Aug 22,2021 11:46

ఈ నెల 22వ తేదీ రక్షా బంధన్‌ సందర్భంగా...

'అన్నయ్యా! నేను కంపెనీలో జాయినవ్వాలి అనుకుంటున్నా బావ ఒప్పుకోవడం లేదు.. నువ్వైనా చెప్పు..!'
'అంత కష్టం ఎందుకు వచ్చింది చెల్లి ఇప్పుడు?'
'కరోనా వలన ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్ల పరిస్థితి దయనీయంగా మారింది అన్నయ్యా. నీలానే నాకూ ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని అనుకున్నా, కానీ రాలేదు. నాకు అసలే ఇద్దరు ఆడపిల్లలు. వాళ్ల ఖర్చులకు అవసరం వస్తాయి. వాళ్లకి పెద్దయ్యాక చాలా ముచ్చట్లు చేయాలి కదా!' అంటూ ఫోన్‌లో చెప్పుకుంటూ వెళ్తుంది వనజ.
'చెల్లి నువ్వు చెప్పింది కూడా బాగానే ఉంది. బావ ఏమన్నాడు మరి?'
'నా వ్యాపారం బాగానే ఉంది కదా! నువ్వు కంపెనీలో చేయాల్సిన అవసరం లేదు. నీకు అంతగా కావాలంటే ఇంట్లో టైలరింగ్‌ పెట్టుకో అన్నాడు అన్నయ్యా..!'
'బావ చెప్పింది బాగానే ఉంది కదా చెల్లి!'
'టైలరింగ్‌తో పాటు కంపెనీలో కూడా చేస్తా అన్నయ్యా. అప్పుడు రెండు వైపులా ఆదాయం వస్తుంది కదా!'
'సరే చెల్లి. నేను 'నాడు నేడు' కోసం స్కూల్లో ఉన్నా. మళ్లీ చేస్తాను.'
'సరే అన్నయ్యా!' అంటూ ఫోన్‌ పెట్టేసింది వనజ.

                          ***

అది రెండు సంవత్సరాల క్రితం
డీఎస్సీ కోచింగ్‌ సెంటర్‌లో వెయ్యిమంది ఉన్నారు. ఉద్యోగం సాధించాలనే తపన అందరిలోనూ ఉంది. ఐదేళ్ల తర్వాత పడిన నోటిఫికేషన్‌ అది. ఉద్యోగాలు కూడా తక్కువే ఉన్నాయి. అందుకే ఎవరూ ఛాన్స్‌ మిస్‌ చేసుకోకూడదు అనుకున్నారు.
లేట్‌గా జాయినయ్యింది వనజ. అక్కడ మహిళల శాతం చాలా ఎక్కువ. పురుషులు మాత్రం వందలోపే. తెలుగు క్లాస్‌లో 'మార్కెట్‌లో దొరికే ప్రతి పుస్తకం కొనాలని అనుకోవద్దు. ముందు అందరి దగ్గరా అకాడెమీ పుస్తకాలు ఉండాలి. మూడో తరగతి నుండి పదో తరగతి వరకూ తెలుగు వాచకాలు ఉండాలి. పాయింట్‌ టూ పాయింట్‌ ఈ పాటికి చదివేసి ఉండాలి. టెక్ట్స్‌బుక్స్‌ లేకుండా ఉన్న మేధావులు ఉంటే అర్జంట్‌గా మీ ఇంటి పక్కన పిల్లలు దగ్గర గానీ, పాత పుస్తకాల దుకాణంలో గానీ, ప్రభుత్వ పాఠశాలలోగానీ తీసుకోండి'. అని తెలుగు మాష్టారు చెప్పారు.
వనజ దగ్గర ఒక్క ఆరో తరగతి పుస్తకం తప్ప మరో పుస్తకం లేదు. ఇదే విషయం పక్కన కూర్చున్న కల్యాణితో చెప్పింది.
'అసలే లేట్‌గా జాయినయ్యావు. పుస్తకాలు కూడా లేవా?' అంటూ ఎద్దేవా చేసింది.
శ్రమ జీవితం ఉండే తనకి ఆ మాట చాలా ఇబ్బందిగా అనిపించింది. 'ఎలా ఎలా?' అనుకుంటూ ఏడుస్తూ ఉంది. బయటికి కన్నీళ్లు రాకుండా ఒక కుర్చీలో కూర్చుండిపోయింది.
ఇది గమనించిన సూర్య 'ఏమైంది?' అని అడిగాడు.
