Jul 30,2021 10:26

వాషింగ్టన్‌: అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించేందుకు వెళ్లిన విదేశీ విద్యార్థులను తిప్పి పంపేందుకు అగ్రరాజ్యంలో ప్రయత్నాలు మొదలయ్యాయా అంటే అవుననే చెప్పుకోవాలి. అక్కడ చదువు పూర్తయ్యాక విదేశీ విద్యార్థులు ఉండేందుకు వీలు కల్పిస్తున్న ఆపరేషనల్‌ ప్రాక్టీస్‌ ట్రైయినింగ్‌ ( ఒపిటి) కార్యక్రమాన్ని రద్దు చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఒపిటిని రద్దు చేయాలంటూ పలువురు చట్ట సభ్యులు..ప్రతినిధుల సభలో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు గనుక ఆమోదం పొందితే.. భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ఈ బిల్లును 'ఫెయిర్‌నెస్‌ ఫర్‌ హై-స్కిల్డ్‌ అమెరికన్స్‌ యాక్ట్‌'గా తాజా బిల్లును పిలుస్తున్నారు. దీనిపై చట్ట సభ్యుడు పాల్‌ ఎ గోసర్‌ మాట్లాడుతూ... హెచ్‌-1బీ వీసాలపై పరిమితి విధించడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని ఒపిటి తొక్కేస్తుందని ఆరోపించారు. చదువు పూర్తయ్యాక విదేశీ విద్యార్థులు మూడేళ్ల పాటు అమెరికాలో పనిచేసేందుకు ఈ కార్యక్రమం కొన్ని షరతులతో అనుమతిస్తోందని పేర్కొన్నారు. వారికి పేరోల్‌ పన్నుల నుంచి మినహాయింపు లభిస్తోందని, దీంతో అమెరికన్ల కన్నా 10-15 శాత తక్కువ వేతనాలు చెల్లించి..కంపెనీలు వీరిని నియమించుకుంటున్నాయని చెప్పారు. దీని ద్వారా స్థానిక యువతకు ఉద్యోగాలు లభించడం కష్టంగా మారిందన్నారు. ఒపిటి రద్దు కోసం సహచర చట్టసభ్యులు మో బ్రూక్స్‌, ఆండీ బిగ్స్‌, మ్యాట్‌ గేట్జ్‌లతో కలిసి బిల్లును ప్రవేశపెట్టినట్లు తెలిపారు. సెనేట్‌తో పాటు ప్రతినిధుల సభలోనూ డెమొక్రాట్లకే మెజార్టీ ఉన్న నేపథ్యంలో తాజా బిల్లు ఆమోదం పొందడం అంత సులభం కాదు. గోసర్‌ ఈ బిల్లును గతంలోనూ కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టడం గమనార్హం.