భూముల రీ సర్వేలో బాలారిష్టాలు డ్రోన్ ప్లైయింగ్లో సాంకేతిక సమస్య షేర్ మహ్మద్ పేటలో మాత్రమే పూర్తి

భూముల రీ సర్వేలో బాలారిష్టాలు
డ్రోన్ ప్లైయింగ్లో సాంకేతిక సమస్య
షేర్ మహ్మద్ పేటలో మాత్రమే పూర్తి
ప్రజాశక్తి-కృష్ణాప్రతినిధి
జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన భూముల సమగ్ర సర్వేలో పలు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో గత ఏడాది డిసెంబర్ 21న వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ భూముల రీ సర్వేలో సమస్యలు ఎదురవుతున్నాయి. డ్రోన్ ప్లైయింగ్లో సాంకేతిక సమస్యలు చోటు చేసుకోవడంతో ఈ ప్రక్రియ కొద్ది రోజులుగా నిలిచిపోయింది. సర్వే ఆఫ్ ఇండియా డ్రోన్ ఫ్లైయింగ్ పూర్తి చేసి గ్రామాలకు ఇచ్చిన మ్యాపింగ్ ఆధారంగానే క్షేత్రస్థాయిలో రీ సర్వే జరగాల్సి ఉంది. మొదటగా డివిజన్‌కు ఒకటి చొప్పున జిల్లాలోని నాలుగు డివిజన్లలో నాలుగు గ్రామాల్లో తొలుత రీ సర్వేకు హద్దులు గుర్తించారు. సాంకేతిక సమస్య కారణంగా మూడు గ్రామాల్లో డ్రోన్ ఫ్లైయింగ్ నిలిచిపోయింది. విజయవాడ రెవెన్యూ డివిజన్లోని జగ్గయ్యపేట మండలం షేర్‌మహ్మద్‌పేటలో మాత్రమే ఈ ప్రక్రియ పూర్తయింది. మచిలీపట్నం రెవెన్యూ డివిజన్లోని మచిలీపట్నం మండలం పొట్లపాలెం, నూజివీడు డివిజన్లోని నూజివీడు మండలం మర్రిబంధం, గుడివాడ డివిజన్లోని గుడివాడ మండలం మెరకగూడెం గ్రామాల్లో డ్రోన్ ప్లెయింగ్ నిలిచిపోయింది. దీని ద్వారా జరిగిన మ్యాపింగ్ ఆధారంగానే ఆయా గ్రామాల్లో క్షేత్రస్థాయిలో సర్వే రీ వెరిఫికేషన్ ప్రక్రియ జరగాల్సి ఉంది.
బేస్ స్టేషన్లు
జిల్లాలో ఉపగ్రహ ఆధారిత సర్వే కోసం ఐదు బేస్ స్టేషన్లు నిర్మించాల్సి ఉంది. అయితే జగ్గయ్యపేట, విజయవాడ రూరల్, తిరువూరు, పెడన ప్రాంతాల్లో బేస్ స్టేషన్ల నిర్మాణం పూర్తయి రీ సర్వేకు సంబంధించిన ప్రోగ్రాం ఇన్స్టాల్ చేశారు. నాగాయలంకలో బేస్‌స్టేషన్ నిర్మించినా సర్వే ప్రొగ్రాం ఇన్స్టాల్ చేయాల్సి ఉంది.
మండలానికి ఒక గ్రామంలో హద్దులు
తాజాగా మండలానికి ఒక గ్రామంలో రీ సర్వే ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆర్ఎస్ఆర్, అడంగల్ తదితర రికార్డుల ఆధారంగా విలేజ్ బౌండరీ (సరిహద్దులు) గుర్తించి స్ధిరీకరిస్తున్నారు. నివాస ప్రాంతాలకు 0 మార్కింగ్ వేశారు. తర్వాత 332 గ్రామాల్లో రీ సర్వే చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.