'ఏమి లేదండి!' అంటూ అక్కడ నుండి వెళ్లిపోదాం అనుకుంది.
'చెల్లీ! నా నుండి తప్పించుకుంటున్నావా? ఉద్యోగం నుండి తప్పించుకుంటున్నావా?' అన్నాడు సూర్య అపురూపంగా.
ఆ మాటలో ఏదో అనుబంధం కలిగింది వనజకి.
ఇన్నాళ్లు ఒక అన్నయ్యా లేడనే భావన వనజకు చిన్నప్పుడు నుండి ఉంది. కానీ సూర్య పిలుపులో ఆ అనుబంధం కలిగేలా చేసిందని అనుకుని.. 'నా దగ్గర పాఠ్య పుస్తకాలు లేవన్నయ్యా!' అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
'ఇక్కడ దగ్గరలోనే పాత పుస్తకాల షాప్‌ ఉంది. అక్కడ దొరుకుతాయి నేను తీసుకెళ్తాను.'
ఎందుకో ఆ మాట భయంగా అనిపించింది వనజకి. కొన్ని అనుమానాలు కూడా కలిగాయి.
'ఫరవాలేదు మీకు ఎందుకు శ్రమా?' అంటూ అక్కడ నుండి గబ గబ నడిచి, వెళ్లిపోయింది.
సూర్య వనజ వైపు చూస్తూ అక్కడ నుండి క్లాస్‌కి వెళ్లిపోయాడు.
తర్వాత రోజు.. 'హమ్మయ్య ఎలాగైతేనే సూర్య అన్నయ్య వల్ల పుస్తకాలు దొరికాయి!' అంటూ సౌమ్య, దేవిక మెట్లు దగ్గర అనుకుంటూ రావడం వనజ విన్నది.
'ఏవండీ పాఠ్యపుస్తకాలు నాకూ కావాలి!' అంటూ వెళ్లే వారిని ఆపి, అడిగింది వనజ.
'మీ పేరు ఏమిటో నాకు తెలియదు. ఇక్కడ పుస్తకాలు ఎక్కడ అమ్ముతారో మాకూ తెలియదు. అందరికీ సూర్య అన్నయ్యే తెస్తారు!' అంది దేవిక.
'సూర్య అన్నయ్య అంటే ఎవరో నాకూ చూపిస్తావా?' అడిగింది వనజ.
'అన్నయ్య మీకు తెలియదా?' అని దేవిక, సౌమ్య ఒకేసారి అడిగారు.
లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది వనజ.
'అదిగో మాటల్లోనే అన్నయ్య వస్తున్నాడు' అనగానే.. తల పైకెత్తి చూసింది వనజ.
'తనని తొలిసారి చెల్లి అని పిలిచిన అన్నయ్య. అయ్యో ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాను' అని పశ్చాత్తాపం పడింది.
'సూర్య అన్నయ్యా! ఈమెకి కూడా పుస్తకాలు కావాలంట. తెప్పించగలవా?' అని సౌమ్య.. వనజను చూపిస్తూ చెప్పింది.
తల వంచుకుని మాట్లాడలేకపోయింది వనజ.
'సరే తప్పకుండా పుస్తకాలు తెప్పిస్తాను!'
సౌమ్య, దేవిక అక్కడ నుండి వెళ్ళిపోయాక.. 'సారీ అన్నయ్యా! మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. క్షమించండి!' అంది వనజ.
'ఫర్వాలేదు మా.. ఒక్కొక్కరు ఒక్కోలా అర్థం చేసుకుంటారు. ఇంతకీ నీకు ఏం పుస్తకాలు తేవాలి?' అని అడిగాడు.
తనకి కావల్సిన పుస్తకాలన్నీ చెప్పింది వనజ. తర్వాత రోజు సూర్య పుస్తకాలు ఇచ్చాడు.
వనజ చాలా సంతోషపడి 'చిన్నప్పటి నుండి అన్నయ్య లేడని బాధపడ్డాను, ఇక ఆ లోటు తీరిపోయింది.' అనగానే.. సూర్య నవ్వాడు.
ఇక అక్కడ నుండి అందరూ పరీక్ష కోసం తీవ్రంగా శ్రమించారు.
సూర్య కోచింగ్‌ సెంటర్‌కు నడుస్తుంటే.. వనజను ఎవరో వ్యక్తి బండి మీద నుండి దించడం గమనించాడు.
అతను వెళ్లిపోగానే వనజ సూర్యను చూసింది.
'ఎవరు?' అని అడిగాడు సూర్య.
