Dec 05,2021 19:20

పర్యావరణ రక్షకులుగా ప్రకృతిని కాపాడే పనిలో మనకు ఎంతోమంది కనిపిస్తారు. అలాంటివారిలో ఒకరు మధ్యప్రదేశ్‌ బాసోండ్‌ గ్రామానికి చెందిన జైరామ్‌ మీనా (52) ఒకరు. 12 ఏళ్ల వయసు నుంచే మీనా మొక్కలు నాటడమే తన లక్ష్యంగా చేసుకున్నారు. మొదట తన గ్రామం చుట్టుపక్కల ఎక్కడ ఖాళీ స్థలం దొరికితే అక్కడ మొక్కలు నాటారు. అలా ఈ 40 ఏళ్లలో లక్షలాది చెట్లు ఎదిగేలా చేశారు. తన గ్రామానికి ఆనుకొని వెళ్లే రహదారి మొత్తం వేప, మర్రి చెట్లతో నిండివుండడానికి కారణం ఆయనే. బాసోండ్‌లో కాలువల పక్కన, ప్రభుత్వ భూమిలో, పోలీసు స్టేషన్‌ కాంపౌండ్‌లలో, పాఠశాలలు, దేవాలయాల్లో కనిపించే మొక్కలన్నీ మీనా నాటినవే. ఇప్పుడతను పొరుగు రాష్ట్రాలైన రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌లో కూడా మొక్కలు నాటే పనికి శ్రీకారం చుట్టారు.
మొట్టమొదట మీనా తన తాత చనిపోయినప్పుడు అతని జ్ఞాపకార్థంగా 11 మొక్కలు నాటాడు. ఆ తరువాత 1100 మొక్కలు నాటాలన్న లక్ష్యం పెట్టుకున్నాడు. ప్రతిసారి తన లక్ష్యాన్ని పెంచుకుంటూ పోయేవారు. ఇటీవలె 11 లక్షల మొక్కల లక్ష్యాన్ని అధిగమించాడు.
ప్రతిఫలం ఆశించకుండా మానవాళి మనుగడకై తనవంతు సేవ చేస్తున్న మీనా ఓ పేద రైతు. నలుగురు కుటుంబ సభ్యులను పోషించే బాధ్యత ఉన్నవాడు. కుటుంబ బాధ్యతల్లో తలమునకలవుతున్నా తన అభిరుచిని మాత్రం వదులుకోలేదు. సొంతంగా నర్సరీని ఏర్పాటు చేసుకున్నాడు. విత్తనాల నుంచి మొక్కలు సేకరించడమంటే ఎంతో ఇష్టం. విత్తనాలు సేకరించే పనిలో స్థానికంగా ఉండే పిల్లలను సాయం కోరతాడు. 'పిల్లలు ఆడుకునే చోట ఎక్కడైనా విత్తనాలు కనపడితే నాకు తెచ్చివ్వమని అడుగుతాను. అందుకు ప్రతిఫలంగా వారికి బిస్కెట్లు ఇచ్చేవాణ్ణి' అంటాడు నవ్వుతూ. ప్లాస్టిక్‌ సంచుల్లో ఈ విత్తనాలను భద్రపరుస్తూ 'చాలామంది రైతులు ఎరువులు, క్రిమిసంహారక మందులను వాడిన తరువాత ఆ ప్లాస్టిక్‌ సంచులను అలాగే వదిలేస్తారు. వాటిని సేకరించి అందులో విత్తనాలను భద్రపరిచి మొక్కలు మొలకెత్తేలా చేస్తాను' అంటారు మీనా.
మొక్కలు నాటే క్రమంలో సైకిల్‌పై సుదూరం ప్రయాణించిన అనుభవం కూడా ఉందతనికి. సైకిల్‌పై బకెట్లతో నీళ్లు తీసుకునివెళ్లి వాటిని తడపడం ఆయన దినచర్యలో భాగం. ఆ తరువాత ఆయన సంకల్పం చూసిన ప్రజలు స్వచ్ఛందంగా అతని ప్రయాణంలో కలిసివచ్చారు. 20 ఏళ్ల క్రితమే రాష్ట్ర అటవీ శాఖ జైరామ్‌ను తమ వాలంటీర్‌గా చేసుకుని సైకిలు, కొన్ని విత్తనాలు ఇచ్చి మొక్కలు నాటే పనిని అప్పజెప్పింది. అప్పటినుంచి తనకిష్టమైన పనిని అధికారికంగా చేస్తున్న మీనా 4వ తరగతి వరకే చదివారు. అతని ప్రాంతంలో పెరిగే మొక్కల పుట్టుపూర్వోత్తరాలు చెప్పడంలో మాత్రం ఎంతో పరిణితి చూపిస్తాడు.
ఎంతదూరమైనా వెళ్లి మొక్కలు నాటే మీనాని చూసి మొదట్లో అందరూ అతన్నో పిచ్చివాడిగా భావించేవారట. చివరికి అతని భార్యాపిల్లలు కూడా అలాగే అనుకునేవారంటారు ఆయన. క్రమంగా వారి ఆలోచనల్లో మార్పు వచ్చింది. అతని నివాస ప్రాంతమంతా పచ్చని మొక్కలతో నిండిపోయి వందలాది పక్షులు, నెమళ్లు తమ ఆవాసంగా మార్చుకున్నాయి. తన ఇంటితో పాటు గ్రామ పర్యావరణంలో కూడా గొప్ప మార్పు వచ్చింది. 2006లో 'అమృతా దేవీ బిష్ణోరు' అవార్డు పొంది అందరి దృష్టిని ఆకర్షించాడు. 'కొంతమందికి మద్యం తాగితే ఆనందం వస్తుంది. మరికొంతమంది ఇష్టమైన తిండి తింటే సంతోషం. నాకు మాత్రం నేను నాటిన విత్తనాలు మొక్కలుగా మారి వృక్షాలుగా పెరుగుతుంటే అమితానందం కలుగుతుంది' అంటారు మీనా.
'నేను నా జీవితాంతం ప్రజలకు ముఖ్యంగా పిల్లలకు పక్షులు, జంతువులు, మన జీవితంలో వాటి ప్రాముఖ్యత గురించి బోధించాలను కుంటున్నాను. మనకు వ్యవసాయమే ప్రధానాధారం. ఏళ్ల తరబడిగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. వాటిని సంరక్షించడంలో, వ్యవసాయం నిలకడగా ఉండడంలో చెట్లే కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే నేను జీవించి ఉన్నంతకాలం మొక్కలు
నాటుతూనే ఉంటాను' అంటారు మీనా.