Apr 05,2021 18:34

ఢిల్లీకి చెందిన రిపు డామన్‌ బెవ్లీ వృత్తిపరంగా ఇంజినీరు. ఉద్యోగరీత్యా తీరికలేని జీవితం ఆయనది. అయినా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్నాడు. ప్లాగింగ్‌ పద్ధతిలో (రన్నింగ్‌ చేస్తూ చెత్తను ఏరడం) ఇప్పటివరకు 150 టన్నుల వ్యర్థాలను సేకరించాడు. తనతో పాటు కొంతమంది యువతను, మహిళలను కలుపుకుని ముందుకు పోతున్నాడు. ప్రతిరోజూ ఉదయాన్నే అందరూ కలిసి పెద్ద గోనెే సంచులు పట్టుకొని పరుగుతీస్తూ చెత్తను ఏరుతున్నారు. జాగింగ్‌ చేస్తూ...వంగి, కూర్చొని...వివిధ భంగిమలతో చెత్తను ఏరడం ద్వారా ఫిట్‌నెస్‌ పెంచుకుంటున్నారు. ఇలా గత ఆరు సంవత్సరాలుగా డామన్‌ చెత్తను ఏరుతున్నాడు. దీంతో 'ఇండియా ప్లాగింగ్‌ స్టార్‌'గా సోషల్‌మీడియాల్లో మంచి గుర్తింపు వచ్చింది.

ఒక పక్క చెత్త ఏరుతూనే మరొపక్క 'ఎక్కడబడితే అక్కడ చెత్త వేయకూడదని' అందరికీ సూచనలు చేస్తున్నాడు. పర్యావరణం పట్ల సామాజిక బాధ్యత నిర్వహించాలని అవగాహన కల్పిస్తున్నాడు. అందరూ కలిసి సెలవు దినాల్లో అటవీ ప్రాంతంలో, వ్యర్థాలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలను ఎంచుకొని, వందల కి.మీ. మేర పరుగు తీస్తూ చెత్తను, ప్లాస్టిక్‌ పదార్థాలను సేకరిస్తున్నారు. ఈ ప్లాగింగ్‌ పద్ధతిని జాతీయస్థాయిలో ఉద్యమంగా నడపాలనుకుంటున్నాడు డామన్‌.

చెత్త ఏరుతూ రన్నింగ్

ఈ కార్యక్రమంలో వందల సంఖ్యలో స్కూలు, కాలేజీ పిల్లలు, గృహిణులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులూ పాల్గొంటున్నారు. చెత్త యేరడం ఒక్కటే అయితే ఇంత మంది పాల్గొనేవారు కాదేమో! రన్నింగ్‌ చేస్తూ చెత్త యేరడం అనే పద్ధతి నచ్చి చాలా మంది సోషల్‌మీడియా ద్వారా సంప్రదించి డామన్‌ టీమ్‌లో చేరుతున్నారు. ఇప్పటి వరకూ కోటి మంది ఇందులో పాల్గొన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రకృతికి మేలు చేసే సూచనల బోర్డులతో కొంతమంది ముందుకునడవడం ఆ ప్రాంతం వారిని ఎక్కువగా ఆకర్షిస్తోందంటాడు డామన్‌. ఈ కార్యక్రమానికి మద్దతుగా ప్లాగింగ్‌ ప్రదేశాల్లో కొంతమంది వ్యాపార వర్గాలు ఉచిత భోజన సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ఇతను చేస్తున్న కృషికి పలు గుర్తింపు అవార్డులు వచ్చాయి. అంతేకాదు... స్థానిక పాఠశాలల పాఠ్యాంశాల్లో పర్యావరణ రక్షకుడిగా డామన్‌ పేరును కూడా చేర్చారు.

 

చెత్త ఏరుతూ రన్నింగ్