యాపకమే వృత్తి అయింది. ఇక అప్పటి నుంచి చిలుక, కోతి పైకం తీసుకుని, అడిగిన వారికి జోస్యం చెప్పసాగాయి. చిలుక సహాయకుడుగా కోతి పని చేయసాగింది. అవి రెండూ జోస్యం చెబుతూ బాగా సంపాదించాయి. చిలుక జోస్యం సంగతి ఆనోట ఈనోట అడవిరాజు సింహానికి చేరింది. ఒకరోజు అది చిలుక, కోతిని పిలిపించింది.
'చిలకా! నా జోస్యం చెప్పు. నా మరణం ఎలా వస్తుందో చెప్పు?' అడిగింది సింహం.
చిలుక భయంతో వణికింది. నోటమాట రాక అవస్థ పడింది. కోతి గుటకలు మింగుతూ అటూ ఇటూ చూడసాగింది.
'చెప్పు' అంటూ గద్దించింది సింహం.
ఏమి చెప్పాలో తెలియక, నీళ్లు నములుతూ 'మహారాజా! మీకు మరణమే లేదు' అంది చిలుక.
'అవునవును' అంటూ కోతి దానికి వంత పలికింది.
సింహం వాటి వంక కోపంగా చూస్తూ 'మరణం లేకుండా ఏ ప్రాణి అయిన ఉంటుందా? ప్రాణుల భయాన్ని ఆసరాగా తీసుకుని, వాటిని ఆడిస్తున్న మీకు శిక్ష తప్పదు. ఏవో ఒకటి, రెండుసార్లు మీరు చెప్పిన జోస్యం నిజమైతే అది యాదృచ్ఛికమే. కానీ మీ జ్యోతిష్య ప్రతిభ కాదు. జ్యోతిష్యం ఓ మూఢనమ్మకం. మీవంటి మూర్ఖులు, మోసగాళ్ళు అమాయక జీవులను భయపెడుతూ డబ్బు సంపాదిస్తున్నారు. నిజం చెప్పండి. మీకు జోస్యం తెలుసా?' అంటూ గద్దించి అడిగింది.
'తెలియదు' అంటూ చిలుక, కోతి ఒప్పుకుని, లెంపలేసుకున్నాయి.
''జ్యోతిష్యం వట్టి భూటకం. వాటిని నమ్మకండి!'' అని అవి రెండూ అడవంతా తిరిగి దండోరా వేసే శిక్ష విధించింది సింహం.
రాజు వేసిన శిక్షను అమలు చేస్తూ అవి రెండూ అడవంతా దండోరా వేసే పనిలో పడ్డాయి.ఆ తరువాత మరెప్పుడూ అవి ఏ జంతువుకూ జోస్యం చెప్పలేదు.
 

- దార్ల బుజ్జిబాబు,
92905 04570