'మా ఆయన' అని చెప్పింది వనజ.
'అవునా ఈ మధ్యనే పెళ్లి అయ్యిందా?'
'లేదు అన్నయ్యా! నాకు పెళ్లయ్యి పదేళ్లు అవుతుంది!'
'అవునా నాకు అలా అనిపించలేదు!' అంటూ కోచింగ్‌ సెంటర్‌ మెట్లు ఎక్కుతూ మాట్లాడుకున్నారు.
'మరో విషయం అన్నయ్యా! నాకు ఇద్దరు ఆడపిల్లలు సుదీప్తి, హర్షిత!'
'అసలు నమ్మలేకపోతున్నా చెల్లి.'
'చిన్నప్పుడే అంటే నాకు పదోతరగతి ఉన్నప్పుడే పెళ్లి చేసేశారు. బావ చాలా మంచివారు. నాకు ఏ లోటూ రానివ్వరు. అందుకే పెళ్లయ్యిన తర్వాత చదువుకు ఇబ్బంది కలగలేదు. బావ సంపాదనలో లోటు లేదు, కానీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి కదా!'
'నిజమే చెల్లి! నువ్వు బాగా కష్టపడు. నీకు కచ్చితంగా ఉద్యోగం వస్తుంది.'
'థాంక్స్‌ అన్నయ్యా!' అంటూ ఇద్దరూ క్లాస్‌ రూంలోకి వెళ్లిపోయారు.
సూర్యకి అక్క తప్ప, చెల్లి లేదు. కానీ వనజ మాటలు, ప్రవర్తన సొంత చెల్లి ఉంటే ఎలా ఉంటుందో అచ్చం అలానే ఉంది.. అని అనుకున్నాడు మనసులో.
తర్వాత రోజు నుండి వనజకి కావాల్సిన పుస్తకాలు, పాత పరీక్ష పేపర్లు ఇచ్చి బాగా ప్రోత్సహించాడు.
అందుకు అనుగుణంగానే వనజ కూడా చదవడంలో వెనకడుగు వేయలేదు.
ఒకరోజు సూర్య ఇన్‌స్టిట్యూట్‌ రూమ్‌లో చదువుతున్న సమయంలో దేవిక వచ్చి 'అన్నయ్యా వనజకి ఇచ్చిన మోడల్‌ పేపర్స్‌ నాకు కూడా కావాలి!' అని అంది.
'ఇంక లేవు. చెల్లి వనజ దగ్గర జెరాక్స్‌ తీసుకో!' అన్నాడు.
'నేనే తనకన్నా ముందు పరిచయమయ్యాను. కానీ నీకు వనజ చెల్లి ఎక్కువ అయిపోయిందా?' అంటూ ఏడ్చుకుంటూ వెళ్లిపోయింది.
ఒక నిమిషం ఏం జరుగుతుందో అర్థం కాలేదు.
అక్కడ నుండి సూర్య అభిమానం పంచుకున్న చెల్లెళ్లు ఒక్కొక్కరూ దూరం అయ్యారు. సూర్య చాలా బాధపడ్డాడు. కానీ వాళ్లకి అడిగిన వెంటనే సహాయం మాత్రం చేస్తూనే ఉన్నాడు. కానీ వాళ్లు అప్పటిలా అభిమానం చూపించలేదు.
ఒకరోజు వనజ క్లాస్‌కి రాలేదు
సూర్య 'చెల్లి ఎందుకు రాలేదు?' అని ప్రతి ఒక్కరినీ అడిగాడు.
కానీ ఎవరూ సమాధానం చెప్పలేదు. ఫోన్‌ చేసినా ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఏం జరిగిందో ఏమో అని ఆవేదన చెందాడు.
తరువాత రోజు క్లాస్‌కి వచ్చింది వనజ.
'చెల్లి ఏమైంది మా.. రాలేదు క్లాస్‌కి?'
'జ్వరంగా ఉంది అన్నయ్యా!'
'అవునా మరి తగ్గిందా?'
'లేదు అన్నయ్యా! క్లాసెస్‌ పోతాయని వచ్చేశాను!'
'ఎందుకు మా.. జ్వరంతో రావడం నేను ఉన్నా కదా చెల్లి!'
'ముందు ఆరోగ్యం చెల్లి' తర్వాతే ఏదైనా..
