Oct 14,2021 16:57

న్యూడిల్లీ : సొంత గూటికి ఎయిర్‌ ఇండియా చేరుతుందన్న ఆనంద డొలికల్లో తేలియాడుతున్న టాటా గ్రూపుకు మరిన్ని కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే భారీ నష్టాల్లో కూరుకుపోయిన ఈ సంస్థను లాభాల బాట పట్టించాలంటే కష్టపడాల్సిందే. ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణలో భాగంగా వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న ఎయిర్‌ ఇండియాను అమ్మాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలి సంస్థ టాటా సన్స్‌ రూ. 18వేల కోట్లు చెల్లించేందుకు ముందుకు వచ్చింది. ఈ ఆఫర్‌ను కేంద్రం కూడా అంగీకరించింది. దీంతో దీని ఆస్తులన్నీ టాటా గ్రూపుకు వశమయ్యాయి. ఇందులో బోయింగ్‌ విమానాలతో పాటు సిబ్బంది క్వార్టర్స్‌, కార్గో స్టేషన్లు, ఇతర విలువైన భూములు కూడా ఉన్నాయి.
అయితే ఈ ప్రక్రియ పూర్తి కావడానికి ఆరు నెలల సమయం పడుతుంది. ఈ లోపు క్వార్టర్స్‌లో ఉంటున్న సిబ్బంది ఖాళీ చేయాలని టాటా గ్రూప్‌ నోటీసులు ఇచ్చింది. దీంతో ఎయిర్‌ ఇండియా ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికిప్పుడే క్వార్టర్లు ఖాళీ చేయమనడం దారుణమంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం ఎయిర్‌ ఇండియాలో 12 వేల మందికి పైగా శాశ్వత, కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. వీరికి ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా వంటి ప్రాంతాల్లోని క్వార్టర్లు కేటాయించారు. ఇప్పుడు ఖాళీ చేయమంటే రోడ్డున పడాల్సిందేననని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నోటీసులు వెనక్కు తీసుకోకపోతే నవంబర్‌ 2 నుండి నిరవధిక సమ్మె చేపడతామని పేర్కొన్నారు. ఎయిర్‌ ఇండియా ప్రైవేటీకరణ తర్వాత తమ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని, కేంద్రం కూడా ఎటువంటి భరోసానివ్వలేదని, ఉన్న పళంగా ఇళ్లు ఖాళీ చేయాంటూ ఆదేశాలివ్వడం అన్యాయమని ఉద్యోగులు వాపోయారు. కనీసం తమతో చర్చించేందుకు ఎవరూ సిద్ధంగా లేరంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఎయిర్‌ ఇండియాను సొంతం చేసుకున్న టాటా సంస్థ ఉద్యోగుల సెటిల్‌మెంట్‌, క్వార్టర్లు తదితర వంటి సమస్యలను కూడా పరిష్కరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.