
న్యూఢిల్లీ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్ఆర్ఇజిఎస్) కింద కార్మికులు పడిన శ్రమకు తగిన ప్రతిఫలం లభించడం లేదు. కష్టించి తెచ్చుకున్న వేతనాన్ని చేతికి దక్కించుకోవడంలో అష్టకష్టాలు పడుతున్నారని లిబ్టెక్ ఇండియా తన నివేదికలో తెలిపింది. ఉపాధి కార్మికులపై చేపట్టిన సర్వే ఆధారంగా లిబ్టెక్ ఈ నివేదికను విడుదల చేసింది. వేతనాలు బ్యాంకుల్లో జమ చేయడంతో... కార్మికులు పలుమార్లు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. వాటికయ్యే ప్రయాణ ఖర్చులు అధికమౌతున్నాయని, దీంతో వారికి వచ్చే ఆదాయం తగ్గిపోతోందని ఈ నివేదిక పేర్కొంది. మరోవైపు చెల్లింపుల సమయంలో బయోమెట్రిక్ లోపాలు, తప్పుడు సమాచారంతో పదేపదే కార్మికులు తిరస్కరణకు గురవుతున్నారని తెలిపింది. ఇలా పలువురు గ్రామీణ కార్మికులు వేతనాలు చేతికందక ఇక్కట్లు పడుతున్నారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి....
జార్ఖండ్‌కి చెందిన ఓ కార్మికుడి వివరాలను పరిశీలిస్తే.. వారంరోజుల పాటు శ్రమ చేసినందుకు అతనికి రూ. 1,026 చెల్లించాల్సి వుంటుంది. ఆ మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా అతని బ్యాంక్ ఖాతాకు జమచేస్తుంది. సుమారు 40 శాతం మంది ఆ నగదును విత్‌డ్రా చేసుకునేందుకు అనేక సార్లు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోందని అధ్యయనంలో వెల్లడైంది. వారి వేతనాలు జమ అయిన బ్యాంక్ శాఖ గ్రామానికి దూరంగా ఉండంతో.. అక్కడికి వెళ్లేందుకు అతనికి రూ. 53 ఖర్చు అవుతోంది. బాంక్‌లో విత్‌డ్రా చేసుకునేందుకు సుమారు నాలుగు గంటల సమయం పడుతుంది. తద్వారా ఆ వ్యక్తి ఒకరోజు వేతనాన్ని కోల్పోవలసి వస్తుంది. ఛార్జీల మొత్తం వంద రూపాయిలైతే.. ఆహారానికి రూ. 25 ఖర్చు చేస్తే.. మొత్తంగా రూ. 392 అవుతుంది. అంటే వారం రోజులకుగాను అతను పొందే వేతనంలో మూడోవంతు ఇక్కడే ఖర్చైపోతుంది. సాధారణ సమయాల్లోనే కార్మికుడు తన వేతనాన్ని పొందేందుకు ఇన్ని సవాళ్లు ఎదురైతే.. కరోనా మహమ్మారి సమయంలో .. భౌతిక దూరం, ఇతర సవాళ్లతో వేతనం పొందడం మరింత క్లిష్టతరంగా వుంటుందని లిబ్టెక్ అధ్యయనవేత్తలలో ఒకరైన సకినా ధోరాజీవాలా చెప్పారు.
2018-19 సర్వే ఆధరాంగా అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్శిటీ సహకారంతో జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌లకు చెందిన రెండు వేల మంది కార్మికులపై చేపట్టిన అధ్యయనం ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్లు ఆయన తెలిపారు. రెండేళ్లలో ఈ అధ్యయనం చేపట్టామని, గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంక్ శాఖలలో స్వల్ప మార్పులు తప్ప సవాళ్లు అదే విధంగా ఉన్నాయని అన్నారు. చాలా ప్రాంతాల్లో 20 గ్రామ పంచాయితీలకు ఒక బ్యాంక్ శాఖ మాత్రమే ఉంది. మరోప్రధాన సమస్య.. సమాచారం తెలియకపోవడమని అధ్యయనం పేర్కొంది. తమ ఖాతాలలో నగదు జమ అయినట్లు పదిమంది కార్మికులకు మాత్రమే మెసేజ్ వస్తుందని అన్నారు. దీంతో మూడో వంతు కార్మికులు తమ వేతనాలు జమ అయ్యాయో లేదో తెలుసుకునేందుకు బ్యాంక్‌లకు వెళ్లాల్సిందే. వారిలో మరో పావుశాతం మందికి సమాచారం వచ్చినా ఖాతాల్లో నగదు జమ కావడం లేదని గుర్తించినట్లు అధ్యయనంలో తేలింది.
జార్ఖండ్ నుండి 42 శాతం మంది, రాజస్థాన్ నుండి 38 శాతం మంది తమ వేతనాలు పొందేందుకు బ్యాంక్‌ల్లో నాలుగు గంటలకు పైగా వేచిచూస్తున్నారని అన్నారు. అయితే ఎపిలో కేవలం 2 శాతం మంది మాత్రమే ఈవిధంగా ఆలస్యాన్ని ఎదుర్కొంటున్నారు. మొత్తం మీద 45 శాతం మంది తమ వేతనాల నుండి 31రూపాయల ప్రయాణ ఖర్చులను మినహాయించుకోవాల్సిందే. వేతనాలను ఇంటి వద్ద అందించేందుకు కస్టమర్ సర్వీస్ పాయింట్లు, బాంకింగ్ కరస్పాండెంట్లు యత్నిస్తున్నప్పటికీ.. మరో 40 శాతం మంది మాత్రం తక్కువలో తక్కువ 11 రూపాయిలైనా ఖర్చు చేయాల్సి వస్తోందని తేలింది. 40 శాతం మంది బయోమెట్రిక్ వైఫల్యాలను ఎదుర్కొంటున్నారని అధ్యయనంలో వెల్లడైంది.
సాంకేతిక లోపాలు, బ్యాంక్ ఖాతా సమస్యలు, డేటా ఎంట్రీలో తలెత్తుతున్న లోపాల కారణంగా సుమారు 13 శాతం మంది కార్మికులు తిరస్కరణకు గురవుతున్నారు. వారిలో 77 శాతం మందికి చెల్లింపులు ఎందుకు తిరస్కరణకు గురయ్యాయో కూడా తెలియదు. అంటే సరిదిద్దడం సాధ్యం కాదని, వారికి భవిష్యత్తులో కూడా చెల్లింపులు జరుగుతాయన్న స్పష్టత లేదని తేలింది. వాస్తవానికి, గత ఐదేళ్లలో సుమారు రూ. 4,639 కోట్ల మేర చెల్లింపులు తిరస్కరించబడ్డాయని, వాటిలో రూ. 1,236 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని ప్రభుత్వ డేటా తెలిపింది.
ప్రస్తుతం కరోనా మహమ్మారితో కార్మికులకు పనిదొరకని పరిస్థితి ఏర్పడిందని అధ్యయనవేత్త ధోరాజీవాలా తెలిపారు. పదేపదే వేతనాలు తిరస్కరణకు గురవడంతో వ్యవస్థపై కార్మికులు విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉందని, ఈ పథకం నుండి కార్మికులు తప్పుకుంటున్నట్లు గుర్తించామని అన్నారు. వేతనాలు లేకపోతే శ్రమ చేయాల్సిన అవసరమేముందని వారు ప్రశ్నించారు.