'అయిపోయిన క్లాసెస్‌ నేను చెప్తాను చెల్లి'
వనజ సూర్య మీద ఆరాధన భావంతో చూసి 'నిజం చెప్తున్నా అన్నయ్యా' నాకు సొంత అన్నయ్య ఉన్నా ఇలా చూడడేమో'
'నేను ఇన్‌స్టిట్యూట్‌కి వచ్చి ఉద్యోగం సాధిస్తానో, లేదో కానీ, నీలాంటి మంచి అన్నయ్యను పొందాను' అది చాలు..
కానీ 'అన్నయ్య నా వల్లే మిగతా వాళ్లు దూరమవుతున్నారు నీకు.'
'అదేం పెద్ద విషయం కాదు చెల్లి.. నువు వెళ్లి హాస్పిటల్లో చూపించుకో!' అని పంపేశారు.
సూర్య మిగతా చెల్లెళ్ల దగ్గరకి వెళ్తుంటే.. 'వనజ లేకపోవడం వల్లే మా దగ్గరకి వచ్చావు' అంటూ ఎత్తి పొడిచేవారు.
దీనికి సూర్య 'అవును వనజ లేకపోవడం వల్లే మీ దగ్గరకి వచ్చాను.. కానీ వనజ రాకముందు మీ దగ్గరే ఉండేవాడిని.. ఇది నిజం.. ఒక్క విషయం అర్థం చేసుకోండి. మీ పరిస్థితులు వేరు.. వనజ చెల్లి పరిస్థితి వేరు.. తనకి చిన్నప్పుడే పెళ్లి చేసేశారు.. అప్పటికి వనజకి పెళ్లి అంటే ఏమిటో కూడా అవగాహన లేదు .. కానీ పెళ్లి చేసుకుని, చదువును నిర్లక్ష్యం చేయలేదు. వాళ్లు ఉండేది కొండ ప్రాంతంలో. ఆటో, బస్సు సౌకర్యం కూడా తక్కువ. అలా అని ఇబ్బంది పడకుండా ఇంటర్‌, డైట్‌ రెండూ కంప్లీట్‌ చేసింది. ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. అత్త, మామ లేకపోవడం వల్ల పిల్లల పని, ఇంటి పనితో చాలా కష్టపడింది. బావ చిన్న వ్యాపారం. ఉదయం వెళ్తే రాత్రికిగానీ ఇంటికి రారు. అలాంటి పరిస్థితి తనది. ఉదయం నాలుగు గంటలకు లేచి, బావకి టిఫిన్‌, మధ్యాహ్నం భోజనానికి క్యారేజ్‌ కట్టాలి. పిల్లల్ని లేపి, స్కూల్‌కి సిద్ధం చేసి, బస్‌ కోసం కొంచెం దూరం నడిచి వెళ్లి.. వాళ్లని ఎక్కించాలి. అక్కడ నుంచి తిరిగొచ్చిన తర్వాత తనూ తయారై కాలేజీకి రావాలి. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదల, చదువుకోవాలనే తపనతో ఉన్న వనజకి నేను సాయం చేయడం తప్పా? ఉదయం నుండి రాత్రి వరకూ ఉరుకులు పరుగుల జీవితం తనది. నిజం చెప్పాలంటే వనజలాంటి కష్టం మీకు ఉండదు. ప్రతి పనిలో విసుగు చెందకుండా, కోపం పడకుండా ఎప్పుడూ నవ్వుతూ, నవిస్తూ తన కుటుంబంతో పాటు ప్రతి ఒక్కరితోనూ ప్రేమగా ఉంటుంది. ఈర్ష్యా, అసూయ తనకి ఉండవు. తన పిల్లలు పెద్దయ్యేసరికి ఏ ఇబ్బందీ ఉండకూడదని తన ఆలోచన. అప్పుడే అనిపించింది తనకు ఎలాగైనా ఉద్యోగం రావాలని.. అందుకు నా వంతు సాయం చేయాలని. ముఖ్యమైన పుస్తకాలు తెచ్చాను. ఎన్నో మోడల్‌ పేపర్స్‌ ఇచ్చాను. అంతే తప్ప మిమ్మల్ని దూరం చేసుకోవాలనే ఆలోచన ఎంత మాత్రం లేదు. మీరు కూడా ఇష్టమే చెల్లెళ్లు. వనజకి ఇచ్చినవి జిరాక్స్‌ తీసి ఉంచాను. మీకు ఇవ్వడం కోసమే!' అంటూ తన ఆవేదన వివరించాడు.
