Jul 30,2021 07:09

    ఒడిషాకు చెందిన 75 ఏళ్ల అంతర్యామి సాహూ పర్యావరణ పరిరక్షణ కోసం స్వయంగా చేతితో రాసిన పోస్టర్ల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాడు. పర్యావరణ పరిరక్షణ అంటే కేవలం చెట్లు నాటడమే కాదని, వన్యప్రాణులతో పాటు క్రిమి కీటకాలనూ రక్షించాలంటాడు. చిన్నతనం నుంచి ఇప్పటివరకు 30 వేలకు పైగా మొక్కలను నాటాడు. ఇప్పటికీ సైకిల్‌పైనే ప్రయాణిస్తూ తన అభిరుచిని, ప్రకృతి పట్ల ప్రేమను చూపిస్తాడు. అందుకే ఆయన్ని అందరూ 'గచ్చా సర్‌' (గచ్చా అంటే చెట్టు) అని పిలుచుకుంటారు.
    కాంటిలో గ్రామానికి చెందిన అంతర్యామి 11 ఏళ్ల వయసు నుంచే మొక్కలు నాటడం ప్రారంభించాడు. పాఠశాల ప్రాంగణం, గ్రామంలోని బహిరంగ ప్రదేశాల్లో మొక్కలు నాటేవాడు. అతని వయస్సుతో పాటు చెట్ల పట్ల ప్రేమ పెరిగింది. 1973లో ఉపాధ్యాయ వృత్తిని ప్రారంభించిన అంతర్యామి అనేక మంది విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణ పట్ల అభిరుచిని పెంచాడు. విద్యార్థుల చేత సాల్‌, టేకు, మర్రి, మామిడి, భారతీయ బీల్‌, అత్తి వంటి 20 వేల మొక్కలను నాటించాడు. భారీ ప్లాంటేషన్లను నడిపాడు.
    అయితే, కేవలం పచ్చదనాన్ని పెంచడం వల్ల క్షీణిస్తున్న పర్యావరణాన్ని మెరుగు పరచలేమంటాడు అంతర్యామి. 'అడవులను, చెట్లను రక్షించుకోవాలి. అడవులు ఆహుతి కాకుండా చర్యలు తీసుకోవాలి.' అంటాడు. అలాగే, చిలుకలు తదితర పక్షులను బందీలుగా ఉంచడాన్ని వ్యతిరేకిస్తూ అంతర్యామి 'నాట్‌ టు కేజ్‌' పేరుతో ప్రచారం సాగించాడు.
     పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి అంతర్యామి స్వయంగా జంతువులు, చెట్ల డ్రాయింగులు వేసి పోస్టర్లను తయారు చేస్తాడు. పాంగోలిన్‌, గుడ్లగూబ, జింక, ఏనుగు, సీతాకోకచిలుకలు, బల్లులు, గబ్బిలాలు, మిడత, డ్రాగన్‌ఫ్లై, లేడీబగ్‌ వంటి 40 స్థానిక జాతులపై పోస్టర్లు చేస్తాడు. తన అభిప్రాయాలను పంచుకునేందుకు బహిరంగ కార్యక్రమాలు, సామాజిక సమావేశాల సమయంలో వాటిని తీసుకువెళతాడు. అంతర్యామికి నాయగ, బౌధ్‌, ఫుల్బానీ జిల్లాలు ప్రకతి కతుబంధు పురస్కారం ప్రదానం చేశాయి. రాష్ట్ర స్థాయిలో అశోక్‌ స్మతి అవార్డు, ప్రకతి మిత్రా పురస్కారాలను అందుకున్నాడు.
    పోస్టర్ల ద్వారా తన అభిప్రాయాన్ని ప్రజలతో పంచుకోవడానికి అంతర్యామి ఇటీవల ఫేస్‌బుక్‌లో చేరాడు. పోస్టర్లకు వస్తున్న లైకులు, షేర్లు తన సందేశం వ్యాపించడాన్ని సూచిస్తుందంటాడు. ''మొక్కలను నాటడమనేది సామాజిక ప్రయోజనం కోసం చేసే సేవ. ఇది మానవత్వ చర్య. నేను వేలాది మొక్కలను నాటగలిగితే, అనేక మంది చేతులు కలిపితే అనేక వేల మొక్కలు నాటవచ్చు'' అంటున్నాడు అంతర్యామి.