
కొన్ని పనులు మగవాళ్లు మాత్రమే చేయగలరని, మహిళలు అసలు చేయలేరని కొంతమంది భావిస్తారు. అలాంటి భావనలకు చెల్లుచీటి రాసిన వనితలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వరసలో మరొక పేరు గుర్మెంట్ ఆంగ్మో. సరైన రహదారులు కూడా లేని మూరుమూల ఊళ్లకు, పర్వత గ్రామాలకూ వెళ్లి ... సౌర విద్యుత్‌ను పంచుతుందామె. కనీసం కలలో కూడా ఊహించని వెలుగును చూసి ... ఆయా గ్రామస్తులు ఆమెను ఓ కాంతిదేవతలా చూస్తున్నారు.
గుర్మెట్ ఆంగ్మో (36) లడఖ్‌లోని మార్కా లోయలో మారుమూల సుమ్దా గ్రామానికి చెందిన మహిళ. ఒకప్పుడు అక్కడ గ్రామాల్లో వీధిదీపాలు ఉండేవి కావు. రాత్రి అవుతుందంటే చాలు-పిల్లల్ని బయటకు రానిచ్చేవారు కాదు. అడవి జంతువుల భయంతో సాయంత్రంలోపే పనులన్నీ చక్కబెట్టుకుంటారు. ఆంగ్మో తను బాల్యంలో బడి ముగిశాక పొలంలో ఉన్న అమ్మనాన్నలకు అన్నం ఇచ్చేందుకు పరిగెత్తుకుంటూ వెళ్లేది. తిరిగి అంతే వేగంతో ఇంటికి చేరేది. ఎందుకంటే చీకటి పడేలోపు ఇంట్లో ఉండాలి. వీధిలైట్ల ఏర్పాటు కోసం గ్రామస్తులు చాలాసార్లు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ, వారు స్పందించలేదు. వెలుతురు లేక ఆంగ్మో చదువు అంతంత మాత్రంగానే సాగింది. చదువుకొని ఉద్యోగం చేయాలనుకున్న ఆమె ఆశ కలగానే మిగిలిపోయింది. హైస్కూలు చదువులో ఉండగానే... తల్లిదండ్రులు ఆమెకు చెక్క పని చేస్తున్న రించెన నాంగ్యాల్తో పెళ్లి చేశారు.
కొంత కాలానికి వీధిదీపాలు అక్కడక్కడ వచ్చాయి. కానీ చాలా గ్రామాల్లోని ఇళ్లల్లో లైట్లు లేవు. గుర్మెట్కి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. ఆర్థికంగా వారు చాలా ఇబ్బందులు పడ్డారు. దీంతో, గుర్మెట్ సంపాదన కోసం ఏదొక పని చేయాలని నిర్ణయించుకుంది. ఉపాధి చూపండంటూ తెలిసిన వాళ్లందరినీ కోరింది. ఆ ప్రయత్నంలో ఆమెకు అవమానాలు కూడా ఎదురయ్యాయి. ఆ సమయంలో రాజస్థాన్‌లో సోలార్ ఇంజనీరింగ్ సంస్థ ఒకటి శిక్షణ ఇచ్చి, ఉపాధి చూపుతుందని తెలిసింది. పదేళ్లు, మూడేళ్ల పిల్లల బాధ్యతను భర్తకు అప్పజెప్పి 2015లో శిక్షణ కోసం వెళ్లింది. రాజస్థాన్‌లోని బేర్‌ఫుట్ కాలేజీలో గ్లోబ్ హిమాలయన్ ఎక్స్‌పెడిషన్ (జిహెచ్ఇ) వారు ఆరు నెలల పాటు సోలార్ గ్రిడ్లపై శిక్షణ ఇచ్చారు. శిక్షణలో ఆమె తప్ప మిగతా అందరూ మగవాళ్లే! అయినా వెపకడుగు వేయకుండా ఎంతో శ్రద్ధతో ఆ శిక్షణ పూర్తి చేసింది.
మొదట తన గ్రామంలోనే సోలార్ గ్రిడ్ని అమర్చి వెలుగులు తీసుకొచ్చింది. దీంతో గ్రామస్తులు 'ఆడపిల్లవైనా ఊరికి వెలుతురు తీసుకొచ్చావు' అంటూ ఆమెను అభినందించారు. తర్వాత సంస్థ ఆదేశాల మేరకు లడఖ్, మేఘాలయల్లోని మారుమూల శిఖర గ్రామాల్లో సౌర విద్యుత్ కల్పించే పనుల్లో చురుగ్గా పాల్గొంది. ఎత్తైన కొండలు, విపరీతమైన మంచు కురిసే గ్రామాలు, రవాణా సౌకర్యం లేని ఊళ్లల్లో పనిచేసేందుకు చాలామంది మగవాళ్లు ఎవరూ ముందుకు రాలేదు. గుర్మెట్ మాత్రం 'ఆ పని నేను చేస్తాన'ని చెప్పడంతో ప్రభుత్వం నుంచి వచ్చిన కాంట్రాక్టును ఆ సంస్థ ఒప్పుకుంది. రహదారి సరిగ్గా లేని 50 మారుమూల గ్రామాలకు ఆమె రిమోట్ సోలార్ సామగ్రిని మోసుకుంటూ వెళ్లింది. ఎత్తైన ప్రదేశాల్లో కూడా లైట్లు బిగించి సెహబాస్ అనిపించుకుంది. 2017లో లింగ్‌షెడ్ గ్రామానికి వెళ్లింది. అక్కడికి చేరుకోటానికి సుమారు 6 గంటల ప్రయాణం చేయాలి. అయినా సరే వెళ్లిమరో వ్యక్తి సహాయంతో 97 ఇళ్లకు 10 రోజుల్లో లైట్లు అమర్చింది. కొన్నిచోట్ల భాష తెలియకపోయినా పనిని దిగ్విజయంగా కానిచ్చింది. గుర్మెట్ను చూసి మరో అమ్మాయి కూడా శిక్షణ తీసుకుంది. గుర్మెట్కి సహాయకురాలిగా పనిచేస్తోంది. ఇప్పుడు గుర్మెట్ ఆంగ్మో ఆసక్తి ఉన్న యువతకు సోలార్ సిస్టం ఏర్పాటుపై శిక్షణ కూడా ఇస్తోంది.