ఆ మాటలు విని దేవిక, సౌమ్య, కల్యాణి తమ తప్పును తెలుసుకుని, 'సారీ అన్నయ్య!' అంటూ 'తెలిసినవారే చూపించడం లేదు. ఈ రోజుల్లో అభిమానం.. అనుబంధం.. కానీ నీకు మాత్రం అనుబంధం చూపించడం వచ్చు. ఇక నుండి మేము నిన్న బాధ పెట్టము' అన్నారు.
దానికి సూర్య నవ్వి తన దగ్గర ఓల్డ్‌ మోడల్‌ పేపర్లు ఇచ్చి.. 'బాగా చదువుకొని, ఉద్యోగం సాధించాలి!' అని చెప్పాడు.
'తప్పకుండా అన్నయ్యా!' అంటూ అక్కడ నుండి వెళ్లిపోయారు.
కొన్ని రోజుల తర్వాత పరీక్షలు ప్రారంభమయ్యాయి. సూర్యకి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఉద్యోగం వచ్చింది.

                                            ***

చెల్లి వనజ కంపెనీలో జాయినవుతాను అని చెప్పగానే ఏదో దిగులుగా అనిపించింది సూర్యకి.
పెళ్లయిన దగ్గర నుంచి చెల్లి కష్టపడుతూనే ఉంది. ఇప్పుడు కూడా కంపెనీ అంటే తనకి సుఖం ఉండదు ఎలా? అని బాగా ఆలోచించాడు. కాసేపటి తర్వాత 'ఈ నిర్ణయం సరైంది' అని అనుకుని, రాఖీ పండుగకి తన ఇంటికి వెళ్తా కదా, ఇదే అమలు చేయాలనుకున్నాడు.
చెల్లి వనజ ఇంటికి వెళ్లాడు సూర్య.
'అన్నయ్యా!' అంటూ ఆప్యాయంగా పలకరించి 'బాగున్నావా?' అని అడిగింది.
'బాగున్నాను చెల్లి!' అన్నాడు సూర్య. వనజ ఒక ప్లేట్‌లో కుంకుమ, అక్షింతలు, రాఖీ, స్వీట్స్‌ తెచ్చింది. చాలా ఆనందంగా, ప్రేమతో రాఖీ కట్టింది.
సూర్య తన జేబులో ఉన్న రెండు లక్షల రూపాయలు ఇచ్చాడు. దీంతో వనజ ఆశ్చర్యపోయింది.
'అన్నయ్యా! ఎందుకు ఇంత డబ్బు నాకు? వద్దు' అంది.
దానికి సూర్య.. 'చెల్లి ఊరికనే కాదు.. మీ పిల్లల పేరు మీద డిపాజిట్‌ చేయి.. నెల నెల నాకు రెండు వేలు ఇవ్వండి. నువు కంపెనీలో జాయిన్‌ అవ్వవద్దు. ఉదయం నుండి రాత్రి వరకూ బావకోసం, పిల్లల కోసం కష్టపడుతుంది చాలు. ఇంట్లోనే టైలరింగ్‌ మెషిన్‌ ఉంది. కాబట్టి అవి కుట్టుకుని ఆనందంగా ఉండు' అన్నాడు.
'అన్నయ్యా నువు చాలా మంచివాడివి. కోచింగ్‌కి ఉద్యోగం సాధించలేకపోయినా.. నువ్వు అన్నయ్యగా పరిచయమవ్వడం దేవుడు ఇచ్చిన వరం. తోడబుట్టినవాళ్లు ఉన్నా చూడని ఈ రోజుల్లో నువ్వు బయటి నుండి వచ్చి, ఎంతో అనుబంధం చూపిస్తున్నావు. ఈ జన్మకి ఇది చాలు అన్నయ్యా!' అంటూ ఏడ్చేసింది.
'చెల్లీ.. నీ నుండి ఏడుపు రాకూడదు!' అంటూ ఓదార్చాడు. 'సరే అన్నయ్యా!' అంటూ తన చెంగుతో తుడుచుకుని, వంటింట్లోకి వెళ్లి బూరెలు, పులిహోర, పెరుగు వడలు తెచ్చి, సూర్య ముందు పెట్టింది.
'ఎందుకమ్మా...ఇప్పుడు ఇవ్వన్నీ? తినలేను... ఇన్ని తింటే లావయిపోతాను' అన్నాడు సూర్య.
'అన్నయ్యా నువు చూపించిన అనుబంధంలో సగమైనా నేను చూపించాలి కదా! మధ్యాహ్నం దాకా ఉండి, భోజనం చేసి వెళ్లాలి..!' అంది వనజ.
'సరే!' అంటూ సూర్య నవ్వాడు.

నల్లపాటి సురేంద్ర
94907 92553